Monday, April 21, 2008

నేను

తన్ను తాను తెలుసుకోవాలనే తాతగారి
తత్వానికి అర్థాన్ని వెతుకుతూ ఉంటాను...

నా జీవిత నౌకలో పయనిస్తూ ఉంటాను...
ఆ అలల్లా అలుపెరగక పడుతూ లేస్తుంటాను...

అక్షరాలతో ఆడుకుంటూ ఉంటాను...
వచ్చీరాని రాగాలతో పాడుకుంటూ ఉంటాను...

కన్నీటి వెతలకు కరిగిపోతుంటాను...
ఆనంద సాగరాన మునిగిపొతుంటాను...

గాయపడిన గుండెకి జోల పాడుతుంటాను...
ప్రక్రుతిమాత ఒడిలో నిదురపోతుంటాను...

నే కొట్టిన మేకులను వెలికితీసే వ్రుధాప్రయాసలో ఉంటాను...
మిగిలిన గుంటలు చూస్తూ నిస్సహాయంగా మిగిలిపోతుంటాను...

నవ్వుతూ నవ్విస్తుంటాను...
నిశ్శబ్దాన్ని ఇష్టపడుతుంటాను...

బోసి నవ్వులతో కాలక్షేపం చేస్తుంటాను...
ముదిమి వయసులతో కబుర్లాడుతుంటాను...

అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటాను...
'మన' మధ్య అడ్డుగోడలను కూలదోస్తుంటాను...

కలల హర్మ్యాలు నిర్మిస్తుంటాను...
స్వేచ్చావిహంగమై విహరిస్తుంటాను...

వీడిపొవువారికి వీడ్కోలు చెప్తుంటాను...
నూతనత్వాన్ని లోకానికి ఆహ్వానిస్తుంటాను...

జ్ఞాపకాల మట్టిని తవ్వుకుంటుంటాను...
ఈ క్షణంలో జీవితాంతం బతికేస్తుంటాను...

అందరిలో ఓ నేస్తం చూస్తుంటాను...
దైవంతో సావాసం చేస్తుంటాను...

నిత్యం ఏదోటి నేర్చుకుంటూ ఉంటాను...
నను నేను కొత్తగా నిర్వచిస్తూనే ఉంటాను...

జీవితాన్ని ప్రేమిస్తుంటాను...
ప్రేమతో జీవిస్తుంటాను...


Orkutలో "నా గురించి" అనే శీర్షిక చూశాక, నేనెవరో తెలియని వారికి నా గురించి టూకీగా ఎలా చెప్పాలి - అనే అలోచనలోంచి వచ్చిందే "నేను".

ఇక్కడ నేను చెప్పిన తాతగారు, నా చిన్ననాటి నేస్తం వాళ్ళ తాతగారు. నేనింతకుముందే చెప్పిన నానమ్మ పెనిమిటి. ఇస్లాం మత గురువు. తోటివారికంటే చాలా వైవిధ్యంగా ఉండేవారు. అమ్మన్నీ అని ముద్దు చేసేవారు. వచ్చే పోయే శిష్యులతో వారి ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. "తనను తాను తెలుసుకోవడమే ఆధ్యాత్మిక లక్ష్యం" అని బోధించేవారు. జీవించి ఉన్న రోజుల్లో ఆయన జీవనసారాన్ని అందుకోవాలనే ఆలోచన ఉండేది కాదు. తీరా, ఆయన తత్వం తెలుసుకోవాలనే ఆసక్తి కలిగేసరికి అందుబాటులో లేకుండా పోయారు. చాలా హడావుడిగా, ఏదో పెద్ద పని ఉన్నట్టు దేవుడి దగ్గరకు వెళ్ళిపోయారు. ఆయన తత్వానికి అర్ధాన్ని వెతుకుతూనే ఉన్నాను... అందుకే అంటాను... ఎవరైనా, ముఖ్యంగా పెద్దవారు, మనమధ్య ఉన్నప్పుడే, వారి జీవితసారాన్ని వారి ద్వారా వారి మాటల్లో తెలుసుకోవాలి... సమయం ఎప్పుడు ముంచుకొస్తుందో మనకి తెలియదు... తరవాత తెలుసుకోవాలన్నా తెలియజేసే వారు ఉండరు... విలువైన, జీవితకాలం పాటు సాధన చేసి వారు తెలుసుకున్న జీవితసత్యాలు అలా ఏ వ్రుధ్ధాశ్రయంలోనో వ్రుధా అవడం ఎంత శోచనీయం... కొన్ని వంశాల చరిత్రలే అలా కనుమరుగవుతున్నాయంటే అతిశయోక్తి కాదు...

చిన్నతనంలో ఎలా సాగిపోయినా, పెరిగేకొద్దీ, కొన్ని ప్రణాళికలు వేసుకోవడం, వాటిని అమలుపరచడం, ఒకవేళ ఏదైనా అడ్డంకులెదురైతే, కొంత పక్కకు తొలిగి, మళ్ళీ ప్రణాళికాచరణ కొనసాగించడం చేస్తుంటాను... జీవితంలో కొన్నిసార్లు అలిసిపోతుంటాను, కొన్ని సార్లు ఒంటరితనం అనుభవిస్తాను... అయినా, తగినంత విశ్రాంతి తీసుకుని, నేను నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుని, మళ్ళీ లేస్తుంటాను... అలానే, కొన్ని సార్లు చేయకూడదనుకున్న పనులు చేస్తుంటాను... అలా సమతుల్యం తప్పి రోడ్డుకు ఏదోపక్క పడిపోయానని తెలిసినపుడు, తిరిగి దారిలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటాను... నా వల్ల కాకపోతే, సహాయం అడగడానికి, అందుకోడానికి సిగ్గుపడను.

సమయం దొరికినప్పుడల్లా, ఏదోటి చదవడమో రాయడమో చేస్తుంటాను... చదవడానికే ఎక్కువ ఇష్టపడతాను - అది దేనిగురించి రాసిన పుస్తకం అయినా సరే, కధలంటే ఎక్కువ ఇష్టం. నిజాల్ని కధలా చెప్పిన పుస్తకాలు బావుంటాయి. చిన్నప్పుడు, నాకు చెత్తబుట్ట పారేసే పని చెప్పాలంటే, ఇంట్లో అందరూ భయపడేవారు - అందులో ఉన్న సరుకుల పొట్లం కాగితాలు, ఇంకా ఏవైనా పేపర్లు ఉంటే అవన్నీ చదువుకుంటూ, తీరిగ్గా, ఎప్పుడో నాలుగ్గంటలతరవాత లోపలికొస్తానని. అందరిలానే, పాటలు ఇష్టం... అందులోనూ, మంచి లయ, సాహిత్యం ఉన్నవంటే మరీ ఇష్టం. నా స్నేహితులు కొందరు చాలా బాగా పాడతారు, అలా వినడం, ఇంకా ఇష్టం. నేనొక్కదాన్నే ఉన్నప్పుడు పాడుకోడం ఇష్టం. ఎందుకంటే, నాకు సరిగా పాడటం రాదు, అందుకు తగిన గొంతూ లేదు.

