Sunday, April 6, 2008

నా విశ్వం

పాలబుగ్గల పాపాయినందరు ముద్దాడినపుడు
పసిడి నవ్వుల విందారగించినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

బడిలో మాస్టారు ఎత్తుకున్నపుడు
భుజాలపై "దేవుడమ్మ" ఊరేగించినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

నాతోటి వారు జట్టు కట్టినపుడు
నను నేస్తంగా ఉండమన్నపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

కళాశాలలో చేరినపుడు
స్నేహితులు లోపాలను కప్పినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

మొదటగా కొలువు తీరినపుడు
మరల బుడినడకలు నేర్చినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

దూరతీరాలకేగినపుడు
వర్ణమిశ్రమం తెలిసినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

జాతి మత భేదం ఒట్టిదన్నపుడు
ఇలను హరివిల్లు విరిసినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

మనుజులంతా ఒకటని ఎరిగినపుడు
నా ఎదలో విశ్వం ఒదిగినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

(నా మనోనేత్రాలను తెరిపించి విశాల ద్రుక్పధం అలవరచిన ఎందరో మహానుభావులకు ఈ విశ్వం అంకితం)

నా చిన్నప్పటినుండి ఇప్పటివరకు విశ్వం అంతా నాదే అందరూ నావారే అనే భావన ఎలా నాలో పెంపొందిందో ఈ కవితలో చెప్పాను...

