Saturday, January 28, 2012

మిస్సింగ్


నేను నేనుగా లేను
ఎందుకో తెలియదు
నేను నేనుగా మాత్రం లేను
సంథింగ్ ఈస్ మిస్సింగ్
అది ఏంటో ఇప్పుడు తెలియడం లేదు

ఎవరి ఉనికీ అవసరం లేకుండా ఉండడం వేరు
ఎవరి ఉనికినీ భరించలేకపోవడం వేరు
ముక్కుమీద కోపం మరునిమిషంలో ఆవిరవడం వేరు
చిరు కారణాలకే చిరాకుతో బిగుసుకుపోవడం వేరు

అందరిలో ఓ నేస్తం చూడడం వేరు
ఆప్త మిత్రులను సైతం కసరడం వేరు
కన్నీటి వెతలకు కరిగిపోవడం ఆనంద సాగరాన మునిగిపోవడం వేరు
దేనికీ చలించని రాతి హృదయం వేరు

నవ్వుతూ నవ్విస్తుండడం వేరు
నవ్వనేదే రాకపోవడం వేరు
నిశ్శబ్దాన్ని ఇష్టపడడం వేరు
స్తబ్దత ఆవరించడం వేరు

కలల హర్మ్యాలు నిర్మించడం వేరు
కలలే లేనంత శూన్యం వేరు
సంజీవని వంటి పదాలు వేరు
కత్తిలా కస్సున చీల్చే మాటలు వేరు

దైవంతో సావాసం చేయడం వేరు
దయ్యంలా ప్రవర్తించడం వేరు
ప్రేమతో జీవించడం జీవితాన్ని ప్రేమించడం వేరు
జీవితాన్ని ప్రేమరాహిత్యంతో నింపడం వేరు

మొత్తానికి...
నేను నేనుగా లేను
ఎందుకో తెలియదు
నేను నేనుగా మాత్రం లేను
సంథింగ్ ఈస్ మిస్సింగ్
అది ఏమిటో నాకు తెలియాలి
తెలుసుకుంటాను

(అందాకా... సెలవా మరి!!... సశేషం)

1 comment:

రసజ్ఞ said...

చాలా బాగా చెప్పారు! తెలుసుకున్నారా లేదా? త్వరగా పూర్తి చేయండి!