ఎవరైనా కష్టంలో ఉంటే కరిగిపోతుంటాను... ఏదో తోచిన సాయం చేస్తుంటాను... చిన్నప్పటి నుండీ, ఏడవడం అంటే మాత్రం చాలా చిరాకు... బలహీనులు మాత్రమే ఏడుస్తారు అనుకునేదాన్ని... జనం మధ్యలో ఏడవడం అసలే నిషిధ్ధం... కానీ, ఎదిగేకొద్దీ, మన భావాలను సహేతుకంగా వ్యక్తీకరిచడం బలహీనత కాదనీ, ఏదైనా ఒక అనుభూతిని సంపూర్ణంగా అనుభవించడానికీ, అలా అనుభవించిన భావనను వ్యక్తం చేయడానికీ, చాలా ధైర్యం కావాలనీ తెలుసుకున్నాను. పైగా, ఎవరైనా బాధల్లో ఉంటే వారితోపాటు దుఃఖించడంలోనూ, సంతోషంగా ఉన్నప్పుడు వారితో కలిసి ఎగరడంలోనూ ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదేమో! జీవితాన్ని పూర్తిగా అనుభవించేది ఇలాగే అనిపిస్తుంది. ప్రతి భావనను ఆసాంతం అనుభూతి చెందినప్పుడే దానికి సార్ధకత చేకూరుతుంది.

అందరిలానే నా గుండెకీ అయ్యాయి గాయాలు. కొన్ని నా ప్రమేయం లేకుండా, కొన్ని నా స్వయంక్రుతాపరాధం వల్ల. ఎలా అయినా అవి గాయాలేగా! గాయాలంటే మరి ఉండీ ఉండీ సలుపుతాయిగా! చాలా రోజులు వాటిని మర్చిపోడానికి విఫలప్రయత్నం చేసి, అది జరగదని తెలిసి, వాటితో తలపడడానికే నిశ్చయించుకున్నాను. ఆ విషయాల మీద దొరికిన పుస్తకాలన్నీ చదివాను. చాలా వరకు విముక్తి పొందాను. నిజం తెలుసుకుంటే, సగం సంకెళ్ళు తెగినట్లే. అలానే, నమ్మకస్థులయిన మిత్రులతో మాట్లాడాను. ఎవరితోనైనా చెప్పుకుంటే సగం భారం తీరుతుందనేది అనుభవించిన నిజం. అయితే, ఎవరితో పడితే వారితో కాకుండా, అంతరంగిక మరియు పరిణితి చెందిన మిత్రులతో చెప్పుకోవడం మంచిది. ఇంకా అవసరమైతే, నిష్ణాతుల సలహాలు తీసుకున్నాను... దేవునితో బంధాన్ని పెంచుకున్నాను... నన్ను నేను చాలావరకు తెలుసుకోడంలో, అవసరమైనప్పుడు హద్దులు గీసుకోడంలో క్రుతక్రుత్యురాలినయ్యాను... నిత్యం తెలుసుకుంటూనే ఉంటాను. సహజంగా ప్రక్రుతి అంటే ఉన్న ఇష్టంతో చెట్లవెంట గట్లవెంట అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాను... ఆ అందానికి నన్ను నేను మర్చిపోతుంటాను... వాగులూ వంకలూ ఉరకలేస్తూ చెప్పే ఊసులన్నీ వింటూ ఉంటాను... లేలేత ఎండలో గడ్డిమీద పడుకుని నిద్రపోతుంటాను...

నాకు తగిలిన దెబ్బలకు అతిగా ప్రతిస్పందించి కొందరు స్నేహితుల గాయాలకు కారణమయ్యాను. వారి జీవితంలో నావల్ల కలిగిన కష్టాలను, కలిగించిన నష్టాలను పూడ్చలేక నిస్సహాయంగా మిగిలిపోతుంటాను. చాలా వరకు బంధాలను పునరుధ్ధరించడానికి ప్రయత్నిస్తాను... అది కుదరనంత గాయాలను చూస్తూ కన్నీరు కారుస్తాను... అలా అవిటిహ్రుదయంతో భారంగా ఆ జ్ఞాపకాలకు దూరంగా అడుగులేస్తాను... ఎప్పుడైనా ఆ స్నేహితులు మళ్ళీ వస్తారని చేతులు చాచి ఎదురుచూస్తుంటాను... వారి గాయాలను మాన్పమని దైవాన్ని ప్రార్ధిస్తూ ఉంటాను... వారు తిరిగి వచ్చిన క్షణాన అంబరాన్ని అంటేంత సంబరం చేసుకుంటాను... నన్ను నేను క్షమించుకోడం నేర్చుకున్నాను, ఎందుకంటే మనల్ని మనం క్షమించడమే చాలా కష్టమైన పని. ఎదుటివారిని క్షమించడం, దైవాన్ని క్షమించమని అడగడం, ముందుదానితో పోల్చుకుంటే, తేలికైన పనులు. అందుకే, దేనికీ అతిగా స్పందించకుండా, సమతుల్యం కలిగి ఉండడం చాలా ముఖ్యం.

మనం చేసిన తప్పుల ప్రభావాలు పూర్తిగా తెలిసి పశ్చాత్తాపంతో మనసు నిండిపోవడం ఒక అడుగు; ఆ భగవంతుడి ముందు క్షమించమని అడగడానికి కూడా సిగ్గుతో ముకుళించిన చేతులతో ముడుచుకుపోడం, ఆ దేవుడు ప్రేమస్వరూపుడనీ, నేరములెంచక మన్నిస్తాడని మనసారా నమ్మడం మరో అడుగు; మన చర్యలద్వారా బాధలు పడ్డవారిని సిగ్గుపడకుండా మన్నించమని అడగడం, పరిహారంగా మనం చేయాల్సినవి చేయడం, అవతలివారికి మన్నించే సమయం ఇవ్వడం, ఆ బంధాన్ని సరిచేయడం ఇంకో అడుగు; మనలను మనం మనస్పూర్తిగా క్షమించుకోవడం తరవాతి అడుగు; అలానే, మనను బాధ పెట్టిన వారిని క్షమించడం ఉత్తమమైన అడుగు; వీటన్నిటికన్నా అతి కష్టమైన అడుగు ఏదో తెలుసా? - మనకు తీరని నష్టం కలిగించిన వారిని క్షమించడమే కాక, వారిని ప్రేమించడం, వారి మంచికై ప్రార్ధించడం, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం, వారికి కూడా మన స్నేహం పంచడం... ఇవన్నీ ఎదుటివారికోసమే కాదు, ముందు ముఖ్యంగా మనం ఎదగడం కోసం, మన మనోపరిణితి కోసం, ఎదుటివారు మన హ్రుదయానికి వేసిన సంకెళ్ళను తెంచుకోడం కోసం, దైవత్వ సాధన కోసం... ఏమిటీ? అయోమయంలో పడేశానా? తీరిగ్గా ఆలోచిస్తే మీకే బోధపడుతుంది...

