Saturday, January 28, 2012

మిస్సింగ్


నేను నేనుగా లేను
ఎందుకో తెలియదు
నేను నేనుగా మాత్రం లేను
సంథింగ్ ఈస్ మిస్సింగ్
అది ఏంటో ఇప్పుడు తెలియడం లేదు

ఎవరి ఉనికీ అవసరం లేకుండా ఉండడం వేరు
ఎవరి ఉనికినీ భరించలేకపోవడం వేరు
ముక్కుమీద కోపం మరునిమిషంలో ఆవిరవడం వేరు
చిరు కారణాలకే చిరాకుతో బిగుసుకుపోవడం వేరు

అందరిలో ఓ నేస్తం చూడడం వేరు
ఆప్త మిత్రులను సైతం కసరడం వేరు
కన్నీటి వెతలకు కరిగిపోవడం ఆనంద సాగరాన మునిగిపోవడం వేరు
దేనికీ చలించని రాతి హృదయం వేరు

నవ్వుతూ నవ్విస్తుండడం వేరు
నవ్వనేదే రాకపోవడం వేరు
నిశ్శబ్దాన్ని ఇష్టపడడం వేరు
స్తబ్దత ఆవరించడం వేరు

కలల హర్మ్యాలు నిర్మించడం వేరు
కలలే లేనంత శూన్యం వేరు
సంజీవని వంటి పదాలు వేరు
కత్తిలా కస్సున చీల్చే మాటలు వేరు

దైవంతో సావాసం చేయడం వేరు
దయ్యంలా ప్రవర్తించడం వేరు
ప్రేమతో జీవించడం జీవితాన్ని ప్రేమించడం వేరు
జీవితాన్ని ప్రేమరాహిత్యంతో నింపడం వేరు

మొత్తానికి...
నేను నేనుగా లేను
ఎందుకో తెలియదు
నేను నేనుగా మాత్రం లేను
సంథింగ్ ఈస్ మిస్సింగ్
అది ఏమిటో నాకు తెలియాలి
తెలుసుకుంటాను

(అందాకా... సెలవా మరి!!... సశేషం)

Wednesday, January 18, 2012

చాలు


ఎన్నిసార్లని విరిచేస్తాం
తీరని కలలు కనే ఏ హృదయాన్నైనా
ఎన్నిసార్లని పీకేస్తాం
రాతి పగుళ్ళలో తలెత్తే ఏ మొక్కనైనా

ఎన్నిసార్లని మూసేస్తాం
దారి మధ్యలో ఉబికే ఏ ఊటనైనా
ఎన్నిసార్లని తొక్కేస్తాం
శాశ్వతం అనుకునే ఏ పరకనైనా

ఎన్నిసార్లని కుక్కేస్తాం
నిండిపోయిన ఏ ఙాపకాల పెట్టెలోనైనా
ఎన్నిసార్లని ఛేదిస్తాం
అసాధ్యమని తెలిసిన ఏ పద్మవ్యూహాన్నైనా

ఎన్నిసార్లని ముందుకుతోస్తాం
అలసత్వం నిండిన ఏ పిరికి మెదడునైనా
ఎన్నిసార్లని చూస్తూంటాం
ఎటు దూకాలో తెలియని ఏ గోడమీది పిల్లినైనా

ఇక చాలు

ఇది మొదలు
హృదయాలూ లేవు
పగిలే కలలూ లేవు
రాళ్ళలో చెమ్మా లేదు
మొక్కలూ రావు
దారీ లేదు
ఉబికే ఊటా లేదు
మెదడూ లేదు
స్పందనలూ లేవు
పెట్టెలూ లేవు
ఙాపకాలూ లేవు
పద్మవ్యూహాలూ లేవు
పత్తికట్టలూ లేవు
గోడలూ లేవు
పిల్లులూ లేవు

ఉన్నదేమిటా?
ఓన్లీ ప్రాక్టికాలిటీ

(మరి... మాజిక్ లేకుండా బతకడం అంటే, రసం లేని పిప్పి తినడమేగా?!)


Tuesday, January 17, 2012

ఈవేళ తలపు (Thought of the day)


జనవరి 17, 2012

చేయగలిగినది చేయకపోయినా
చేయకూడనిది చేయకు


జనవరి 5, 2011

తమ జీవితాలను స్పృశించే వారందరినీ తడిపేంత ప్రేమ అందరిలోనూ ఉంటుంది.
చేయాల్సిందల్లా, దైవం కొలువుండే మన అంతరాత్మలోని అపారమైన ఊటను చేదుకోవడమే.



Thursday, January 5, 2012

సడి



ఏదో రాయాలని కూర్చున్నా
ఏమీ రావడం లేదు
బుర్రంతా బూజు పట్టిన ఫీలింగ్

జీవితం రాదారి మీద దూసుకుపోతున్న ఆలోచనలు
ఏదీ నిలకడగా ఆగందే!
నా పిచ్చి గానీ, ఆగి చూసే తీరిక ఓపిక
ఇప్పుడెవరికి ఉన్నాయనీ!

ఆరాటం ఆరాటం
ఏదో సాధించాలనే ఆరాటం
అందరూ అదే పోరాటం
ఏదీ లేకుండా ఉండడం కూడా ఒక జబ్బేమో!...
ఇదే ఇప్పుడు నా అనుమానం

ఒక సారి ఎగ్సిట్ తీసుకున్నాక
మళ్ళీ హైవే ఎక్కాలంటే 'అబ్బా...తప్పదా?!..'
అని మూలుగుతున్న మనసు
అంతా బధ్ధకమే అంటావా?? లేక...
'కొత్తగా ఏముందిలే?!' - అనే వైరాగ్యమా??...

ఎప్పుడూ నదిలా సాగే జీవితం
ఒక్కసారిగా పక్కనే ఆగిన చెత్తలో
ప్లాస్టిక్ బాటిల్లా అనిపిస్తుందేమిటి?!...

రెస్ట్ ఏరియాలో
మరీ ఎక్కువ సేపు ఆగడం వల్ల
వచ్చిన ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనుకుంటా...


ఓకే... లెట్స్ ఫ్లష్ అండ్ స్ట్రెచ్
ఇట్స్ టైం ఫర్ హైవే, బేబి!!