తాతమ్మ చేతులమీద పెరిగాను అనేకంటే ఆవిడ మీదే పెరిగాను అనడం నిజం చెప్పినట్టుంటుంది. నేనేంచేసినా మురిసిన తాతమ్మ, "గొడ్డు గోదా, పొలము పుట్రా, పిల్లా మేకా అందరినీ చల్లగా చూడమని" అసురసంధ్య వేళ దీపం వెలిగిస్తూ, నిర్వికారమయిన ఆ జ్యోతిర్మయిని తన సహజభాషలో ప్రార్ధించి, అందరికోసం జీవించి, తనకోసం ఏ వరాలడగని నిస్వార్ధజీవి, ప్రేమమయి తాతమ్మ; పదవ తరగతికొచ్చినా, పళ్ళెంతో నా చుట్టూ తిరిగి, తన ఒడిలో నాకు జోకొట్టి, ఇంటిపనులను ఒంటిచేత్తో చక్కబెట్టే సవ్యసాచి, బయటపనులను సమర్ధంగా నిర్వహించే కార్యదక్షురాలు, పెద్దవారికి పెద్దదిక్కైన సేవాతత్పరి, అందరికీ సిమ్హస్వప్నం, నన్ను మాత్రమే జూలుతో ఆడుకోనిచ్చిన ప్రత్యేకస్థానం, లలితకళలంటే ప్రాణం, తను చేయలేనివి నాకు నేర్పేందుకు పడ్డ కష్టం, ఆటలలో మేటి, పాల్గొన్న ప్రతిపోటీలో విజేత, ముక్కంత సూటిగా తొలిపరిచయంలో చదివేసే సునిశిత ద్రుష్టి, అదే తరహా మాట, వరాల మూట అమ్మ; అన్నయ్యకంటే అతిగా ప్రేమించిన పక్షపాతి, చెత్తకుప్పలో స్టెతస్కోప్ చూసి పట్టుదలతో వైద్యవ్రుత్తినలంకరించిన విక్రమార్కుడు, తనతో కూడా ఏకీభవించనవసరంలేని ఆత్మవిశ్వాసాన్ని నాలో కలిగించిన నేర్పరి, లలిత సాహిత్యం నుండి చలిత సాహిత్యం వరకూ నాకు పరిచయం చేసిన వాగ్గేయకారుడు, ఆయుర్వేదవైద్యంపై సంస్క్రుతంలో అనర్గళంగా ఉపన్యాసమిచ్చిన భాషాదురంధరుడు, సున్నితహ్రుదయుడు, అమ్మ అంతఃసౌందర్యాన్ని ఆరాధించిన ప్రేమికుడు, అప్పటికే అణగారిన సాహితీస్పూర్తిని నాకోసం నిద్దురలేపి, స్నేహంపై కవిత రాసి, తన అమ్మణ్ణికి అంకితమిచ్చిన నాన్న; నా చిన్నప్పటి సాహసాలు, జ్ఞాపకాలన్నీ తన చుట్టూ అల్లుకున్న అన్న; సంస్కారాన్ని, సమాజసేవను తమ ఆచరణలో చూపిన తాతయ్యలు; తన భాష, బుధ్ధిబలం, పలుకుబడితో సామాన్యులకు చేయూతనిచ్చి, తనయెదుట ప్రజల డబ్బు రాశులుపోసిఉన్నా, ఒక్క పైసా ముట్టని నిర్వికారి, ఖద్దరు పంచెకట్టుకు వన్నెతెచ్చిన పొడుగరి, ప్రతిరోజూ దీనజనులకై అధికారులకు యాభై అరవై ఉత్తరాలు రాసి, తపాలా బిళ్ళలు అంటిచి పోస్టు చేసే ఉడతాసాయాన్ని మా(మనుమల)నుండి స్వీకరించిన మాటకారి, సంస్కారాన్ని నాకు నేర్పిన సాంప్రదాయవాది, నిరాడంబర వివాహాలకు శ్రీకారం చుట్టిన ఆదర్శవాది, అందరి మనసులు గెలుచుకున్న మహనీయుడు - తాతయ్య (అమ్మ వాళ్ళ నాన్న); సామ్యవాదసిధ్ధాంతాలను వంటబట్టించుకుని, ఆస్థులన్నీ త్యజించి, అంతస్థులను కాలదన్ని, అతి సామాన్యంగా బ్రతికిన నిగర్వి, శ్రమజీవన సౌందర్యాన్ని అతిసమీపంలో ఆవిష్కరించిన కార్మికశక్తి మరో తాతయ్య (నాన్న వాళ్ళ నాన్న); వయసుతో నిమిత్తంలేని అమాయకత్వం అమ్మమ్మ; తనకున్నంతలో అత్యంత రుచికరంగా వండి, ముఖ్యంగా "గొబ్బిరి"పచ్చడి, పక్కవారందరికీ పెట్టి మహదానందభరితమైన నానమ్మ (నాన్న వాళ్ళ అమ్మ); నను గారాబం చేసిన పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు, చిన్నమ్మలు, మామయ్యలు, అత్తయ్యలు, అన్నయ్యలు; నాకూ ముద్దుచేసే అవకాశం ఇచ్చిన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు... ఇలా నా బాల్యం చాలావరకు మధురానుభూతులు నిపడంలో మా కుటుంబంలోని అందరూ బాధ్యులే...

పుట్టింది, పెరిగింది తెనాలిలోనే అయినా, మా అమ్మ ఉద్యోగరీత్యా, నా మొదటి దశ బాల్యం మమతల పల్లె రేపల్లెలో, ఆప్యాయతల ఊరు వేమూరులో గడిచింది. రేపల్లె పోలియో వెంకట్రావ్ అంకుల్, నాకు గట్టి అరిశెలు వండి పెట్టిన వాళ్ళ అమ్మ, రాజ్యం అమ్మమ్మ, రైల్వేపోలీసు ప్రభాకర్రావ్ అంకుల్; వేమూరు శకుంతలమ్మామ్మ, వాళ్ళ విశాలమైన పెరడు, తులసి కోట, ఎర్ర జాంకాయల చెట్టు; తెనాలి కోటయ్య అంకుల్, బేగం ఆంటీ, వాళ్ళ ఇంటినుండి కనిపించిన రైలుపట్టాలు, లెక్కపెట్టిన గూడ్సు పెట్టెలు ఇప్పటికీ గుర్తే. ఇప్పటికీ, మనసువిప్పి మాట్లాడే చనువు ఉన్న శైలజాంటీ పక్కింటివారు బంధువులకంటే ఎక్కువ ఎలా అవుతారనడానికి ఉదాహరణ. ఎక్కడ ఉన్నా, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ నాకోసం పోటీ పడుతూ ఉండేవారని తాతమ్మ అంటుండేది... విన్నప్పుడల్లా నాకు మహదానందంగా ఉండేది... అందుకే కాబోలు అన్నారు - ఒక బిడ్డను పెంచాలంటే ఒక ఇల్లు సరిపోదు, ఒక ఊరు కావాలి - అని.

