ఒక్కసారి ఏమీ ఎరుగని పసితనంగా మారి
నీ వొడిలో పవళించాలని ఉంది
ఒక్కసారి నీ గాయాలన్నిటిని
అలా చేత్తో తీసేయాలని ఉంది
ఒక్కసారి అలసిన నీ నిర్లిప్తతని
అలుపెరుగని ఉత్సాహంగా మార్చాలని ఉంది
ఒక్కసారి సమయాన్ని వెనక్కి తిప్పి
నీతో ఆడాలని ఉంది
ఒక్కసారి నిన్ను చూడాలని
మాటాడాలని ఉంది
ఒక్కసారి కలుషమెరుగని
బాల్యాన్ని పంచుకోవాలని ఉంది
ఒక్కసారి ఉప్పెక్కి
నీపై ఊరేగాలని ఉంది
ఒక్కసారి జొరంలో నీ చేత
సేవ చేయించుకోవాలని ఉంది
ఒక్కసారి నీతో అన్నీ కనిపెట్టాలని ఉంది
మనం కట్టిన పిచ్చుకసమాధి
పగులగొట్టిన బల్లిగుడ్లు
వానపాములు గాజుపురుగులు
గొంగళీల దద్దుర్లు
సీతాకోక చిలుకలు రెక్కలు పట్టిన తూనీగలు
దొంగిలించిన జామకాయలు రేగుపళ్ళు
బడి ఎగ్గొట్టి సర్వే చేసిన రోడ్లు
తాతయ్య జేబుకి కన్నం వేసి నాకు తినిపించిన కిచిడీలు
సత్తార్ కిళ్ళీకొట్టు చాటున కాల్చిన సగం బీడీ ముక్క
నేల టికెట్టుతో లోనికివెళ్ళి బాల్కనీలో బయటికొచ్చిన మాట్నీ సినిమాలు
కలిసి తొక్కిన అద్దె సైకిళ్ళు
ఇంటి బందీ నుండి బయటపడేందుకు
మనం వేసిన ఎత్తులూ పైఎత్తులూ
దొరికినపుడు తాతమ్మ చేతిలో థర్డ్ డిగ్రీ తొడపాశాలు
శవాల వెనుక గులాంలో తడిచి కాలడం చూసిన కాష్టాలు
మిట్టమధ్యాహ్నం వేసవి విహారాలు
డాబాపై చల్లిన నీళ్ళు చుక్కలు లెక్కెడుతూ పడకలు
మండుతున్నా ఆత్రంగా తిన్న
సత్తు బేసిన్ కొత్త ఆవకాయ పచ్చడి ముద్దలు
పెరుగన్నం మామిడిపళ్ళు ఒళ్ళంతా సెగ్గడ్డలు
టపాసులతో ఎండిన మన మాడులు
నువ్వు కాల్చే ఢాంఢాం బాంబులు
నిను అనుకరిస్తూ అరచేతిలో పేల్చుకున్న సీమటపాకాయలు
శ్రీరామనవమి పందిళ్ళు ఉగాది సందళ్ళు
ఆదివారం నేలపై పడుకుని విన్న రేడియో నాటకాలు
కిందామీదా పడిన మల్లయుధ్ధాలూ
ఎక్కి దూకిన చెట్లూ గోడలూ
అమ్మతో తిట్లూ చీవాట్లూ
మనం చేసిన కోతి పనులూ
వేసిన గోడకుర్చీలూ
ముఖం చూస్తే చాలు పుట్టుకొచ్చే నవ్వులు
నాన్న పొడిచిన సూదిమందులు
మరిపించేదుకు నువ్వు పడ్డ తిప్పలు
ఎదిగేకొద్దీ ఎడబాటులు
పెరిగేకొద్దీ దూరాలు
ఒక్కసారి నీతో బతకాలని ఉంది
మరొక్కసారి నీతో నవ్వాలని ఉంది
(నా చిన్నతనాన్నంతా తనచుట్టూ అల్లుకున్న అన్నకి ఒక్కసారి ప్రేమతో అంకితం.)
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
చాలా బాగుంది.
hi yamini, sasanka emi chestunnadu?. annayya meeda neekunna abhimanam really great. nenu ee madhya neevu vrasina chala vishayaalu chusi chala surprize feel aayyanu. I find u have a great range of thinking where normal people takes time to find ur stable world. By the way, I am chandra sekhar and i know nafhath jehan, srikanth, jayaram, veerendra, ranjith, chandr vasu, neelima, radhika, rajani, neeraja, vidya sagar, siva prasad, naga krishana, yamini(mini),sailaja,bhanu kavitha,jetti rejuka, ramakrishna,burripalem rambabu,azas ali, once upon a time.But now not in touch with anyone. Memories were lost.but again i started finding them back.My wishes to you. especially to ur creative mind which is the souce for many great feelings........
చాలా చాలా బాగుంది.
ఈ కవితలోని చాలా విషయాలు నన్ను నాబాల్యాన్ని కనులముందు నిలిపినయ్.
బల్లిగుడ్లు, గొంగళి దద్దుర్లు,
రెక్కలు పట్టిన తూనీగలు,
బడి ఎగ్గొట్టి సర్వే చేసిన రోడ్లు
కలిసి తొక్కిన అద్దె సైకిళ్ళు
పెరుగన్నం మామిడిపళ్ళు ఒళ్ళంతా సెగ్గడ్డలు
నేల టికెట్టుతో లోనికివెళ్ళి బాల్కనీలో బయటికొచ్చిన మాట్నీ సినిమాలు
వావ్ ఎన్నని చెప్పాలి. ఒక్కొక్క పదచిత్రం మోసుకొచ్చే జ్ఞాపకాల వాన.
ఒక్కొక్క సంఘటనకు ఉపోద్ఘాతం, ఉపసంహారాలను తలచుకొంటూంటే గుండె బరువెక్కుతుంది.
ముగింపు ఎంత ఆర్ధ్రంగా ఉంది.
అద్భుతమైన జీవన సత్యం
ఎదిగేకొద్దీ ఎడబాటులు
పెరిగేకొద్దీ దూరాలు
ఎంత చిన్న చిన్న మాటలలో ఇమడ్చగలిగారు.
మంచి కవిత చదివానన్ని తృప్తి గుండెనిండా నిండింది.
బొల్లోజు బాబా
Post a Comment