Tuesday, October 9, 2012
బాణం
ఎప్పుడో ఎవరో వేసే ఉంటారు
నీపై నిప్పుల బాణాలు
ఎన్నాళ్ళని తిరుగుతూ ఉంటావ్? -
వీపుకు గుచ్చుకుని
పీకెయ్...
కొన్నాళ్ళు నొప్పి పెడుతుందేమో!
గాయం మానాక
మచ్చ కూడా పడుతుందేమో!
తీయకపోతే మాత్రం
ఒళ్ళు తగలబెట్టుకున్నట్టే...!
కొంతకాలం కసినే
ఇంధనంగా మార్చి
ముందుకు సాగుతావేమో!
ఒక్కోసారి మజిలీ కూడా చేరతావేమో!
చివరంటా ఉంచితే మాత్రం
నిజమైన నిన్ను మసి చేసుకున్నట్టే...!
ఆత్మావలోకనం చేసుకునే తరుణం
నిన్ను నువ్వే బేరీజు వేసుకునే సమయం
ఒక దారి మూసుకుపోతే
మరో ద్వారం వెతికే సందర్భం
పదే పదే తలుచుకుని ఏడిస్తే మాత్రం
ముందుకు వెళ్ళలేక చతికిలపడ్డట్టే!
లే...
కళ్ళు తుడుచుకో
స్పష్టంగా కనపడుతుంది
నిటారుగా నిలబడు
మార్గం అగుపిస్తుంది
లక్ష్యాన్ని ఛేదించు
గమ్యం చేరువవుతుంది
సాధించి చూపించు
లోకం తలవొంచుతుంది
నిత్య చైతన్యంతో విశ్వాన్ని నింపెయ్
అనంతమే నీ సొంతమవుతుంది
(ఒకసారి ఓడిన తమ్ముడికి, గెలుపు అందుకొమ్మని పిలుపునిస్తూ...)
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
(మా అక్క రచనలు చదివి ప్రభావితం అయ్యి "బాణం" కి స్పందించి రాసాను, మొదటి సారి తెలుగు లో రాస్తున్నాను తప్పులు ఉంటె సహృదయం తో మన్నించి తప్పులను తెలుపవలసింది గా కోరుతూ .. )
నిప్పుల బాణాలు
లోలోతున దిగనే దిగాయి నిప్పుల బాణాలు,
పెట్టాయి బాగానే వాతలు,
చేసాయి పెద్దగానే గాయాలు.
నమ్మకాన్ని చీల్చి పారేసాయ్,
స్నేహాన్ని కూల్చేసాయ్,
అందమైన అనుభూతులను కాల్చిపరేసాయ్,
అభిమానాన్ని అణగదోక్కాయ్,
భయాన్ని ముంచెత్తాయ్,
కోపాన్ని ఆకాశానికి అంటించాయ్,
కసిని రేపి బుసలు కొట్టించాయ్,
నిస్సహాయుణ్ణి చేసి వదిలేసాయ్,
శరీరాన్ని కుదేసాయ్.
బాణాలకు ఉన్న నిప్పు ఆణువణువూ పాకుతోంది,
క్షణం మరువనివ్వకుండా విషం పూస్తోంది,
బలాన్ని బూడిద చేసే వరకు వదలనంటోంది,
నిజాన్ని సమాధి చేసి పూడ్చేస్తోంది,
ప్రయత్నాన్ని ప్రశ్నించి ఎగతాళి చేస్తోంది,
ధైర్యాన్ని ముక్కలు గా కోసిపారేస్తోంది,
వ్యక్తిత్వాన్ని చచ్చుబార్చేస్తోంది,
బలహీనాన్ని చాటెత్తుతోంది,
అంతానికి నాంది పలుకుతోంది,
ఓటమిని అంగీకరించమని సవాలు విసురుతోంది,
సమాధానానికి చోటు లేదని నెట్టేస్తోంది,
చివరంటూ కొట్టుమిట్టాడుతున్న హృదయంలో అణు బాంబు పేల్చింది,
నొప్పి ఓర్చుకుంటూ కన్నీళ్ళు కార్చమంది,
ఏనాటికీ దిగమింగలేని బాధని మిగిల్చింది,
ఇక ఎందుకూ పనికిరావు అనే శాసనాన్ని చెక్కింది,
రగిలిన అలజడిని బలవంతంగా బయటకు కక్కించింది,
జరుగనివ్వకుండా సంకెళ్ళు వేసింది.
పలుకరించని నిద్ర,
కొండయి మీదెక్కి కూర్చున్న భయం,
వీదిపోనంటూ బంధాన్ని పెంచుకున్న బాధ,
మిగిలున్న ప్రాణం చేస్తున్న గొడవ,
నేను తప్ప ఎవరు లేరు అని కనిపించిన అగాధం.
కమ్మిన అంధకారం.
అందమైన ఓ నవ్వు ఎదుటపడింది,
ఆ నవ్వు మందై చిటికెలో గాయాలు పోగొట్టింది,
ఆప్యాయంగా పిలిచి లోపలి బరువునంతా ఒక్కసారిగా తేలిక చేసింది,
స్నేహం గా మారిన బంధం నవ్వులు పువ్వులై పూయించింది,
ప్రపంచం అంతా కొత్త గా ఉందంటూ చూపిస్తోంది,
బలానిచ్చి ముందడుగుకు తోడుగా నిలిచింది,
ఓ అద్భుతమై బ్రహ్మండమై వరించింది ఓ అందమైన నవ్వు.
***
Post a Comment