నా మొదటి బడి తెనాలిలో మా వీధిబడి. ఇద్దరు అన్నాతమ్ములు ఆ బడి నడిపేవారు. వారి అసలు పేర్ల కంటే కొసరు పేర్లే అందరికీ తెలుసు - పెద్దమాష్టారు, చిన్నమాష్టారు. పెద్దమాస్టారు కొంచెం కోపంగా ఉండేవారు. చిన్నమాస్టారు నన్నెప్పుడూ ఎత్తుకునే ఉండేవారు. అక్కడ నా మొదటి మూడు తరగతులు ఒక్కోటి ఆర్నెల్లలో పూర్తి చేశాను. మా అమ్మకు బెంగ పట్టుకుంది - ఇలా ఒక్కోతరగతి ఆర్నెల్లలో పూర్తి చేస్తే ఎలా అని. లాభం లేదు, ఈ చిన్నదాన్నిపెద్ద స్కూలులో వెయ్యాల్సిందే అని నిర్ణయించేసింది.

అలా చేరాను వివేకానంద విద్యామందిర్ లో - వయసు సరిపోదు ససేమిరా అంటే, మొట్టమొదటి ప్రవేశ పరీక్ష రాసి. అప్పటివరకూ బుధ్ధుడిలా, నోటమాటరాకుండా ఉన్న నాకు, అల్లరి మొదలైంది అక్కడే. స్నేహం అంటే తెలిసింది అక్కడే. నీరజ, రాధిక, నఫ్హత్, రాజ్యలక్ష్మి... ఇలా ఎందరో స్నేహకుసుమాలు.... కొందరి కుటుంబాల్లో నేనిప్పటికీ సభ్యురాలినే... నడత నేర్పిన గురువులు - కస్తూరి, విజయలక్ష్మి, నిర్మల, రాజేశ్వరి, రాధాక్రిష్ణ, రామక్రిష్ణ, ప్రసాద్, గోపాలాచారి, సంస్క్రుతం మాస్టారు, డ్రిల్లు మాస్టారు, భట్టాచార్య... ఎందరో మహానుభావులు... నేను బధ్ధకించినపుడు వీపు విమానం మోత మోగించినా, ఏ కొంచెం బాగా చేసినా నెత్తిమీద పెట్టుకున్న భరతనాట్య గురువు చదలవాడ నారాయణరావు గారు... నాకు నృత్యం పై ఆసక్తి కలిగేసరికి మరణించినా, నా జ్ఞాపకాల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారు...