ఎవరినైనా, దేనినైనా, ఆ దేవుడు చాలా జాగ్రత్తగా కొన్నిరోజులు చూసుకోమని మనకి ఇస్తాడని నా నమ్మకం. అలా చూసుకోని రోజున తిరిగి తీసుకుంటాడని కూడా నమ్మకం. కాబట్టి, మనకి ఇచ్చిన వారిని, వాటిని, సున్నితంగా కాపాడుకోడం మన చేతుల్లోనే ఉంది. వారిని, వాటిని కోల్పోయేదాకా అభీష్టానుసారం ప్రవర్తించకుండా మంచిగా మసులుకోడం ఉత్తమమైన లక్షణం.

అపరిచితుల నుండి ఆప్తమిత్రుల వరకు అందరూ నా మొహంలో మొదట చూసేది నవ్వే... నవ్వుతూ ఉండడం నాకా దైవమిచ్చిన వరం... పసిపాపగా ఉన్నప్పుడు కూడా, నిదురపోయేముందు, మధ్యలో, లేచాక, మెలకువగా ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉండేదాన్నట.... తాతమ్మ చెప్పింది... ఇప్పుడూ అంతే... కాకపోతే, పెద్దయ్యాక, ఒక్కోసారి, బాధని కప్పే ముసుగుగా వినియోగించాను... ఇప్పుడది మానుకున్నాను... ఇక నవ్వించడం అంటారా - అది కూడా వరమే... తెలియని వాళ్ళు నాకు నేస్తాలయేది, తెలిసిన వాళ్ళు నా చుట్టుపక్కల ఉండాలనుకునేదీ, బహుశా, ఇందుకేనేమో... ఎదుటివారిని వారి కలతలు కొద్ది నిమిషాలు మరిచిపోయి హాయిగా నవ్వేలా చేయడం నాకు చాలా ఇష్టమైన వ్యాపకం... దాని వల్ల వారు పొందే హాయి కన్నా నేను పొందే ఆనందమే ఎక్కువ...

మాట్లాడడం కూడా అంతే, మనసులో ఉన్న అలజడిని కప్పేందుకు నిరంతరం మాట్లాడుతూ ఉండేదాన్ని... వినడం నేర్చుకున్నాను... అలా వినడం మొదలుపెట్తిన కొత్తల్లో, ఎవరైనా ఏదైనా బాధ చెప్పగానే, దానికి పరిష్కారం చెప్పేయడం నా కనీసధర్మంగా భావించేదాన్ని... చెవులొగ్గి వినడం, సానుభూతితో అర్ధం చేసుకోవడమే వినికిడికి పరమార్ధమని తెలుసుకున్నాను... అడిగినపుడు ఇచ్చే సలహాకీ, అవసరాన్నిబట్టి చేసే సాయానికి చాలా విలువ ఉంటుంది అని గమనించాను.

ఎదుటివారి సమక్షాన్ని ఎంత బాగా ఆనందిస్తానో, అంతే ఎక్కువ నిశ్శబ్దాన్ని కోరుకుంటాను... ఏకాంతం - నాదైవంతో మౌనంగా ఉండడానికీ, ప్రక్రుతిలో పరవశించడానికీ, అర్ధవంతమైన ఆలోచనలకు జన్మనివ్వడానికి, నాకొచ్చే అవకాశంగా భావిస్తాను... ఏమీ చెయ్యకుండా, కేవలం ఉండడంలో అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తాను...

చిన్న పిల్లలతో కాలం గడపడం చాలా ఇష్టం... ఏ వయసువారైనా సరే... పసిపిల్లలంటే మరీ ఇష్టం... వాళ్ళకి ఏవో రాగాలు పాడి నిద్రపుచ్చడం ఇష్టం... ఎంతటి అలజడిలోనైనా ప్రశాంతంగా నిద్రపోయే ఆ దైవప్రతిమలను చూస్తూ మనశ్శాంతిగా ఉండడం ఇష్టం... దేవభాషలో వారితో ఆత్మసంభాషణ ఇష్టం... అంతకంటే అర్ధవంతమైన కాలక్షేపం మరొకటి ఉండదేమో!

పెద్ద వయసు వారితో కబుర్లాడడం ఇష్టం... వారికి ఉన్న జ్ఞానాన్ని గ్రోలుతూ, చతురతను గమనించడం ఇష్టం... వారి జీవితానుభూతులను పంచుకోడం ఇష్టం... వారి ముడతలు పడ్డ దేహాన్ని ఆప్యాయంగా కౌగిలించుకోడం, మరీ ముద్దొస్తే ఓ ముద్దు పెట్టడం ఇష్టం... వీటన్నిటిలోనూ, వారు పొందే ఆనందం కంటే, నేను పొందే సంతోషమే ఎక్కువ...

ఎక్కడైనా అన్యాయం జరుగుతుందనిపిస్తే, అది ఎంత చిన్నదైనా సరే, ప్రశ్నిస్తూ ఉంటాను... నేనేమీ సాధించలేకపోయినా, ప్రశ్నించే తత్వాన్ని మాత్రం వదులుకోను... అలానే, మనుషుల మధ్య "మన" అనే భావనకు అడ్డొచ్చే వర్గీకరణను కూలదోస్తుంటాను - అది కుల, మత, జాతి, భాషా, ప్రాంత, రాజకీయ పార్టీ, సిధ్ధాంతాలు - ఇలా ఏదైనా సరే... నేను చేయగలిగింది చేస్తాను... తరవాత, ఎదుటివారికి చెప్తాను... మనమేం చేస్తాములే అని సమస్యను చూసి, ప్రయత్నాన్ని విరమించను... ప్రతి ఒక్కరూ, వారి హ్రుదయంలో భారమవుతున్న ప్రతి సమస్య సాధనకై వారికున్న పరిధిలో ఎంతోకొంత చేయగలరని విశ్వసిస్తాను... ఇలా, ఏకతాటిపై నిలబడి, ఎవరికి కర్తవ్యం వారు నిర్వర్తిస్తే, పరిష్కరించలేని సమస్యంటూ ఈ భూమిమీద ఉండదని, ఐకమత్యంలోనూ, కర్తవ్యపాలనలోనూ దైవత్వం ఉంటుందని మనస్పూర్తిగా నమ్ముతాను...

