Wednesday, January 18, 2012

చాలు


ఎన్నిసార్లని విరిచేస్తాం
తీరని కలలు కనే ఏ హృదయాన్నైనా
ఎన్నిసార్లని పీకేస్తాం
రాతి పగుళ్ళలో తలెత్తే ఏ మొక్కనైనా

ఎన్నిసార్లని మూసేస్తాం
దారి మధ్యలో ఉబికే ఏ ఊటనైనా
ఎన్నిసార్లని తొక్కేస్తాం
శాశ్వతం అనుకునే ఏ పరకనైనా

ఎన్నిసార్లని కుక్కేస్తాం
నిండిపోయిన ఏ ఙాపకాల పెట్టెలోనైనా
ఎన్నిసార్లని ఛేదిస్తాం
అసాధ్యమని తెలిసిన ఏ పద్మవ్యూహాన్నైనా

ఎన్నిసార్లని ముందుకుతోస్తాం
అలసత్వం నిండిన ఏ పిరికి మెదడునైనా
ఎన్నిసార్లని చూస్తూంటాం
ఎటు దూకాలో తెలియని ఏ గోడమీది పిల్లినైనా

ఇక చాలు

ఇది మొదలు
హృదయాలూ లేవు
పగిలే కలలూ లేవు
రాళ్ళలో చెమ్మా లేదు
మొక్కలూ రావు
దారీ లేదు
ఉబికే ఊటా లేదు
మెదడూ లేదు
స్పందనలూ లేవు
పెట్టెలూ లేవు
ఙాపకాలూ లేవు
పద్మవ్యూహాలూ లేవు
పత్తికట్టలూ లేవు
గోడలూ లేవు
పిల్లులూ లేవు

ఉన్నదేమిటా?
ఓన్లీ ప్రాక్టికాలిటీ

(మరి... మాజిక్ లేకుండా బతకడం అంటే, రసం లేని పిప్పి తినడమేగా?!)


No comments: