Tuesday, October 9, 2012

బాణం


ఎప్పుడో ఎవరో వేసే ఉంటారు
నీపై నిప్పుల బాణాలు

ఎన్నాళ్ళని తిరుగుతూ ఉంటావ్? -
వీపుకు గుచ్చుకుని


పీకెయ్...
కొన్నాళ్ళు నొప్పి పెడుతుందేమో!
గాయం మానాక
మచ్చ కూడా పడుతుందేమో!

తీయకపోతే మాత్రం
ఒళ్ళు తగలబెట్టుకున్నట్టే...!


కొంతకాలం కసినే
ఇంధనంగా మార్చి
ముందుకు సాగుతావేమో!
ఒక్కోసారి మజిలీ కూడా చేరతావేమో!

చివరంటా ఉంచితే మాత్రం
నిజమైన నిన్ను మసి చేసుకున్నట్టే...!


ఆత్మావలోకనం చేసుకునే తరుణం
నిన్ను నువ్వే బేరీజు వేసుకునే సమయం
ఒక దారి మూసుకుపోతే
మరో ద్వారం వెతికే సందర్భం

పదే పదే తలుచుకుని ఏడిస్తే మాత్రం
ముందుకు వెళ్ళలేక చతికిలపడ్డట్టే!


లే...
కళ్ళు తుడుచుకో
స్పష్టంగా కనపడుతుంది
నిటారుగా నిలబడు
మార్గం అగుపిస్తుంది
లక్ష్యాన్ని ఛేదించు
గమ్యం చేరువవుతుంది
సాధించి చూపించు
లోకం తలవొంచుతుంది

నిత్య చైతన్యంతో విశ్వాన్ని నింపెయ్
అనంతమే నీ సొంతమవుతుంది

(ఒకసారి ఓడిన తమ్ముడికి, గెలుపు అందుకొమ్మని పిలుపునిస్తూ...)

Friday, May 11, 2012

మిస్సింగ్


అందరినుండీ అన్నిటినుండీ
దూరంగా పారిపోయా
ఏకాంతం కోసం

తీరా ఆ రోజు వచ్చేసరికి
ఒంతరితనం ఎదురయింది

చుట్టూ మనుషులే... కాదు కాదు
చెవిలో సంగీతం వినే ఐటీ మరబొమ్మలు
చేతిలో ఏమిటవి? శంఖు చక్రాలా?.. కాదు కాదు
పెరిగిపోయిన సాంకేతికతకు గీటురాళ్ళు

చుట్టూ భవనాలే... కాదు కాదు
పిచ్చుకలు దూరని పిచ్చి కాంక్రీట్ వనాలు
అరె! గోడ పక్కనే ఎవరు వాళ్ళు? అనాగరికులా?.. కాదు కాదు
పేద పెద్ద మధ్య పేరుకుపోయిన అగాధానికి ఆనవాళ్ళు

మనసునుండి మనసుని విడదీయడమంటే
పారిపోయినంత తేలిక కాదు
సయామీస్ కవలలని కత్తితో కోసి వేరు చేసినంత బాధ
కొన్ని కోయాల్సిందే
కొన్ని తీయాల్సిందే

అన్ని కోతలు
తీసివేతలు అయ్యాక చూస్తే
నేనే మిస్సింగ్...

నన్ను నేను
వెతుక్కుంటున్నా
ఎవరికైనా కనిపించానా?!

Tuesday, March 13, 2012

పుట్టినరోజు


నీ పుట్టినరోజు
ఏం ఇవ్వాలబ్బా?!...
గడ్డంపై చూపుడువేలు తాటిస్తూ
ఎప్పటిలానే సందిగ్ధంలో పడిపోయా
అందులోనూ కసితీరా కొట్టుకున్నాక
కలయిక కూడానూ
ప్రత్యేకంగా ఉండొద్దూ!!

పువ్వంటి నవ్వున్న అమ్మాయికి
ఎర్రటి కోపాల కొమ్మకి
గులాబీ వంటి పూలమొక్క ఇవ్వడం కన్నా
మంచి కానుక ఏముంటుంది?!