కలలు... చాలా చిత్రమైనవీ కలలు... ఎప్పుడూ నన్ను తరుముతున్నట్టు గేదెలు, ఎద్దులు ... నేను భయపడి లేవడం ఎందుకా అని చాన్నాళ్ళు ఆలోచిస్తే, చిన్నప్పుడు ప్రతిరాత్రీ పక్క తడిపేస్తున్నానని ఇంటివాళ్ళ ఎద్దుల పక్కన పడుకోబెడతానని అమ్మ బెదిరించడం... దాంతో నేను భయపడి చీకటిలో ఇల్లు వదిలి అప్పుడే రోడ్డు వేయడానికి వేసిన పదునైన కంకర రాళ్ళమీద లేలేత పాదాలతో పరిగెడుతూ పారిపోవడం, కొంచెం పెద్దయ్యాక స్కూలుకు వెళ్ళే దారిలో గేదెలను అదిలిస్తున్నప్పుడు అందులో ఒకటి విసురుగా వెనక్కి తిరిగి నన్ను పొడవడానికి రావడమే మూలం అని తెలిసింది... ఒక సారి కారణం తెలిసాక ఆ కలలు రావడం చాలా తగ్గిపోయింది... కొన్ని జ్ఞాపకాలు అలా కలల్లో భయపెడుతుంటాయి - నేనవరో కనుక్కో అని అడుగుతున్నట్టు... ఏ భయాన్నైనా ఎంతోకాలం దాచలేము... ఎప్పుడో ఒకసారి విసుగొచ్చి దానికి మూలకారణం కనిపెడదామని నడుంకట్టడమే మంచిది... మన చేతుల్లో ఉన్నంతవరకు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందులోంచి బయటపడడమే మంచింది. అలాగే, నన్ను ఎవరో తరుముతున్నట్టు, లేకపోతే నేనే ఎవరినో తరుముతున్నట్టు ఇలా ఎప్పుడూ ఛేజింగ్ సీనులు.... అవి కూడా అణిచిపెట్టిన భయాలు, జ్ఞాపకాలు, మిగిలిపోయిన ప్రశ్నలు, అంతర్మధనాల ఆనవాళ్ళు... అసలు సమస్యలను వెంబడిస్తే, ఇంచక్కా మర్రిచెట్టు తొర్రలో రాక్షసుడి ప్రాణం బొద్దింకలో దొరుకుతుంది... దాన్నప్పుడు చెప్పు కింద వేసి టప్ మనిపిస్తే సరి...

ఇలాంటి కలలే కాకుండా, ఇంకో రకమైన కలలు కూడా వచ్చేవి, ఇప్పటికీ వస్తాయి - సహజమైన అందమైన ప్రదేశాలు... అసలలాంటి చోటు ఉందని కూడా తెలియకపోయినా నా కళ్ళముందు అలాంటి లోకం సాక్షాత్కరిస్తుంది... ఆ లోకం నుండి బయటికి రావాలనిపించదు... అన్ని రంగుల కలయిక అన్ని జాతుల కలయికకు ప్రతిబింబమా? పచ్చని ఆ తోట అరమరికలు లేని నందనమా? అది స్వర్గమా? ఆ లోకాన్ని సాధించడానికి నా వంతు క్రుషి చేయమని, పదుగురిని చైతన్య పరచమని ఆ దేవుని పిలుపా? - ఏమో మరి... మీక్కూడా వస్తాయా ఇలాంటి కలలు? అవి నిజం చేసుకోవడానికి మీరేం చేస్తుంటారు?

స్వేచ్చ - బయటకు కనిపించే స్వేచ్చాస్వాతంత్రాల కోసం ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు... మరి మన హ్రుదయంలో స్వేచ్చ కోసం ఎవరేమి చేశారు? దానికోసం కూడా తమ సర్వస్వాన్ని ధారపోసిన మహానుభావులు ఉన్నారు... అయినా, మనకేమో తీరిక ఉండదు... పక్కవాళ్ళకి మనగురించి పట్టించుకొనే తీరిక అసలే ఉండదు... ఎంతసేపూ మనం ఇంకా దేనికి బానిసలవుదామా అనే చూస్తుంటాము... నిజమా? కాదా? టీవీ, సినిమాలు, క్రికెట్, మందు, విందు, మగువ, ప్రేమ అనుకునే ఆకర్షణలు, వయసుకు చేసే దాస్యాలు, స్వేచ్చ అని భ్రమించే ఇగోలు, పనులు, శుభ్రం, చదువు, ఎదుటివారి మెప్పుకై పాకులాటలు.. ఇలా చెప్తూ పోతే కొండవీటి చాంతాడవుతుంది... ఏది సమతుల్యత కోల్పోయి శ్రుతి మించినా అది హ్రుదయదాస్యమే... నేను కొన్నిటినైనా అనుభవించినదాన్నే... కొంచెం ఏమార్పుగా ఉంటే ఇప్పటికీ చాలా సులభంగా సమతుల్యం కోల్పోయి ఏదోఒకదానికి దాసోహం అనేస్తుంటాను... అది అనివార్యం... కానీ మనను మనం గమనిస్తూ ఉండడం, ముందు జాగ్రత్త తీసుకోవడం, తెలిసిన తరువాత అయినా మార్పుకు ప్రయత్నించడం ఉత్తముల లక్షణం... దైవానికి మనమిచ్చే స్థానం అన్నిటికంటే ఎక్కువగా ఉండనప్పుడు, ఎవరో ఒకరు, ఏదో ఒకటి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది... దాసోహం అనమంటుంది... మరి మీ జీవితంలో ప్రధమ స్థానం ఎవరిది? దేనిది? పరీక్ష చేసుకోడం చాలా తేలిక... మీకున్నదంతా - డబ్బు, సమయం, ఓపిక, అన్నీ - ఎవరిమీద, దేనిమీద ఖర్చు పెడుతున్నారు అనేది చూస్తే, లెక్క తేలిపోతుంది... స్వేచ్చ లేని జీవితం నాకు మరణంతో సమానం...

ప్రతి కలయికా ఒక విడిపోవడానికి నాంది - అని ఎవరో మహానుభావుడు అక్షర సత్యం చెప్పారు... ఇంతకు ముందు స్నేహాలు చాలా గాఢంగా ఉండేవి... విడిపోవాలంటే ప్రాణం పోయినంత పని అయ్యేది... అయితే, కాలం గడిచేకొద్దీ, అలాంటి స్నేహాలు కొన్ని అంతగా ఆరోగ్యకరమైనవి కాదని తెలుసుకున్నాను... స్నేహం అనేది చాలా గొప్ప భావన... అన్ని బంధాల్లోనూ దానికే ఎక్కువ విలువనిస్తాను... ఏదయితే అద్భుతంగా ఉంటుందో, దానిని మనం వక్రీకరించే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి... ఎవరితో అయినా స్నేహం చేస్తే వారిపై మానసికంగా అతిగా ఆధారపడడం చాలా సమస్యలకు దారితీస్తుంది... అంతెందుకు, ఒక చిన్న ఉదాహరణ - ఎవరినైనా మనం గాఢంగా ప్రేమించామనుకోండి... అంత ఇష్టాన్ని తెలియచేయడానికి, వాళ్ళని మన బిగికౌగిట్లో బంధించి... అలానే ఉంటే ఏమవుతుంది?.... ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంది, ఔనా? అలాంటిదే మానసిక పరిస్థితి కూడా... మనం ఎదుటివాళ్ళ హ్రుదయానికి సంకెళ్ళు వేసినవాళ్ళమవుతాము.. వారి మానసిక స్వేచ్చను హరించిన వారిమవుతాము... మనం వారికి కనిపించని భారంగా తయారవుతాము... ఒక్క విషయం గుర్తుంచుకోవాలి - కనిపించని మానసిక బాధలే కనిపించే శారీరిక బాధలకన్నా ఎక్కువ బాధాకరం, ప్రమాదకరం... కొంత పరిణితి వచ్చాక, ఇప్పుడు కొంత బాధ పడినా, వీడ్కోలు ఇవ్వడం సాధారణమైపోయింది.... పైగా, అమెరికా వచ్చాక, ఎంత మందిని కలిశానో, ఎంత మందికి వీడ్కోలు ఇచ్చానో లెక్క దాటిపోయింది... అలా వారి స్నేహం ఉన్నన్నాళ్ళూ ఆనందం గా ఉండడం, అయ్యో!విడిపోతున్నామే అని బాధపడేకన్నా, వారిని కలిసి, కొంత తెలుసుకుని, స్నేహం పొందే అవకాశం వచ్చినందుకు సంతోషించి, వీడ్కోలు చెప్పడం; అమ్మో! ఇలా విడిపోవాల్సి వస్తుంది కాబట్టి నేను ఇంకెవ్వరితోనూ స్నేహం చెయ్యను అని పాత స్నేహితుల జ్ఞాపకాలతో కాలమంతా గడపకుండా, కొత్తగా కలిసిన వారితో స్నేహం చేయడం అలవాటైపోయింది... ఇలా ఎంతో మందిని, కలిసి, వారి అనుభవాలను, సంస్క్రుతీ సాంప్రదాయాలను పంచుకునే అవకాశం రావడం నిజంగా గొప్ప అద్రుష్టం... ఇంతటి వరాన్ని నాకిచ్చిన దైవానికి క్రుతజ్ఞతలు తెలుపుకుంటాను...

