Friday, July 11, 2008

నేటి తరం

చదువుకుంటూ కూడా సమాజసేవ చేస్తున్న వాళ్ళు, కవిత్వమే ఊపిరిగా జీవించే వాళ్ళు, కోరిన ఉద్యోగం రాలేదని వాపోయే చిన్నారులు, తన తరం డబ్బుసంపాదనాప్రభావాన్ని తమ మీద పడనీయకుండా కళాప్రాభవాన్ని వెలిగిద్దామనుకుంటున్న యువతీయువకులు... వారాంతాలలో వెళ్ళే సరదా యాత్రల్లో తరచూ దర్శించే వ్రుధ్ధాశ్రమాలు, అనాధశరణాలయాలు... సామాన్యులైనా సాటివారిగా స్పందిస్తున్న హ్రుదయాలు... మురికికూపం అనబడే రాజకీయాలలో ప్రవేశించి ప్రక్షాళన చేస్తున్న వాళ్ళు... ఇది నేటి తరం... మార్పు ప్రవహిస్తుంది నరం నరం... ఇది నాకు గర్వకారణం...

అయితే, ఈ తరానికి ఇంకో కోణం కూడా ఉంది - పెరిగిపోతున్న అస్థిత్వ అన్వేషణ... కులమో, మతమో, తమ సామర్ధ్యమో, స్నేహితులో, ప్రేమికులో, సన్నిహితుల జ్ఞాపకాలో, గతించిన ఇజాలో, చరిత్ర నిరూపించినా కనపడని నిజాలో... కమ్మూనిజానికి పెరుగుతున్న ఆదరణ... చే గివారా నాయకత్వంపై ఎనలేని అభిమానం... హిట్లర్ నాయకత్వం పైనా సాఫ్ట్ కార్నర్!... ఎటు పోతుంది ఈ తరం?

అయితే, నిజంగా వాళ్ళు కోరుకుంటున్నది ఏమిటి? అంతరాంతరాల్లో ఉన్న మూలకారణం ఏమిటి? - సమానత్వం, న్యాయం, నీతి, అంతరించిపోతున్న కళలను బతికించడం, విరిగిపోతున్న విలువలను అతికించడం... - అన్నీ మంచి ఉద్దేశ్యాలే... ఎన్నుకునే సిధ్ధాంతాలు, ఆచరణా విధానాలు, కొలుస్తున్న వేలుపులు అన్నీ మంచివేనా? ఏమో!

కాలం పరీక్షలో నెగ్గని ఏ ఇజమైనా, తిరిగి బలవంతం గా ప్రాణంపోసినా ఎంతో కాలం మనలేదు, మళ్ళీ కాలంలో కాలంచేయాల్సిందే! అన్నిటికీ మించి, స్వతహాగా మారలేని జాడ్యాలన్నీ బలవంతపు బ్రాహ్మణార్ధం అయిపోగానే మళ్ళీ వెలుగు చూసేవే... నిజమైన మార్పు లోపలినుండి వస్తుంది... ఎన్ని మార్గాలు కళ్ళెదురుగా ఉన్నా, మంచిని ఎన్నుకునే స్థైర్యాన్నిస్తుంది... ఒక విత్తనం మొలకెత్తాలంటే దానికి అనుకూలించే పరిస్థితులు ఉండాలి - ముందు మంచి విత్తనం, మంచి మట్టి, తగినంత తేమ... అలానే సహజసిధ్ధంగా మార్పు రావాలంటే, ముందు మంచి సిధ్ధాంతం, స్వేచ్చ, శాంతి, ముందు మనం తెలుసుకోడం, మనం ఆచరిస్తూ దాని గురించి పదిమంచికి చెప్పడం, ప్రభావితం చేయడం... ఇలా కాకుండా కష్టపడి సంపాదించిన వాడి ఫలాన్ని బలవంతంగా (అది రక్తపాతమైనా సరే) తీసుకెళ్ళి అంత కష్టపడనివాడికి ఇవ్వడం ఎంత వరకూ ఫలిస్తుంది? ఇక్కడ సిధ్ధాంతం మంచిదే - సామాజిక సమానత్వం, కానీ దానిని అనుసరించే విధానమే వేరు... రష్యా నుండి మనం నేర్చుకున్న పాఠాలేమిటి? చైనా నుండి నేర్చుకుంటున్న పాఠాలేమిటి?

