Friday, July 25, 2008

ఉదయం

ధాత్రిసుందరీపరిష్వంగాన్ని
వీడలేక వెడలుతున్న నింగిప్రేమికుడు

ప్రతిరాత్రీ అనంత పయనం అంతటి కష్టం
మరిపించే నుదుటిపై ప్రియురాలి ముద్దులో
అలిసి సొలిసి
మరలి వస్తానంటూ
మరిచి పోవద్దంటూ
కరిగిపోతున్న ఆ ప్రియుడి
సంత్రుప్తి నిట్టూర్పు రంగులద్దుతున్న
తూరుపు అంబర చుంబనాలు

ప్రతిపగలూ నిరీక్షణలో క్షణాలు లెక్కెడుతూ
ఎడబాటు తాళలేక తీక్షణతకు వేదికౌతూ
సాయంసంధ్యకు చల్లబడి
మరో ఏకాంతానికి సిధ్ధపడుతూ
ఊహల వర్ణాలల్లుతున్న పడమటి దివిసీమల
ప్రతిఫలించే భువి ముస్తాబు సోయగాల సొబగులు

ప్రేమసాయ స్వేదబిందువుల సాక్ష్యాలు
ఆకుల కొనలన నిలిచిన మంచుముత్యాలు

ఈ కధనంతటినీ
కధలు కధలుగా చెబుతూ
కలకాదని ఒట్టేస్తూ
నిజమేనని ఒత్తి పలుకుతూ
ఆ స్వచ్చమైన మణులతో
నా కాళ్ళు కడుగుతూ
స్వాగతం పలికే ధరిత్రీపుత్రికలు

ఎవరన్నారు శృంగారం
ప్రకృతిలో లేదని?!
నే చెబుతున్నా
ప్రతి ఉదయం దానికో ఋజువని

2 comments:

ప్రతాప్ said...

చాలా బాగా రాసారు.
అందాల హరివిల్లుని..
వాకిట్లో రంగవల్లిని..
ముంగిట్లోని తొయ్యలిని..
పెరట్లోని మల్లియని..
వీటన్నింటిని వదిలేసారేం? :-)
మంచు ముత్యాలు అని అనుకొంటాను.

P.S: మీకో చిన్న సూచన, మీలాంటి మంచి భావుకత ఉన్న వాళ్ళని కూడలిలో చూడలేకపోవడం కొద్దిగా బాధగా ఉంది. దయచేసి మీ బ్లాగుని కూడలిలో చేర్చగలరు.
http://koodali.org/

Bolloju Baba said...

good going.
keep it up.
bollojubaba