అతి ముఖ్యమైన మనిషి - ఎదురుగా ఉన్న మనిషి
అతి ముఖ్యమైన కాలం - ఈ క్షణం
అతి ముఖ్యమైన పని - దైవత్వమైన ప్రేమను వారికి పంచడం

కొంతమంది - మా కాలంలో అయితే సంగీతం అలా ఉండేది, సాహిత్యం ఇలా ఉండేది, పిల్లలు అలా ఉండేవారు, ఇప్పుడిలా తయారయ్యారు - అని వాపోతుంటారు... అందులో కొంత నిజం ఉన్నా, ఏ తరానికి ఆతరమే భిన్నం అనీ, వారికి ముందు తరం వారు కూడా వారిని చూసి, అలానే అన్నారని మరిచిపోతారు... మంచిని వెతికితే ఏ కాలంలో అయినా కనిపిస్తుంది... మారే పధ్ధతులకు, సమయానికి అనుగుణంగా మనమూ మారాలి... అయితే, కొత్తదనం కోసమే కొత్తదనం కాకుండా, పాత చింతకాయ పచ్చళ్ళు వదిలించుకుని, కొత్త కారం అద్దుకోడం అందరికీ మంచిదే... కొత్తపాతల మేలు కలయిక... మంచి సంప్రదాయాలను కొత్త తరానికి అందిస్తూ, వారు వదలించుకునే బూజును మనం కూడా దులుపుకుంటూ, కాలంతోపాటు ముందడుగు వేయాలి... నిజంగా మనకి ఈ తరం అంటే ప్రేమ ఉంటే, నిరంతరం నేర్చుకుంటూ, వారితో సాగాలి...

అతి ముఖ్యమైన కాలం ఈ క్షణం అని తెలిసినా, ఒక్కోసారి, మనసుకి పగ్గాలేయడం కష్టంగానే ఉంటుంది... "ఆ పాత మధురాలు" తలుచుకోకుండా, ఎవ్వరూ ఉండలేరు... అది ఆహ్లాదాన్నిస్తుంది కూడా... ఒక్కో మాట, ఒక్కో పాట, ఎప్పుడో దాచుకున్న కాగితం, మరెప్పుడో రాసుకున్న ఉత్తరం, డైరీ లో పేజీలు, పుస్తకంలో నెమలీక, ఒక్కో చెట్టు, ఒక్కో ప్రదేశం, ఒక్కో ఊరు... ఇలా కొన్ని అసంకల్పితంగా మన హ్రుదయాన్ని గతించిన కాలంలోకి లాక్కెళ్ళిపోతాయి... ఆ అనుభూతిని కూడా అనుభవించాల్సిందే... ఆ జ్ఞాపకాన్ని ఆప్యాయంగా తడిమి రావాల్సిందే... ముఖ్యమైన విషయం ఏంటంటే, తిరిగి రావడం... అక్కడే పాతుకుపోకుండా ఉండడం... గడిచిన క్షణాలను అదేపనిగా తలుచుకుంటూ ఈ క్షణాన్ని కోల్పోకుండా ఉండడం... మనం ఎప్పుడైతే ఓ జ్ఞాపకం దగ్గర ఆగిపోతామో, జీవించడం అక్కడే ఆపేస్తాము... అదోరకం ఆత్మహత్య... ఇది నాకు స్వీయానుభవమే... అందులోంచి బయటకు లాగి, జీవాన్ని నింపిన నా దైవం మాటలు నేనెప్పటికీ మరిచిపోను - ఇన్ని మంచి లక్షణాలు పోసి, అత్యంత జాగరూకతతో, సంపూర్ణమైన ప్రేమతో నన్ను స్రుష్టించింది, నా ఇష్టమొచ్చినట్లు బతకడానికి కాదట... నా కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారట... - ఆ క్షణంలో నవ్వు వచ్చినా, అందులోని తీవ్రతను గమనించాను... ఇక జీవిస్తే నీ కోసమేనని నా జీవితాన్ని దైవానికి అంకితం చేశాను... అలా నాకు నేను నాలో నేను అంతమయ్యాను... ఆ అంతమే ఆది అని, అజరామరానికి తొలిమెట్టు అని తెలుసుకున్నాను...

నాకు ఇదివరకు స్నేహం చెయ్యాలంటే, కొన్ని షరతులు ఉండేవి... ఇరువురి అభిప్రాయాలు, అభిరుచులు కలవాలనో, పంచుకునేందుకు నిర్దిస్టమైన విషయజ్ఞానం ఉండాలనో... ఇలా ఏవయినా... ఇప్పుడు మరో మెట్టు దిగాను ఎక్కాను... నా అహంలో ఒక మెట్టు దిగితే, మానవత్వంలో ఒక మెట్టు ఎక్కినట్టేగా! ఎవరైనా నాతో అబధ్ధం చెప్తున్నారని అనిపించినా, "ఒకవేళ నిజమే అయితే?" అనే నిర్దోషిత్వానికి వదిలేస్తాను.... ఒక వేళ రూఢిగా తెలిసినా, నా జాగ్రత్తలో నేను ఉంటూ, వారంతట వారే చెప్పేవరకు వేచి ఉంటాను... "నువ్వు చేస్తున్నది తప్పు" అని నిరూపించే అవకాశం కోసం ఎదురు చూడను... ఎవరు ఎక్కువ తప్పులు చేస్తారో, వారే ఎక్కువ క్షమకు పాత్రులవుతారట... ఎవరు ఎక్కువ క్షమించబడతారో, వారే ఇతరులను ఎక్కువ ప్రేమిస్తారట... క్షమిస్తారట... ఇదే నేను నమ్మే దైవత్వ మార్గం... (అలా అని ఎక్కువ తప్పులు చేయమని కాదు... మంచి స్పూర్తితో అర్ధం చేసుకుంటారనే ఆశాభావంతో)...