అలా పదవ తరగతి వరకు ఆడుతూ పాడుతూ చదివేశాక, మొదటిసారి వేరే ఊరులో ఉంటూ పాలిటెక్నిక్ కాలేజి లో చదువు (ఆటలు) కొనసాగించాను. నా క్లాసు, నా కాలేజి, నా లెక్చరర్లు అందరూ నేస్తాలే... అయితే, ఓ జీవిత కాలానికి సరిపడా స్నేహం అందించింది నా సీనియర్, నా ఆంతరంగిక నేస్తం కిరణ్. అయిదారుగురం ఒక జట్టుగా ఉండేవాళ్ళం - కిరణ్, జ్యోతి, ప్రేం, శాంతి, శ్యామల.. ఇంకా నాకు ప్రియమైన లెక్చరర్లు - చంద్రకళ, హరిత, భాస్కర్ రెడ్డి. నాకు నా క్లాసులో నేస్తాలకంటే సీనియర్లలోనే ఎక్కువమంది ఉండేవారు. ఇక హాస్టల్ సంగతి చెప్పాలంటే ఈ పేజీలేవీ సరిపోవు... అదో చిన్న ప్రపంచం... బాహ్య ప్రపంచానికి చిన్న నకలు... ఇంటి నుండి బయటపడి తొలిసారి స్వతంత్రాన్ని చవిచూసింది ఇక్కడే... బయట ఎలా బ్రతకాలో నేర్చుకుంది ఇక్కడే... ఆ క్రమంలో తప్పటడుగులు వేసింది ఇక్కడే, పరీక్షలలో వైఫల్యం అంచులదాకా వెళ్ళింది ఇక్కడే... వీటన్నిటిని ఆస్వాదించేట్టు చేసి, నా తప్పులు కప్పి... నా నేస్తాలు వారి గుండెల్లో నన్ను దాచుకుంది ఇక్కడే...

కళాశాలలోంచి బయటికి వచ్చాక, చలో భాగ్యనగరం అంటూ హైదరాబాద్ చేరాను... నాకు చాలా నచ్చేసిందీ నగరం... కొన్నాళ్ళూ సాఫ్ట్-వేర్ ఉద్యోగాలకోసం వెతికిన తరవాత గుడ్డు-కోడి సమస్యతో విసుగొచ్చి మార్కెటింగ్ లో చేరాను... మార్కెటింగ్ అంటే అందరితో మాట్లాడాలి, అదేమీ సమస్య కాదు.. కానీ ఇంగ్లీషులో మాట్లాడాలి... మరి నేను పదవతరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను... కాలేజిలో ఇంగ్లీష్ మీడియం అయినా అది సబ్జెక్టుల వరకే... అలా ఆ ఉద్యోగం చేస్తూ అందరితో ఆంగ్లంలో మాట్లాడటం అలవాటు చేసుకున్నాను... నా అద్రుష్టం కొద్దీ నా మొదటి మేనేజర్ IIM అహ్మదాబాదులో మార్కెటింగ్లో MBA చేసి, అప్పటికే పది పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్న మంచి మనిషి - రఘు. ఆయన నుండి మార్కెటింగ్ లో ఓనమాలు నేర్చుకున్నది ఇక్కడే... మొదటి సంపాదన అందుకుని ప్రపంచాన్నే జయించింది ఇక్కడే... మా అమ్మ నుండి బహుమతిగా TVS Champ నా సొంతమైంది ఇక్కడే... నగరం నలుమూలలా ఝామ్మంటూ నా చిన్న బండిపైన ముగ్గురం తిరిగింది ఇక్కడే... ఎన్నో ప్రమాదాలతో సయ్యాటలాడింది ఇక్కడే... ఆ వరుసలో మంచితనానికి మారుపేరైన వాసన్ లాంటి మనుషులు తారసపడిందీ ఇక్కడే...