లెస్స పలికితివి! అని భుజం తట్టుకుని
నిప్పులు చెరిగే ఎండలో
ఓ హరితవనంలో కాలుపెట్టి
ఆ తోటమాలి పనిపట్టి
ఒక మంచి మొక్కని ఎంచి...
ఆగాగు... ఎలాంటి మొక్క మరి?!
అలాంటి ఇలాంటిది కాదు సుమా!

ఓ సొగసైన పువ్వుండి
మరో రెండు మొగ్గలున్న
అందమైన ఆరోగ్యమైన
ఆకులున్న కొమ్మలున్న
ఒక రోజా మొక్క

అంతే అందమైన కుండీ లో పెట్టించి
నీ కోపమంత ఎర్రటి మట్టి పోయించి
నడుం వంగినా పరవాలేదంటూ
మోసుకొచ్చి
వేసవితాపానికి వాడిన నీ వదనంలా ఉన్న మొక్కపై
నీరు పోసి...
ఉండు మరి... ఎలాంటి నీరు?!
అలాంటి ఇలాంటి నీరు కాదు సుమా!

మేఘమధనం జరిపించి
తొలకరిజల్లు కురిపించి
తొలి అమృతధారలతో తడిపి
అందాల హరివిల్లు గొడుగు వేసి
శోష వచ్చిన ప్రాణాన్ని నిలబెట్టి
ప్రేమగా లాలించి
నీకిస్తున్న కానుక

జాగ్రత్తగా చూసుకుంటావు కదూ!
నీ హృదయమంత పదిలంగా!!

(ప్రియమైన నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలతో... కానుకగా మొక్కలిచ్చే శుభకార్యానికి శ్రీకారం చుడుతూ)


Thursday, March 8, 2012

దెబ్బ


మనసుకి చేసిన గాయాలు
విషం చిమ్ముతున్నాయి
హృదయానికి తగిలిన దెబ్బలు
నిప్పులవర్షం కురుస్తున్నాయి
చేసిన తప్పులు
విచ్చుకత్తులు దూస్తున్నాయి
లేపిన చెక్కులు
పచ్చిగా రసి కారుతున్నాయి

నేస్తం!
ఇది
మౌనంగా అంతర్మధనం
జరిపే సమయం
శాంతంగా సమాధానం
వెతికే తరుణం

కాలాన్ని కొంత మాయ చెయ్యనీ
గాయాన్ని కొంత మాననీయనీ

ఆపై...
నా ప్రేమవనంలో సేద తీరుతావో
మరో రహదారిలో సాగిపోతావో
నీ ఇష్టం

Wednesday, February 22, 2012

ఇప్పుడిప్పుడే



ఇప్పుడిప్పుడే మళ్ళీ పుడుతున్నా
ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నా

ప్రతీక్షణం పుడుతూ చచ్చే
వేల కణాల సమూహాన్ని నేను
ప్రతీనిమిషం పడుతూ లేచే
కోట్ల కలల సమాహారం నేను

కలలు...
చాలా చిత్రంగా ఉంటాయవి
ఎలా వస్తాయో కొన్ని! -
మన అంతరాంతరాలను ఊపేస్తాయి

అనంత విశ్వాలన్నీ కలిసి
చూపుడువేలితో తాకినట్టుంటాయి
నిద్రపోతున్న జాగ్రదావస్థను
సున్నితంగా లేపినట్టుంటాయి
మూసుకుపోయిన మూడోకన్ను
మెల్లగా తెరిచినట్టుంటాయి
అర్ధంకాని వేదనకు
తపనకు తపస్సుకు
సమాధానంలా ఉంటాయి

ఒకరికో ఇద్దరికో
పరిమితమై గిరిగీసిన ప్రేమను
ప్రపంచానికి పంచమంటాయి
పరిధిని పెంచమంటాయి
పసిపాప పెదవిమీద పాలనురగలా
స్వఛ్ఛంగా ఉండమంటాయి
హాయిగా నవ్వమంటాయి
అదుపాజ్ఞలు లేని గాలిలా
అంతమే ఎరుగని నింగిలా
పక్షపాతం తెలియని వానలా
ఉత్సాహమే తెలిసిన వాగులా
మారమంటాయి