ఎప్పుడైతే, మనకు సర్వంబొచ్చు అనుకుంటామో, అప్పుడే మన ఎదుగుదల ఆగిపోతుందట... ఏ విషయంలోనైనా, ఎంత నేర్చుకున్నా, ఇంకా నేర్చుకోవలసిన విషయాలు మిగిలే ఉంటాయి... నిలువ ఉన్న నీరులా కాక, పారే నీరులా ఉండడం మనిషికి చాలా అవసరం. అది వ్యసనం గా మారనంత వరకు నేర్చుకోడం అవసరమే. ఎప్పుడైతే ఏదైనా మన గుర్తింపుని శాసిస్తుందో, అప్పుడే అది మనకు వ్యసనంగా మారిందని అర్ధం అవుతుంది... నేర్చుకోడానికి ముఖ్యమైన లక్షణాలు - వినడం, చూడడం, చదవడం, చేయడం, సాధనతో నిష్ణాతులవడం. దాని తరువాత చేయవలసిన మరో ముఖ్యమైన పని, నేర్చుకోడంలో ఆఖరి మెట్టు ఒకటుంది - మన అనుభవాన్ని పదిమందికీ చెప్పడం, ఆసక్తి ఉన్నవారికి సులభంగా అర్ధం అయ్యే రీతిలో నేర్పడం. ఎందులోనయినా ఒకసారి నిష్ణాతులయాక, మరోటి నేర్చుకోవాలంటే బధ్ధకిస్తాము. అలా కాకుండా, కొంత విరామంతో, నిరంతర సాధన సాగుతూనే ఉండాలి - అది కంప్యూటర్ భాష కావొచ్చు, ఈత కావొచ్చు, టెన్నిస్, పర్వతారోహణం, కుట్లు అల్లికలు, లలిత కళలు, ఇలా ఏవైనా కావచ్చు... కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి... నేర్పుతూ ఉండాలి... మనను మనం కొత్తగా నిర్వచిస్తూనే ఉండాలి... ప్రతి అనుభవం మనకి జీవితంలో ప్రస్తుతానికే కాకుండా, భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది....

ఎదుటివారిని ప్రేమించాలంటే, ముందు మనను మనం ప్రేమించుకోవాలట... మన విలువ మనకు తెలియాలట... మన గురించి మనం తెలుసుకోవాలట... అప్పుడే అవతలివారిని అర్ధం చేసుకోడం, వారి విలువ తెలిసి ప్రేమించగలగడం జరుగుతుంది...ప్రక్కవారికి మన సౌఖ్యం కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం సాధ్యపడుతుంది... దైవాన్ని, తోటివారినీ ప్రేమిస్తూ ముందుకు సాగుతుంటే, ఈ జీవితమంతా ప్రేమతో నిండిపోతుంది... అలా ప్రేమతో జీవిస్తూ, జీవితాన్ని ప్రేమిస్తూ ముందుకు సాగిపోతుంటాను...

హమ్మయ్య! మొత్తానికి పూర్తి చేశాను. ఇప్పటిదాకా చదివి ఢామ్మని పడిపోయి ఉంటారు... కొంచెం లేచి, ఆ పక్కనే ఓ గోలీసోడా తాగండి... :-)

ఏకమతం

హుందాగా నడచు
ఐరావతం
హరిహరాదులు దిగివచ్చు
వజ్రాయుధం

చేయిచేయి కలుపు
ప్రగతిపధం
ఒకరికి ఒకరయే
ఆధారం

కలిసి ఉండు
సుఖజీవనసారం
కమ్మగ పాడు
ఐక్యరాగం

చరిత్ర చెప్పిన
సాక్ష్యం
రణాలు నేర్పిన
అనుభవం

ఐదువేళ్ళు ఒకటయే
ముష్టియుధ్ధం
ఒకటొకటిగ విరువలేని
సమిష్టిమంత్రం

అందరిదీ ఒకే
అభిమతం
హ్రుదయతంత్రుల మీటు
ఏకమతం

(ప్రపంచంలోని కల్లోలిత ప్రాంతాలలో ఇంకా ఐకమత్యాన్ని నమ్మే శాంతికర్షకులకు ఈ ఏకమతం అంకితం)

ఓ సాహితీ మిత్రుడితో తెలంగాణ అంశం గురించిన సంభాషణతో ప్రభావితమై రాసిన కవిత. సమస్యలకు మూలకారణాలు కనిపెట్టి, వాటి పని పట్టకుండా, ముక్కలు చెయ్యడమే ముందస్తు పరిష్కారంగా భావించే సోదరులకు నేనిచ్చే సమాధానం ఏకమతం.

నాకు నచ్చిన ఇతరుల కవితలు



గుండె గొంతుక తల్లడిల్లుతోంది

నీ ప్రాణ ప్రవాహమే నా రక్త నదుల్లో
నీ నామ స్మరణే నా గుడె లయల్లో
నే వేసే ప్రతి అడుగులో నీ పాద ముద్రలే

ఒక్కో జ్ఞాపకం గుండెను రంపపు కోత కోస్తోంటే
రక్తం కన్నీటి ధారలై స్రవిస్తోంది
నా గుండె గొంతుక తడారిపోయి
నీ ప్రేమ దాహంతో తల్లడిల్లుతోంది

ఒకప్పుడు నీ కోసమెన్నో నిద్రలేని రాత్రులు
ఇప్పుడూ నీ కోసమే
అప్పుడు ఆనందంలో తేలిపోతూ
ఇప్పుడు బాధతో కుంగిపోతూ

నేస్తం..
నా గుండె గుడిలో వెలిగించిన దీపానివి నీవు
నా ప్రాణమున్నంతవరకూ ఆరిపోవు

ఉండిపోవాలనిపిస్తుంది

ఇన్నాళ్లూ... ఇన్నేళ్లూ...
నాతో ఉన్న నీవు ఇప్పుడు లేవనే ఊహ
ఈ ఊహ కన్నా ఊపిరాగిపోయినా బాగుండు
జన సమ్మర్ధ ఎడారిలో ఒంటరినై సాగుతున్నా
ఎడతెగని ఆలోచనలతో అలసి ఆగిపోతానా
ఒక్కసారి వెనక్కు చూడాలనిపిస్తుంది
దొంతర దొంతరలుగా జ్ణాపకాలు ..
ఒకదానితో ఒకతి పోటీ పదుతూ...
నా తరువాతే నువ్వంటూ..
ఒక దానిలో ఒకటి మిళితమవుతూ...
ఒక దానితో ఒకటి పెనవేసుకుంటూ..
అలాగే ఉండిపోవాలనిపిస్తుంది నీ ఊసులతో
కాని కుదరదే..
మళ్లీ పయనం మొదలెడతా..


తీరం దాటించాలి
తుఫాను... అందరి మనసుల్లో
వాయుగుండం కోస్తాలో ఇళ్లను కూల్చితే
ఇక్కడ పక్కలో బళ్లాళ్లా కూతలు
మనసులను కూల్చుతున్నాయి
బాధితులంతా మనసున్న మనుషులే..

