ఏదో తపన
ఏదో తపస్సు
కన్నీళ్ళన్నీ తుడిచెయ్యాలనీ
కష్టాలన్నీ మడిచెయ్యాలనీ
దళారీతనాన్ని దునుమాడాలనీ
అంధత్వాన్ని అంతమొందించాలనీ
అన్నదాతకు పట్టెడన్నమవ్వాలనీ
కష్టానికి పొంగు కండనవ్వాలనీ
జాతిని రగిలించాలనీ
జ్యోతిలా జ్వలించాలనీ
జగత్తునే వెలిగించాలనీ
నా ఒక్కొక్క అక్షరం రుధిరాపాతంలా
లక్షల స్పూర్తికి కారణమవ్వాలనీ
ఏదో తపన
ఏదో తపస్సు
చిన్నారుల బోసినవ్వుగా విరియాలనీ
చిరుజల్లై పుడమిని తడపాలనీ
తాతమ్మ తనువు నిమరాలనీ
తొలికాంతిలో మంచులా కరగాలనీ
అమాయకత చిరునామా కావాలనీ
అమాసలో చంద్రమవ్వాలనీ
పున్నమిలో సంద్రమవ్వాలనీ
పులకింతల వసంతమవ్వాలనీ
అందరాని లోకం అందాలనీ
ఆద్యంతరహిత సన్నిధినుండాలనీ
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
బాగా రాశారు,
ఇలాంటివి పరిశీలనలోనుంచి పుట్టి, తపన నీడల్లో పెరిగి ఆవేశం, ఆలోచన, మొ" వాటిని అంగవస్త్రాలుగా ధరించి కాగితంపై అడుగిడి మనస్సుగల మనుషుల్లో తృష్ణని రేకెత్తిస్తాయి. మీ తపన నిజంగా ఆచరణీయం. ఇదే తపన చేతల్లో కూడా ఉండిఉంటుందని ఆశిస్తున్నాను.
ఇక పోతే కవిత విషయానికొస్తే, మొదట కొంచెం తపనతో మొదలయ్యి, ఆ తపన మొదటి చరణం చివరకి వచ్చేసరికి మహోద్గ్రరూపం దాల్చి అందరి మస్తిష్కంలో ఆలోచనల తుఫానుని రేపింది. కానీ అదే కవిత రెండో చరణంలో కొంచెం శాంతించి, తీరని చిన్న చిన్న కోరికల రూపాలను తలుస్తూ మెల్లగా అందరి మనస్సులోకి దూరి, జారి మాయమయిపోయింది.
మీరు ఇదే ఉద్దేశ్యంతో కవిత రాసి ఉంటే చాలా బాగా రాసారు. కానీ నా అభిప్రాయం ఏమిటంటే, కవిత మొదలయిన విధానం వేరు, ముగించిన విధానం వేరు. ఏదో బలమయిన సంఘటనని చూసి చలించి రాసినట్లు మొదటి చరణం ఉంటే రెండోది కాస్త అస్పృష్టంగా ఉంది. ఏదో బలమైన ముగింపుని అందిస్తుందేమో అనుకొంటే, సింపుల్ గా ముగించేసారు ఎందుకో మరి?
అమావాస్య అని అనుకొంటాను.
P.S: మీకో కొన్ని మంచి బ్లాగుల్ని పరిచయం చేయాలనిపించి ఇవిగో ఇక్కడ లింకులు ఇస్తున్నా. మీ తీరిక వేళల్లో వాటిని చదవగలరని నా వినతి.
1)కలలో.. కన్నీటి అలలో..
2)సాహితీ-యానం
3) ఊహలన్నీ ఊసులై
4) పర్ణశాల
5)స్నేహమా
చాలా బాగారాసారు.ముఖ్యంగా ప్రొఫైల్ లో మీగురించి రాసుకున్న మాటలు నాకు చాలా నచ్చేసాయి.నేను అలా వుండాలని ప్రయత్నిస్తూ ప్రతిసారీ ఓడిపోతుంటాను.మీకు నాకూ చాలా అభిప్రాయాలు,ఇష్టాలు కలుస్తున్నాయి.మిమ్మల్ని తెలుసుకోవడం చాలా బాగుంది.మరిన్ని రాస్తూవు0డ0డి.అ0దులో నన్ను వెతుక్కు0టాను :)
దయచేసి వర్డ్వెరిఫికేషన్ తేసేయరూ.కామె0టు ని 4 సార్లు తిప్పి కొట్టి0ది అక్షరాలు తప్పు రాస్తున్నానని.
Post a Comment