ఉదాహరణకి, రేప్పొద్దున్న మీరే ఒక కంపెనీ పెట్టారనుకోండి... మీకు వచ్చిన లాభాలను స్వఛ్ఛందంగా చుట్టూ ఉన్న సమాజాన్ని అభివ్రుధ్ధి చేయడానికి ఖర్చు చేస్తే ఎలా ఉంటుంది? అలా కాక, ప్రభుత్వమే మీ లాభాలలో సింహభాగాన్ని సమానత పేరుతో లాగేసుకుని తమకిష్టమైనచోట పంపిణీ చేస్తే ఎలా ఉంటుంది? రెండవ పధ్ధతిలో జరిగితే, మీకు కష్టపడి పని చేయాలనిపిస్తుందా? ఉత్పాదకత పెంచాలనిపిస్తుందా? రెండిటిలోనూ ఉద్దేశ్యం ఒకటే - సమానత్వం... కానీ ఆచరణలో నాగలోకానికీ, నక్కకూ ఉన్నంత తేడా ఉంది... కాదనగలరా?! స్వచ్చందంగా, ప్రేమతో, త్యాగంతో చేసే సేవ, చేసేవారికీ చేయించుకునేవారికీ ఆనందదాయకం, అలా వచ్చే మార్పు శాశ్వతం, ఆరోగ్యకరం.

బురద బురద అని నిందించడం ఒక్కటే కాక, ఆ బురదలో దిగి, శుభ్రం చేయడానికి లోక్ సత్తా స్థాపించిన ప్రజారాజకీయవేత్త జయప్రకాష్ నారాయణ్; పేదరిక నిర్మూలనకు నడుంకట్టి, గ్రామీణ్ బాంక్ ద్వారా పూచీకత్తు లేని స్వల్పఋణాలకు శ్రీకారం చుట్టి, ఎందరో పేదలకు వెలుగునిస్తున్న సామాజికస్ప్రుహ ఉన్న వ్యాపారవేత్త మహమ్మద్ యూనస్; స్వయంసమ్రుధ్ధ గ్రామాన్ని ఆనందవనంగా సమాజం వెలివేసిన కుష్టువారితో ప్రారంభించి, వారికి పునర్జీవితాన్ని, ఆత్మగౌరవాన్ని ఇచ్చిన మానవతావాది బాబా ఆమ్టే; దైవం పిలుపుకు స్పందించి, పరాయిదేశం వచ్చి, అంటరాని వారిని ప్రేమించి, సేవించి, ఆ దేశవాసుల హ్రుదయాల్లో సుస్థిరస్థానం పొందిన అమ్మ, కరుణామయి థెరెసా... వర్ణసమానత స్వప్నించి, దానికై తన ప్రాణం పోయేవరకు పోరాడిన సమానతావాది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్... ఇంకా ఇలాంటి ఎందరో మహానుభావులు... వీరు మనకు ఆదర్శప్రాయం...

ఈ తరం, కాలగమనంలో చతికిలపడ్డ సిధ్ధాంతాలకు, ఆచరణాశైలికి తిరిగి బలవంతంగా పునర్జీవం పోసేకంటే, చరిత్ర నుండి పాఠాలను, అన్ని ఇజాల నుండి మంచిని నేర్చుకుని, మరో కొత్త ఇజాన్ని కనిపెట్టడం ఉత్తమం... ఇది కొత్త తరం... మళ్ళీ పాత బూజునే తగిలించుకోడం ఎంతవరకు పురోగమనం?! ఈ తరానికి మరో కొంగొత్తశైలిని కనిపెట్టే సత్తా ఉంది... వెనకటి తరాల నుండి పాఠాలను స్వీకరించి, మీ ఆశలను, ఆశయాలను, ఊహలను జోడించి నవ్యత్వంతో ముందుకు నడవండి... మీ వెనుక తరాలను వేలుపట్టి నడిపించండి... ముందు తరాలకు బంగారుబాట వేయండి... జై ఈ తరం.

1 comment:

Raj Verma said...

ae taraanikainaa kaavalasindhi chakkati avagaahana mariyu aalochanaa saraLi... naeti taramlo Parignaana-Vignaanaalu roju rojuki perugutunnavi kaani Gnanam maatram tarugutondhi... sochaneeyam... lacking of proper parental guidance and unable to adjust properly with the fast changing socio-cultural environment around us, could be the main reasons for this sordid state of affairs...