నేను అమెరికా రావడం కొంత నా ఇష్టానికి వ్యతిరేకమే... ఆ కధలన్నీ తరవాత ఎప్పుడైనా చెప్పుకుందాం... ఎలా అయితేనేం, ఇక్కడికి రావడం జరిగింది... కొత్త ఊరు, కొత్త ప్రాంతం, కొత్త మనుషులు, కొత్త దేశం, కొత్త యాస... కొత్త సంస్క్రుతి... అన్నీ కొత్తవే... అదేంటో! చిత్రంగా, ఒంటరితనం తప్ప నాకు ఇక్కడేవీ కొత్తగా అనిపించలేదు... కిటికీ లోంచి బొద్దుగా ఉన్న ఉడుతలను చూస్తూ గంటలు గంటలు గడిపింది ఇక్కడే... వాటి నేస్తంగా మారి, రోజు ఆపిల్స్ ను కలిసి ఆరగించిందీ అక్కడే... ఇక్కడ చాలా మొట్టమొదటి సార్లు జరిగాయి - మొట్టమొదటిసారి మంచు దూదిలా రాలడం చూసింది ఇక్కడే... అలవాటు లేని ఒంటరితనం అనుభవంలోకి వచ్చింది ఇక్కడే... నా నేస్తాలెవరూ లేని ఏకాంతం అనుభవించిందీ ఇక్కడే... శూన్యం... గది శూన్యం... మది శూన్యం... మొట్టమొదటిసారి నాలో నేను అంతమైంది ఇక్కడే... ఆ శూన్యంలోంచి నా మదిలో దైవాన్ని నేమనసారా విన్నదీ ఇక్కడే... ఆ బీజాక్షరాలు నా తిమిరాన్ని తరిమే తొలికిరణాలై క్రమంగా నను మొత్తం చైతన్యంతో నింపిందీ ఇక్కడే... నాలో భయాన్ని ధైర్యంతో ఎదుర్కొన్నది ఇక్కడే... ఇక్కడి యాసను అర్ధం చేసుకుంటూ, ఉద్యోగప్రయత్నాలు మొదలెట్టాక, నాక్కుడా తెలియని ఓబంధువు నన్నాదుకుందీ ఇక్కడే... తన స్నేహితురాళ్ళు వారి ఇరుకు ఇంటినీ, విశాల హ్రుదయాన్నీ నాకు పంచింది ఇక్కడే... ఈ పిల్లలంతా కలిసి నా సహజగుణానికి (అల్లరి) తిరిగి లాక్కొంచిందీ ఇక్కడే... దైవంతో సావాసం మొదలైందీ ఇక్కడే...

ఎన్నో ఎదురుచూపులు, మరెన్నో మంచు తుఫానులు, ఎన్నెన్నో చిరు ప్రార్ధనల తరువాత, మొన్నటిరోజున, ఏడు సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరాను... చేరిన తొలినాడే, నేనెవరో తెలియనవసరం లేకుండానే, నాకు తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చి, తన నీడలా తిగరనిచ్చి, దుర్గుణాలను ప్రేమతో భరించి, సోదరిలా భావించి, నా భుజం తట్టి, ధైర్యం చెప్పి, చిరునవ్వుతో చిన్నపనులను సైతం నేర్పిన ఉమ; తన స్నేహితులందరికీ నను పరిచయం చేసి, తమలో నను కలుపుకున్న లోకబాంధవి బీనా; నాన్నా అని పిలిచి, ఆప్యాయతను పంచి, అమ్మలా ఆకలెరిగి అక్కున చేర్చుకున్న నా అన్నపూర్ణ, ఎంతటి మాలిన్యాన్నయినా ప్రేమతో కడిగేసిన సాత్వికి - రాజశ్రీ; నిదురను త్యాగం చేసి, తన కారులో నాకు నడపడం నేర్పి, నాకో కారు కొనిపెట్టి, స్వాతంత్ర్యాన్నిచ్చి, తనే వండిపెట్టి, చీవాట్లు పెట్టి, రాజశ్రీ తాత్కాలికంగా లేని లోటు తీర్చి, తన కుటుంబంలో నేనొక భాగంగా భావిచే సాగర్ (రాజశ్రీ భర్త) ; తను పుట్టకమునుపే నా నేస్తమై, మూడు సంవత్సరాల ప్రగాఢస్నేహం తరవాత నను వదిలి పోయిన నా కుచ్చి; సహోద్యోగినిగా పరిచయమై, తన కుటుంబంలో ఒకటిగా కలిపేసుకున్న శారా, అంతే ఆప్యాయంగా నను ఆదరించే తన కుటుంబం - విజయ్, రేచి, షారన్... ఇలా చెప్తూపోతే మా ఊరి భారతీయులంతా ఈ పేజీలమీదే ఉంటారు...