అస్పష్ట కలల ఉలికిపాట్లు
నిద్రిస్తూ అలోచిస్తున్నానా
అలోచిస్తూ నిద్రిస్తున్నానా
తుఫాను వదలడం లేదు..

వాదాలను వీధుల్లో వేయండి
మానవత్వ వాదనను తెండి

నవ్వొస్తే హాయిగా నవ్వండి...
పసిపాపలా... నిష్కల్మషంగా నవ్వండి..
ఏడుపొచ్చేంతవరకూ నవ్వండి

బాధైతే ఏడ్వండి
గుండెలవిసేలా ఏడ్వండి..
ఆడదానిలా ఏడ్పేంటనకుండా
మనసున్న మనిషిలా ఏడ్వండి..

ఫ్రేమించండి...
ఆ మనుషుల కోసం చచ్చేంతగా ఫ్రేమించండి
చనిపోయిన వాళ్లను బతికించుకునేంతగా ఫ్రేమించండి


ఇలా ఎన్నో విషయాలపై...
గొంతుచించుకు అరవాలని ఉంది
కానీ.. ఎన్నాళ్లో నేను చెప్పాలనుకున్నవన్నీ
దిగమింగి ఉంటాను...
మాట బయటికి రావట్లేదు

తెలవారుతోంది...
అమ్మో! తీరం దాటించాలి
లేకపోతె మనసులుండవు
మనసున్న మనుషులుండరు..

- కవిత. తనెవరో నాకు తెలియదు. తెలుసేమో!... అది కూడా తెలియదు.. http://www.orkut.com/Scrapbook.aspx?uid=13780672383063170903

ఆమె

ఆమె
అక్షరాల ముక్కులను సూటిగా చెక్కి
గుండెల్లో గుచ్చగల దిట్ట
కలల అలలకు వలలు వేసి
ఒడుపుగా పట్టగల ధీర

ఆమె
మాటల క్షిపణులను
మంచుముద్దలతొ కప్పగల నేర్పరి
సరిగమల గరిమలను
పాదముద్రల కింద పట్టుకున్న నర్తకి

ఆమె
కష్టాల కడలిని
కర్పూర హారతి చేయగల సాహసి
కరకు మనసులకు
కన్నీటి చెమ్మను చూపగల సాత్త్వికి

కర్త, కర్మ, క్రియ అన్నీ తానే
భర్త, భార్య, ప్రియసఖియ తనకు తానే
అంతుచిక్కని ఆమె స్థైర్యం చూసినా
విధికి ఎదురీదే ఆమె నైజం తెలిసినా
నిజంగా ఆమె ఒక యుద్ధ నౌక!
(నాకు తెలిసిన ఒక యోధురాలి కోసం...)
- kesav, http://www.kesland.blogspot.com/

కవి పరిచయం - కేశవ్ గారు, నాకు సాహితీమిత్రుడు, ఈనాడు ఛీఫ్ రిపోర్టర్, పరిశోధకుడు, MPhil బంగారు పతక గ్రహీత. ప్రసారభాష అనే తన తొలి పుస్తకాన్ని ఒకే సంవత్సరంలో రెండవసారి అచ్చు వేస్తున్న వచన కవి, సాహితీ ప్రియుడు. "సాహితి"లో తన మొదటి కవిత మార్చిమాసం ఉత్తమ కవితగా ఎంపిక. ప్రపంచాన్నంతా తన అక్షరాలతో కమ్మేయగల అంతర్యామి.


కాలిపోయిన కోటేశు..

ప్రియా..
నువ్వు లైలావో కావో - నేను మజ్ఞూనే!
అనార్కలివో కావో - నేను సలీంనే!
పార్వతి ఔనో కాదో -
నేను దాసుడను.. నీ దేవదాసును!

సఖి..
నీ కోసం కాలిపోయిన కోటేశుని నేను
బండల్ని పిండిన నా జబ్బలకేసి
ఓరగా, దోరదోరగా చూసావు!
బండెడు గడ్డిమోపును వాటంగా ఎత్తికుదేస్తే
ఎక్కిరింతగా నవ్వావు!
దొడ్లో ఆదమరచి నేను నిదురపోతే
అమాంతం నామీద పడ్డావు -
ప్రేమన్నావు.. ప్రేమకై ప్రాణమిస్తానన్నావు!

తీరా చూస్తే -
మీ ఇంటి గుమ్మం ముందు దిష్టిబొమ్మను చేసావు
దొంగను చేసావు.. దోషిగా నిలబెట్టావు!
అయినా.. నువ్వంటే నాకిష్టం!!

ఏమిటో ఈ వింత..
నీ కులపోళ్ళంతా తాళ్ళతో బంధిస్తే -
నీ చేతుల్తో గట్టిగా వాటేసుకున్నట్టుంది..
ఒళ్ళంతా కిరోసిన్ పోసి తడిపేస్తుంటే -
ముద్దుల్తో తడిపి తలారా స్నానం చేయించినట్టే ఉంది..
అంటరాని మంటలు దేహమంతా అలుముకుంటుంటే -
తొలినాటి శృంగార విరహ తాపాలు గుర్తుకొచ్చాయి..
అగ్గై బొగ్గై కూలుతున్నప్పుడు కూడా -
అలసిసొలసి నీ యెదపై కునుకుతీసిన ఆలాపనే..

ఓ నా చెలి -
నీ కౌగిట్లో ఒదిగి
నాకు మరోమారు చావాలని ఉంది..

(విజయవాడలో జరిగిన సంఘటన ఆధారంగా..)

కవి పరిచయం - అంజన. తన కవితలే తనని పరిచయం చేస్తాయి. చిన్న వయసులో చాలా పరిణితి ఉన్న ఓ విలక్షణమైన అమ్మాడి.
http://anjanavelaga.blogspot.com

Sunday, April 6, 2008

నా విశ్వం

పాలబుగ్గల పాపాయినందరు ముద్దాడినపుడు
పసిడి నవ్వుల విందారగించినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

బడిలో మాస్టారు ఎత్తుకున్నపుడు
భుజాలపై "దేవుడమ్మ" ఊరేగించినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

నాతోటి వారు జట్టు కట్టినపుడు
నను నేస్తంగా ఉండమన్నపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

కళాశాలలో చేరినపుడు
స్నేహితులు లోపాలను కప్పినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

మొదటగా కొలువు తీరినపుడు
మరల బుడినడకలు నేర్చినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

దూరతీరాలకేగినపుడు
వర్ణమిశ్రమం తెలిసినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

జాతి మత భేదం ఒట్టిదన్నపుడు
ఇలను హరివిల్లు విరిసినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

మనుజులంతా ఒకటని ఎరిగినపుడు
నా ఎదలో విశ్వం ఒదిగినపుడు
విశ్వమంతా నాదే అందరూ నావారే

(నా మనోనేత్రాలను తెరిపించి విశాల ద్రుక్పధం అలవరచిన ఎందరో మహానుభావులకు ఈ విశ్వం అంకితం)

నా చిన్నప్పటినుండి ఇప్పటివరకు విశ్వం అంతా నాదే అందరూ నావారే అనే భావన ఎలా నాలో పెంపొందిందో ఈ కవితలో చెప్పాను...

