నీ పుట్టినరోజు
ఏం ఇవ్వాలబ్బా?!...
గడ్డంపై చూపుడువేలు తాటిస్తూ
ఎప్పటిలానే సందిగ్ధంలో పడిపోయా
అందులోనూ కసితీరా కొట్టుకున్నాక
కలయిక కూడానూ
ప్రత్యేకంగా ఉండొద్దూ!!
పువ్వంటి నవ్వున్న అమ్మాయికి
ఎర్రటి కోపాల కొమ్మకి
గులాబీ వంటి పూలమొక్క ఇవ్వడం కన్నా
మంచి కానుక ఏముంటుంది?!
లెస్స పలికితివి! అని భుజం తట్టుకుని
నిప్పులు చెరిగే ఎండలో
ఓ హరితవనంలో కాలుపెట్టి
ఆ తోటమాలి పనిపట్టి
ఒక మంచి మొక్కని ఎంచి...
ఆగాగు... ఎలాంటి మొక్క మరి?!
అలాంటి ఇలాంటిది కాదు సుమా!
ఓ సొగసైన పువ్వుండి
మరో రెండు మొగ్గలున్న
అందమైన ఆరోగ్యమైన
ఆకులున్న కొమ్మలున్న
ఒక రోజా మొక్క
అంతే అందమైన కుండీ లో పెట్టించి
నీ కోపమంత ఎర్రటి మట్టి పోయించి
నడుం వంగినా పరవాలేదంటూ
మోసుకొచ్చి
వేసవితాపానికి వాడిన నీ వదనంలా ఉన్న మొక్కపై
నీరు పోసి...
ఉండు మరి... ఎలాంటి నీరు?!
అలాంటి ఇలాంటి నీరు కాదు సుమా!
మేఘమధనం జరిపించి
తొలకరిజల్లు కురిపించి
తొలి అమృతధారలతో తడిపి
అందాల హరివిల్లు గొడుగు వేసి
శోష వచ్చిన ప్రాణాన్ని నిలబెట్టి
ప్రేమగా లాలించి
నీకిస్తున్న కానుక
జాగ్రత్తగా చూసుకుంటావు కదూ!
నీ హృదయమంత పదిలంగా!!
(ప్రియమైన నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలతో... కానుకగా మొక్కలిచ్చే శుభకార్యానికి శ్రీకారం చుడుతూ)
No comments:
Post a Comment