అయితే, నేను ఇష్టపడిన భారతీయులందరిదీ ఒక ఎత్తు అయితే, నా జాత్యహంకారాన్నీ, దురభిమానాన్నీ, అపోహలను, అకారణ ద్వేషాన్నీ పోగొట్టిన ప్రపంచమిత్రులు మరో ఎత్తు -
నల్లవాళ్ళంటే ఉన్న ఒక విధమైన భయాన్ని, అనుమానాన్ని సమూలంగా తుడిచేసి, నాకు పిత్రుసమానుడైన రాడ్నీ; నాతో గంటలకొద్దీ సమయం గడిపి, వారి హ్రుదిలోకి నను ఆహ్వానించిన మాత్రుసమానురాలు, రాడ్నీ భార్య, శ్వేతజాతీయురాలు, మెలీసా; పాకిస్తానీయులంటే నాకున్న అకారణద్వేషాన్ని చివరంటా తుడిచేసి, నా సంకుచితత్వానికి సిగ్గుపడేలా చేసిన మిత్రుడు, సయ్యద్ జఫర్ అబ్బాస్ నక్వి; దక్షిణ అమెరికన్లంటే ఉన్న చులకన భావాన్ని పోగొట్టి, తను తండ్రి కాబోతూ, నేను అత్తనౌతున్నానని చెప్పిన మిత్రుడు, సోదర సమానుడు, మార్టిన్ (బొలీవియా); రష్యన్లంటే కరడుగట్టిన కమ్యూనిష్టులు అనే మొరటుభావాన్ని సున్నితం చేసిన మిత్రుడు ఈగోర్; సంకుచిత స్వభావులు చైనీయులు అనే అపోహను నాశనం చేసిన మిత్రుడు ఝాపాంగ్; మనదేశంతో ఉద్యోగాలలో పోటీకి వచ్చారన్న నెపంతో దూరంగా ఉంచిన నా అంటరానితనాన్ని స్వచ్చతనే అగ్గితో కడిగిన ఫిలిప్పినో మిత్రుడు కాన్స్టంటినో పుస్తా; నేపాలీయులంటే గూర్ఖాలే అన్న నా పరిమిత జ్ఞానాన్ని క్షమించి, తమ స్నేహాన్ని పంచి, పార్టీలంటే ఎలా చేసుకోవాలో నేర్పిన మిత్రులు - సంజీత, బిక్రం, దిగో; మాదకద్రవ్యాలకు అలవాటుపడినవారంతా ప్రమాదకరమైన వారు, ఒకసారి వెళ్ళాక మరి బయట పడలేరు అనే మరో అపోహను కూకటివేళ్ళతో కూల్చేసిన నా అంతరంగిక నేస్తం, శ్వేతజాతీయురాలు, రేచల్; క్రైస్తవులంటే బలహీనులు అనే చులకన భావానికి, మతమార్పిడికే మనతో మాట్లాడతారనే అపనమ్మకానికి శిలువ వేసి, చర్చలకు, అనేక ప్రశ్నలకు సాదరంగా స్వాగతం పలికి, నా ఆధ్యాత్మిక ప్రగతికి కారణమైన చర్చ్ పాస్టర్ మార్టీ; కెనెడా దేశస్థులను మన సర్దార్జీలతో అసంబధ్ధ పోలికను గేలిచేసి, తమ స్వహస్తాలతో కట్టుకున్న బొమ్మరింటిలో నాకూ చోటు కల్పించిన గ్వెన్, ఫిల్, వారి పిల్లలు - జర్డిన్, సెథ్, కేలబ్; శ్వేతజాతి మగవారిలో, అదీ ఆఫీసుల్లో, ముఖ్యంగా ఇతరజాతుల ఆడవారితో జాత్యహంకారం జాస్తి అనే, అన్నివేళల్లో రుజువు చేయలేని మరో లోకవిదితాన్ని నాస్తిగా నిరూపిస్తూ, ఎన్ని ఉద్వాసనలు ఎదురైనా నన్ను కాపాడుతూ, నా ప్రగతికి బాటలు వేసిన నా మానేజర్లు, ఆలెన్, షిమక్; చివరకు మొన్నటి ఉద్వాసనల్లో తనకే వేటు పడి కళ్ళనీళ్ళపర్యంతమైన షిమక్; పాశ్చాత్యులంటే, బాగా ధనవంతులు, కుటుంబ విలువలు తెలియనివారు, భౌతిక సుఖాలకే ఎక్కువ విలువనిస్తారు అనే అతిపెద్ద అపోహను పోగొట్టిన ఎన్నో కుటుంబాలు ... ఇలా ఎందరో ఎందరెందరో... నా మనసును కప్పిన అజ్ఞానపు పొరలను ఒక్కొక్కటిగా వారి స్నేహంతో, ప్రేమతో తొలిగించిన ఎందరో మహానుభావులు... అందరికీ శిరసు వంచి చేస్తున్నా వందనాలు...

