Saturday, August 16, 2008

ఒక్కసారి

ఒక్కసారి ఏమీ ఎరుగని పసితనంగా మారి
నీ వొడిలో పవళించాలని ఉంది
ఒక్కసారి నీ గాయాలన్నిటిని
అలా చేత్తో తీసేయాలని ఉంది
ఒక్కసారి అలసిన నీ నిర్లిప్తతని
అలుపెరుగని ఉత్సాహంగా మార్చాలని ఉంది
ఒక్కసారి సమయాన్ని వెనక్కి తిప్పి
నీతో ఆడాలని ఉంది
ఒక్కసారి నిన్ను చూడాలని
మాటాడాలని ఉంది
ఒక్కసారి కలుషమెరుగని
బాల్యాన్ని పంచుకోవాలని ఉంది
ఒక్కసారి ఉప్పెక్కి
నీపై ఊరేగాలని ఉంది
ఒక్కసారి జొరంలో నీ చేత
సేవ చేయించుకోవాలని ఉంది
ఒక్కసారి నీతో అన్నీ కనిపెట్టాలని ఉంది
మనం కట్టిన పిచ్చుకసమాధి
పగులగొట్టిన బల్లిగుడ్లు
వానపాములు గాజుపురుగులు
గొంగళీల దద్దుర్లు
సీతాకోక చిలుకలు రెక్కలు పట్టిన తూనీగలు
దొంగిలించిన జామకాయలు రేగుపళ్ళు
బడి ఎగ్గొట్టి సర్వే చేసిన రోడ్లు
తాతయ్య జేబుకి కన్నం వేసి నాకు తినిపించిన కిచిడీలు
సత్తార్ కిళ్ళీకొట్టు చాటున కాల్చిన సగం బీడీ ముక్క
నేల టికెట్టుతో లోనికివెళ్ళి బాల్కనీలో బయటికొచ్చిన మాట్నీ సినిమాలు
కలిసి తొక్కిన అద్దె సైకిళ్ళు
ఇంటి బందీ నుండి బయటపడేందుకు
మనం వేసిన ఎత్తులూ పైఎత్తులూ
దొరికినపుడు తాతమ్మ చేతిలో థర్డ్ డిగ్రీ తొడపాశాలు
శవాల వెనుక గులాంలో తడిచి కాలడం చూసిన కాష్టాలు
మిట్టమధ్యాహ్నం వేసవి విహారాలు
డాబాపై చల్లిన నీళ్ళు చుక్కలు లెక్కెడుతూ పడకలు
మండుతున్నా ఆత్రంగా తిన్న
సత్తు బేసిన్ కొత్త ఆవకాయ పచ్చడి ముద్దలు
పెరుగన్నం మామిడిపళ్ళు ఒళ్ళంతా సెగ్గడ్డలు
టపాసులతో ఎండిన మన మాడులు
నువ్వు కాల్చే ఢాంఢాం బాంబులు
నిను అనుకరిస్తూ అరచేతిలో పేల్చుకున్న సీమటపాకాయలు
శ్రీరామనవమి పందిళ్ళు ఉగాది సందళ్ళు
ఆదివారం నేలపై పడుకుని విన్న రేడియో నాటకాలు
కిందామీదా పడిన మల్లయుధ్ధాలూ
ఎక్కి దూకిన చెట్లూ గోడలూ
అమ్మతో తిట్లూ చీవాట్లూ
మనం చేసిన కోతి పనులూ
వేసిన గోడకుర్చీలూ
ముఖం చూస్తే చాలు పుట్టుకొచ్చే నవ్వులు
నాన్న పొడిచిన సూదిమందులు
మరిపించేదుకు నువ్వు పడ్డ తిప్పలు
ఎదిగేకొద్దీ ఎడబాటులు
పెరిగేకొద్దీ దూరాలు

ఒక్కసారి నీతో బతకాలని ఉంది
మరొక్కసారి నీతో నవ్వాలని ఉంది

(నా చిన్నతనాన్నంతా తనచుట్టూ అల్లుకున్న అన్నకి ఒక్కసారి ప్రేమతో అంకితం.)

Saturday, August 9, 2008

వీడుకోలు

8/8/8

టాటా వీడుకోలు... APAC, ఇంక శెలవు...

ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఎందరు నేస్తాలయారో... ఎన్ని జ్ఞాపకాలు మూటకట్టుకుని వెళ్తున్నానో... వీడుకోలు భారంగా ఏమీ లేదు, చిత్రంగా.

మనసు నిండి, తరువాయి సాహసానికి పయనం... ఆ మజిలీ ఏమిటో కనుగొనే ప్రయత్నం...

Saturday, August 2, 2008

కాలం

కొంతకాలం కాలమాగిపోయింది
నిన్ననే మళ్ళీ గుండె కొట్టుకుంది
పలుకని చిలుక పలికింది
నా ఊహకు రెక్కలు తొడిగింది

ఓ స్నేహం గాయాల శకలాల మీద
మళ్ళీ పురుడుపోసుకుంది
ఎడారివేసవిలో మళ్ళీ వసంతమొచ్చింది

ఆ నవ్వులివిగో
విరిసిన పువ్వులివిగో
ఆ వెన్నెలిదిగో
మెరిసిన తారలివిగో

ఎన్నో చిందిస్తాయి అధరాలు మధురాలు
ఎన్నో అందిస్తాయి కైదండల దండలు

కాలం జాలం ఎవరికి ఎరుక?!
ఎపుడేం చేస్తోందో దైవానికి తప్ప!

(దాదాపు సంవత్సర కాలం తరువాత తిరిగొచ్చిన స్నేహం కంటే ఫ్రెండ్షిప్ రోజున గొప్ప బహుమతి ఏముంటుంది?! గాయాలు మాన్పిన కాలానికి, ఆ కాలాన్ని శాశించే దైవానికి నా కాలం అంకితం.)

Friday, August 1, 2008

నిజం

నిజం ఉన్నచోట
అబధ్ధానికి చోటేలేదు
వెలుగు ఉన్నచోట
నిశీధికి నిలువనీడే లేదు

స్నేహం ఉన్నచోట
అపార్ధాలకు తావేలేదు
ప్రేమ ఉన్నచోట
ద్వేషానికి జీవం లేదు

ఈ సత్యం తెలుసుకో
నీ నయనం తెరుచుకో
ఆ సంకెల తెంచుకో
ప్రతి ఎదనూ గెలుచుకో

శత్రువు ఓ వ్యక్తి కాదు
శత్రువు ఓ శక్తి
మిత్రుడు ఓ శక్తి కాదు
మిత్రుడు ఓ వ్యక్తి

స్పందన సంహారం కాదు
కనుగొను మూలజడం
సంగ్రామం ప్రతీకారం కాదు
పగలను మొదలంటా నరకడం

ఆ యుధ్ధం నేర్చుకో
సంసిధ్ధం కాచుకో
శాంతికి ఓ సమిధవై
అనునిత్యం వెలిగిపో