Thursday, November 3, 2011

అలుపెరిగిన బాటసారి


అలుపెరుగని బాటసారిని
అనుకున్నా
వగరుస్తూ పొగరుగా
తల ఎగరేయలేకపోతున్నా

యు లివ్ వన్స్... లివ్ ఇన్ స్టైల్
స్లోగన్స్ వినీ వినీ విసుగెత్తిపోయా

ఆగితే మళ్ళీ సాగగలనా - అని
అనుమానపడ్డా
అలుపుని అసహ్యించుకున్నా
చేరవలసిన తీరాలు చేరాక సైతం
నడుస్తూనే ఉన్నా...

అలవాటయిన వేగంలో
ఎందుకో మరి... తెలియకుండానే ఆగా!

అప్పుడెపుడో మరిచిపోయిన నేస్తాలు
ఇప్పుడు ముందుకు వస్తున్నాయి
ఇన్నాళ్ళకు తీరిందా నేస్తం?! అని
పలకరిస్తున్నాయి
ఇందాకా ఎందుకు రాలేదు?! అంటూ
ప్రేమగా నిందిస్తున్నాయి
నీరుపోయడం గుర్తులేని
నారులో చినుకులు పడుతున్నాయి
మళ్ళీ తెలుస్తున్నాయి -
మట్టి వాసనలూ
పచ్చని పైరులూ
పిల్ల తెమ్మెరలూ
పొలం గట్లూ
సూర్యోదయాలూ అస్తమాలూ
శీతాకాలం వీపుమీద నర్తించే నులివెచ్చని ఎండలూ
కొబ్బరాకుల జల్లెడలో జాబిలమ్మ చలువలూ
ఇరుగు పొరుగు పలకరింపులూ
ఆత్మీయుల ఆలింగనాలూ...

.................................................
అంచేత మిత్రమా!
అలుపొస్తే భయపడకు
అయిపోయిందని దిగులు పడకు
తలవాల్చుట తలవంపని తలపోయకు
విశ్రాంతిలో అశాంతికి తావీయకు
శబ్దచేతనలే ప్రాణప్రతీకలని భ్రమించకు

ఆగు
మౌనంగా పరికించు
నీ అస్థిత్వం జీవనసరళి పరీక్షించు
పర్యవసానం పరిశీలించు
ఫ్రకృతి మంచితనం మానవత్వం పరిరక్షించు
....................................................

నేనిప్పుడో అలుపెరిగిన బాటసారిని
అలుపును గెలుపుగా చిత్రించని సత్యవాదిని
ఆగడం సాగడం రెండూ తెలిసిన నేర్పరిని
శూన్యాన్ని ప్రేమిస్తున్న అనంతవిశ్వాన్ని

నేనొక చివరెరుగని శాశ్వతాన్ని

Friday, April 15, 2011

నది

బొట్టు బొట్టుగా ప్రారంభం
అల్లరి సెలయేరులా పెరగడం
విస్తరిస్తూ లోతుగా ప్రవాహం

కొన్ని సార్లు మంద్రంగా
మరికొన్ని సార్లు వేగంగా
సుడులు తిరుగుతూ...
అందరికీ ప్రమోదమవుతూ
ఆదమరిస్తే అంతలోనే ప్రమాదమవుతూ

ఒకచోట ఎండుతూ నివాసమవుతూ
మరోచోట నిండుతూ పండుతూ
దాహం తీరుస్తూ జీవాన్నిస్తూ

ఒక్కోసారి చిన్నారులాడుకునేంత చిన్నదిగా
మరోసారి మహామహులను సైతం
మట్టి కరిపించే ప్రళయంలా

అందరినీ అన్నిటినీ కలుపుకు పోవడం తనమతంలా
ఎవరి ఉనికీ అవసరంలేని ఏకాకిలా యోగిలా...

ఎప్పుడు ఎలా ఉంటుందో
కొంత అర్ధం అవుతూ
మరికొంత అర్ధం కాని రహస్యంలా
స్వేచ్ఛకు మరో రూపంలా...

ఒకటి మాత్రం నిజం
పురోగమనం తన నైజం

అవసరం కొద్దీ కొందరు
అతి ప్రేమతో కొందరు
ఆదర్శం కొద్దీ ఇంకొందరు
అహంకారంతో మరికొందరు
ఆనకట్టలు కట్టినా
మరెలా బంధించినా...
ఆగడం దానికి కష్టం

సాంతం స్వంతమవాలనే స్వార్ధం కన్నా
సాంగత్యంలో స్వాంతన పొందడం ఉత్కృష్టం

అందుకే నది అంటే నాకు చాలా ఇష్టం
ఎందుకో దానికీ నాకూ చాలా దగ్గర బంధం

(ఆకాశమంత ప్రేమతో (ఆన)కట్టేసిన నా రాక్షసికి)