సంస్క్రుతీసాంప్రదాయాలను, సైధ్ధాంతిక విభేదాలను, కరుకు బాహ్యస్వరూపస్వభావాలను, ముందస్తు అభిప్రాయాలను దాటుకుని ముందుకు వెళ్ళగలిగితే, అందరూ మనుషులేనని, ప్రతివారిలోనూ స్నేహానికి స్పందించే హ్రుదయం ఉందని అవగతమవాలి... మనం ఎక్కడ ఉన్నా, మన ఇంటికి, ఊరికి, ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి, మానవత్వానికి, మంచికి, దైవానికి ప్రాతినిధ్యం వహిస్తామని గుర్తుంచుకోవాలి... మనం ఈరోజు చేసే చిన్న పనులే రేపు మరొకరి వ్యక్తిత్వంపై, ముఖ్యంగా భావితరానిపై చెరిగిపోని ముద్రలు వేస్తాయని ఎరిగి ప్రవర్తించాలి... మనం చూపే ప్రేమ, సహనం, స్నేహం కొద్ది సంవత్సరాల తరువాత అయినా ఓవ్యక్తి పరిపక్వతకు తోడ్పాటు అందిస్తాయని తెలుసుకొని మసలుకోవాలి... ప్రాంతం ఏదయినా అక్కడివారితో ప్రేమతో, బాధ్యతలెరిగి నడుచుకోవాలి... ప్రతి సంస్క్రుతిలోనూ మంచిని గ్రహించి, చెడుని త్రుణీకరించి భిన్నసంస్క్రుతుల మేలు కలయికలా ముందుకు సాగిపోవాలి... ఈ విశ్వం అంతా నాదే, దీనిలో అందరూ నావారే అనే పూర్ణత్వం మనకు రావాలి... అదిరాని రోజున ప్రపంచీకరణ సంపూర్ణ ఫలితాలు మనకు అందలేదని బోధపడుతుంది...

4 comments:

chandramouli said...

మిగిలింది ఎప్పుడు???

ఇప్పటి వరకు బాగారాశారు ఆపారేం..... కొద్దిగా విక్స్ వాడయిన పూర్తిచెయుదురూ....!!

Subba said...

Yamini Garu,

Adbhuthamuga undi andi. Chala Important work chestunnanu gatha 7 gantala nunchi. Anukokunda mee blog visit chesa, pani marchi poyanu..
Thank you for your nice blog..Subba

kp said...

yamini gaaru,

telugu padaalatho chedugudu(kabaddi) aadesaaru :-) .. chaalaa baaga raasaaru...

--kp

kp said...

yamini gaaru...

telugu padaalatho chedugudu aadesaaru :-) chaala baagundi..

-kp