ఆర్తికి అర్ధానికి మధ్య
వారధి కమ్మంటాయి

కృషి చేసే సంకల్పం
కష్టానికి ఫలితం
కడుపునిండా సంతోషం
కలసికట్టుగా కలలు కనే సమయం
ఇలను స్వర్గం చేసే సామర్ధ్యం
శాంతి సహనం సమత ధర్మం
సమతుల్యం హరిత వనం
సంతసించే పుడమి మనం...
కేరింతలు నవ్వులు నిండిన
మరోప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి

ఇప్పుడిప్పుడే కలలు కంటున్నా
ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నా

(పుట్టినరోజున నాకు నేనే ఇచ్చుకున్న కలల కానుక)

Thursday, February 2, 2012

ఆత్మావలోకనం


ఏ లక్ష్యం లేకపోవడం
ఎంతటి ఆప్తులై'నా' స్వేచ్చను హరించడం
అసలు అటువంటి వాతావరణంలో నేనుండడం
కఠిన నిర్ణయాలను నిరంతరం వాయిదా వేయడం
తోటివారితోనూ దైవంతోనూ సత్సంబంధాలు లేకపోవడం
ఆత్మీయుల సమూహానికి దూరంగా ఉండడం
ఏ ఆటలూ ఆడకపోవడం
నూతనంగా ఏమీ నేర్చుకోకపోవడం
తగినంత పనివొత్తిడి, జట్టు లేకపోవడం
స్వార్ధరహిత సేవాకార్యక్రమాలలో పాల్గొనకపోవడం
ఉన్న మంచిని దీవించడానికి బదులు
లోపాలను ఎత్తిచూపడం...

... ఇలా ఎక్కువకాలం ఉండడం
తద్వారా సంభవించేది లోపలి మరణం

శారీరకంగా
మానసికంగా
ఆధ్యాత్మికంగా
ఆర్ధికంగా
నను నేను సరిగా చూసుకోకపోతే
ఇంకెవరినీ సరిగా చూసుకునే స్థితిలో ఉండను
అనేది నిరూపించబడిన సత్యం

సమస్య ఏమిటో తెలిసిందిగా
సగం పరిష్కారం దొరికినట్టే!

(నను నేను సరిచేసుకునే క్రమంలో మౌనకుహరంలో కొన్నాళ్ళు తిష్టవేస్తే అది మీ తప్పు కాదని గ్రహించమని మనవి)

Saturday, January 28, 2012

మిస్సింగ్


నేను నేనుగా లేను
ఎందుకో తెలియదు
నేను నేనుగా మాత్రం లేను
సంథింగ్ ఈస్ మిస్సింగ్
అది ఏంటో ఇప్పుడు తెలియడం లేదు

ఎవరి ఉనికీ అవసరం లేకుండా ఉండడం వేరు
ఎవరి ఉనికినీ భరించలేకపోవడం వేరు
ముక్కుమీద కోపం మరునిమిషంలో ఆవిరవడం వేరు
చిరు కారణాలకే చిరాకుతో బిగుసుకుపోవడం వేరు

అందరిలో ఓ నేస్తం చూడడం వేరు
ఆప్త మిత్రులను సైతం కసరడం వేరు
కన్నీటి వెతలకు కరిగిపోవడం ఆనంద సాగరాన మునిగిపోవడం వేరు
దేనికీ చలించని రాతి హృదయం వేరు

నవ్వుతూ నవ్విస్తుండడం వేరు
నవ్వనేదే రాకపోవడం వేరు
నిశ్శబ్దాన్ని ఇష్టపడడం వేరు
స్తబ్దత ఆవరించడం వేరు

కలల హర్మ్యాలు నిర్మించడం వేరు
కలలే లేనంత శూన్యం వేరు
సంజీవని వంటి పదాలు వేరు
కత్తిలా కస్సున చీల్చే మాటలు వేరు

దైవంతో సావాసం చేయడం వేరు
దయ్యంలా ప్రవర్తించడం వేరు
ప్రేమతో జీవించడం జీవితాన్ని ప్రేమించడం వేరు
జీవితాన్ని ప్రేమరాహిత్యంతో నింపడం వేరు

మొత్తానికి...
నేను నేనుగా లేను
ఎందుకో తెలియదు
నేను నేనుగా మాత్రం లేను
సంథింగ్ ఈస్ మిస్సింగ్
అది ఏమిటో నాకు తెలియాలి
తెలుసుకుంటాను

