Saturday, July 10, 2010

వెన్నుపోటు

దీనికన్నా పన్నుపోటే నయమేమో!
కరిగించిన వెండితో పూడిస్తే
ఒక్కసారి మండి ఊరుకుంటుంది

వెన్నలాంటి నవ్వులతో
పూసల్లాంటి మాటలతో
నమ్మకాన్ని గునపంతో
గుచ్చిన ఈ పోటు ఏం పెట్టి పూడ్చినా
ఊరుకోదు... సలుపుతూనే ఉంటుంది

కాలం కొంత మాన్పినా
అక్కడ అనుమానం బాక్టీరియా
అప్పటికే పుట్టే ఉంటుంది
అపనమ్మకం అనుక్షణం
బతుకుతూ చస్తుంటుంది

అప్పటికప్పుడు క్షమించినా
తిరిగి గాయమవకుండా
గుండె చుట్టూ కంచె కట్టుకుంటుంది
ఆత్మరక్షణలో ప్రతినిమిషం బిజీగా ఉంటుంది

అబ్బో... ఈ తోటలో ఇప్పుడెన్ని పనులో!
అపార్ధాల పిచ్చి మొక్క
లోతుకుపోకుండా ఆపాలి
అర్ధంలేని చేదు వేరు
పాతుకుపోకుండా పీకాలి
ఎడారిలో కాసిన్ని జల్లులు కురిపించాలి
ఎండిపోతున్న మానవత్వం పాదుకు
విలువల ఎరువులు వేయాలి
ముళ్ళు తాకకుండా
కొన్ని కొమ్మలను అందంగా కత్తిరించాలి
సుందరమైన గులాబీలు పూయించాలి

మరి... లోలోపల ఇంకెన్ని పనులో!!
గాయపడి పారిపోయిన మాటకి
మొదట జీవం పోయాలి
నా తప్పేం లేదంటూ అలిగిన మదికి
మొదలంటా మన్నించడం నేర్పాలి
ఇక కుదరదంటున్న హృదికి
అరమరికలు లేకుండా మళ్ళీ నమ్మడం నేర్పాలి
ఆదమరుపు తెలియని బుధ్ధికి
అవసరమరుపు నేర్పాలి
చుట్టూ ఉన్న కంచెను తొలగించి
స్నేహాన్ని స్వాగతించాలి

ఖాళీ అవుతున్న పాత్రలో
ప్రేమామృతాన్ని నింపాలి

(విలువైన జీవిత పాఠాలు నేర్పే నా సహచరులకు ఈ కలంపోటు అంకితం.)

4 comments:

ashok.writings said...

Chala kalam taruvata.. Gud one :)

Raj Verma said...

daaham vesthe madilo kalige takshaNa spruha challani manchi neeru... analogously, naaku telisina oka maanasika rogiki ee vidhamgaa rugmatha tagginchaala ani aalochistu unte, 'Yamini gaari kavithalu oka saari chadivi vinipisthe polae' ani merupu laanti aalochana tattindhi... ikkadaku cheresariki, madhuramaina mee paatha kooralathopaatu freshgaa ghumaghumalade oka kotha koora kuda vandi pettesaaru table midha... ;) nice one...

Unknown said...

me gurichi meru cheppindi naku baga nachindi.

http:/kallurisailabala.blogspot.com

ఏకాంతపు దిలీప్ said...

"మన్నించడం నేర్పాలి
ఇక కుదరదంటున్న హృదికి
అరమరికలు లేకుండా మళ్ళీ నమ్మడం నేర్పాలి"

అవి మాత్రమే ఆ పోటుని పోగొట్టగలవు.. అంతే కాదు, ఇంకెప్పుడు గాయమైనా తట్టుకునే నిరోధక శక్తిని పెంచగలవు, ఇంకెప్పుడైనా పోటు పడుతుంటే తప్పించుకునేట్టు చెయ్యగలవు!