(అందాకా... సెలవా మరి!!... సశేషం)

Wednesday, January 18, 2012

చాలు


ఎన్నిసార్లని విరిచేస్తాం
తీరని కలలు కనే ఏ హృదయాన్నైనా
ఎన్నిసార్లని పీకేస్తాం
రాతి పగుళ్ళలో తలెత్తే ఏ మొక్కనైనా

ఎన్నిసార్లని మూసేస్తాం
దారి మధ్యలో ఉబికే ఏ ఊటనైనా
ఎన్నిసార్లని తొక్కేస్తాం
శాశ్వతం అనుకునే ఏ పరకనైనా

ఎన్నిసార్లని కుక్కేస్తాం
నిండిపోయిన ఏ ఙాపకాల పెట్టెలోనైనా
ఎన్నిసార్లని ఛేదిస్తాం
అసాధ్యమని తెలిసిన ఏ పద్మవ్యూహాన్నైనా

ఎన్నిసార్లని ముందుకుతోస్తాం
అలసత్వం నిండిన ఏ పిరికి మెదడునైనా
ఎన్నిసార్లని చూస్తూంటాం
ఎటు దూకాలో తెలియని ఏ గోడమీది పిల్లినైనా

ఇక చాలు

ఇది మొదలు
హృదయాలూ లేవు
పగిలే కలలూ లేవు
రాళ్ళలో చెమ్మా లేదు
మొక్కలూ రావు
దారీ లేదు
ఉబికే ఊటా లేదు
మెదడూ లేదు
స్పందనలూ లేవు
పెట్టెలూ లేవు
ఙాపకాలూ లేవు
పద్మవ్యూహాలూ లేవు
పత్తికట్టలూ లేవు
గోడలూ లేవు
పిల్లులూ లేవు

ఉన్నదేమిటా?
ఓన్లీ ప్రాక్టికాలిటీ

(మరి... మాజిక్ లేకుండా బతకడం అంటే, రసం లేని పిప్పి తినడమేగా?!)


Tuesday, January 17, 2012

ఈవేళ తలపు (Thought of the day)


జనవరి 17, 2012

చేయగలిగినది చేయకపోయినా
చేయకూడనిది చేయకు


జనవరి 5, 2011

తమ జీవితాలను స్పృశించే వారందరినీ తడిపేంత ప్రేమ అందరిలోనూ ఉంటుంది.
చేయాల్సిందల్లా, దైవం కొలువుండే మన అంతరాత్మలోని అపారమైన ఊటను చేదుకోవడమే.



Thursday, January 5, 2012

సడి



ఏదో రాయాలని కూర్చున్నా
ఏమీ రావడం లేదు
బుర్రంతా బూజు పట్టిన ఫీలింగ్

జీవితం రాదారి మీద దూసుకుపోతున్న ఆలోచనలు
ఏదీ నిలకడగా ఆగందే!
నా పిచ్చి గానీ, ఆగి చూసే తీరిక ఓపిక
ఇప్పుడెవరికి ఉన్నాయనీ!

ఆరాటం ఆరాటం
ఏదో సాధించాలనే ఆరాటం
అందరూ అదే పోరాటం
ఏదీ లేకుండా ఉండడం కూడా ఒక జబ్బేమో!...
ఇదే ఇప్పుడు నా అనుమానం

ఒక సారి ఎగ్సిట్ తీసుకున్నాక
మళ్ళీ హైవే ఎక్కాలంటే 'అబ్బా...తప్పదా?!..'
అని మూలుగుతున్న మనసు
అంతా బధ్ధకమే అంటావా?? లేక...
'కొత్తగా ఏముందిలే?!' - అనే వైరాగ్యమా??...

ఎప్పుడూ నదిలా సాగే జీవితం
ఒక్కసారిగా పక్కనే ఆగిన చెత్తలో
ప్లాస్టిక్ బాటిల్లా అనిపిస్తుందేమిటి?!...

రెస్ట్ ఏరియాలో
మరీ ఎక్కువ సేపు ఆగడం వల్ల
వచ్చిన ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనుకుంటా...


ఓకే... లెట్స్ ఫ్లష్ అండ్ స్ట్రెచ్
ఇట్స్ టైం ఫర్ హైవే, బేబి!!