తాతమ్మ చేతులమీద పెరిగాను అనేకంటే ఆవిడ మీదే పెరిగాను అనడం నిజం చెప్పినట్టుంటుంది. నేనేంచేసినా మురిసిన తాతమ్మ, "గొడ్డు గోదా, పొలము పుట్రా, పిల్లా మేకా అందరినీ చల్లగా చూడమని" అసురసంధ్య వేళ దీపం వెలిగిస్తూ, నిర్వికారమయిన ఆ జ్యోతిర్మయిని తన సహజభాషలో ప్రార్ధించి, అందరికోసం జీవించి, తనకోసం ఏ వరాలడగని నిస్వార్ధజీవి, ప్రేమమయి తాతమ్మ; పదవ తరగతికొచ్చినా, పళ్ళెంతో నా చుట్టూ తిరిగి, తన ఒడిలో నాకు జోకొట్టి, ఇంటిపనులను ఒంటిచేత్తో చక్కబెట్టే సవ్యసాచి, బయటపనులను సమర్ధంగా నిర్వహించే కార్యదక్షురాలు, పెద్దవారికి పెద్దదిక్కైన సేవాతత్పరి, అందరికీ సిమ్హస్వప్నం, నన్ను మాత్రమే జూలుతో ఆడుకోనిచ్చిన ప్రత్యేకస్థానం, లలితకళలంటే ప్రాణం, తను చేయలేనివి నాకు నేర్పేందుకు పడ్డ కష్టం, ఆటలలో మేటి, పాల్గొన్న ప్రతిపోటీలో విజేత, ముక్కంత సూటిగా తొలిపరిచయంలో చదివేసే సునిశిత ద్రుష్టి, అదే తరహా మాట, వరాల మూట అమ్మ; అన్నయ్యకంటే అతిగా ప్రేమించిన పక్షపాతి, చెత్తకుప్పలో స్టెతస్కోప్ చూసి పట్టుదలతో వైద్యవ్రుత్తినలంకరించిన విక్రమార్కుడు, తనతో కూడా ఏకీభవించనవసరంలేని ఆత్మవిశ్వాసాన్ని నాలో కలిగించిన నేర్పరి, లలిత సాహిత్యం నుండి చలిత సాహిత్యం వరకూ నాకు పరిచయం చేసిన వాగ్గేయకారుడు, ఆయుర్వేదవైద్యంపై సంస్క్రుతంలో అనర్గళంగా ఉపన్యాసమిచ్చిన భాషాదురంధరుడు, సున్నితహ్రుదయుడు, అమ్మ అంతఃసౌందర్యాన్ని ఆరాధించిన ప్రేమికుడు, అప్పటికే అణగారిన సాహితీస్పూర్తిని నాకోసం నిద్దురలేపి, స్నేహంపై కవిత రాసి, తన అమ్మణ్ణికి అంకితమిచ్చిన నాన్న; నా చిన్నప్పటి సాహసాలు, జ్ఞాపకాలన్నీ తన చుట్టూ అల్లుకున్న అన్న; సంస్కారాన్ని, సమాజసేవను తమ ఆచరణలో చూపిన తాతయ్యలు; తన భాష, బుధ్ధిబలం, పలుకుబడితో సామాన్యులకు చేయూతనిచ్చి, తనయెదుట ప్రజల డబ్బు రాశులుపోసిఉన్నా, ఒక్క పైసా ముట్టని నిర్వికారి, ఖద్దరు పంచెకట్టుకు వన్నెతెచ్చిన పొడుగరి, ప్రతిరోజూ దీనజనులకై అధికారులకు యాభై అరవై ఉత్తరాలు రాసి, తపాలా బిళ్ళలు అంటిచి పోస్టు చేసే ఉడతాసాయాన్ని మా(మనుమల)నుండి స్వీకరించిన మాటకారి, సంస్కారాన్ని నాకు నేర్పిన సాంప్రదాయవాది, నిరాడంబర వివాహాలకు శ్రీకారం చుట్టిన ఆదర్శవాది, అందరి మనసులు గెలుచుకున్న మహనీయుడు - తాతయ్య (అమ్మ వాళ్ళ నాన్న); సామ్యవాదసిధ్ధాంతాలను వంటబట్టించుకుని, ఆస్థులన్నీ త్యజించి, అంతస్థులను కాలదన్ని, అతి సామాన్యంగా బ్రతికిన నిగర్వి, శ్రమజీవన సౌందర్యాన్ని అతిసమీపంలో ఆవిష్కరించిన కార్మికశక్తి మరో తాతయ్య (నాన్న వాళ్ళ నాన్న); వయసుతో నిమిత్తంలేని అమాయకత్వం అమ్మమ్మ; తనకున్నంతలో అత్యంత రుచికరంగా వండి, ముఖ్యంగా "గొబ్బిరి"పచ్చడి, పక్కవారందరికీ పెట్టి మహదానందభరితమైన నానమ్మ (నాన్న వాళ్ళ అమ్మ); నను గారాబం చేసిన పెదనాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు, చిన్నమ్మలు, మామయ్యలు, అత్తయ్యలు, అన్నయ్యలు; నాకూ ముద్దుచేసే అవకాశం ఇచ్చిన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు... ఇలా నా బాల్యం చాలావరకు మధురానుభూతులు నిపడంలో మా కుటుంబంలోని అందరూ బాధ్యులే...

పుట్టింది, పెరిగింది తెనాలిలోనే అయినా, మా అమ్మ ఉద్యోగరీత్యా, నా మొదటి దశ బాల్యం మమతల పల్లె రేపల్లెలో, ఆప్యాయతల ఊరు వేమూరులో గడిచింది. రేపల్లె పోలియో వెంకట్రావ్ అంకుల్, నాకు గట్టి అరిశెలు వండి పెట్టిన వాళ్ళ అమ్మ, రాజ్యం అమ్మమ్మ, రైల్వేపోలీసు ప్రభాకర్రావ్ అంకుల్; వేమూరు శకుంతలమ్మామ్మ, వాళ్ళ విశాలమైన పెరడు, తులసి కోట, ఎర్ర జాంకాయల చెట్టు; తెనాలి కోటయ్య అంకుల్, బేగం ఆంటీ, వాళ్ళ ఇంటినుండి కనిపించిన రైలుపట్టాలు, లెక్కపెట్టిన గూడ్సు పెట్టెలు ఇప్పటికీ గుర్తే. ఇప్పటికీ, మనసువిప్పి మాట్లాడే చనువు ఉన్న శైలజాంటీ పక్కింటివారు బంధువులకంటే ఎక్కువ ఎలా అవుతారనడానికి ఉదాహరణ. ఎక్కడ ఉన్నా, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడూ నాకోసం పోటీ పడుతూ ఉండేవారని తాతమ్మ అంటుండేది... విన్నప్పుడల్లా నాకు మహదానందంగా ఉండేది... అందుకే కాబోలు అన్నారు - ఒక బిడ్డను పెంచాలంటే ఒక ఇల్లు సరిపోదు, ఒక ఊరు కావాలి - అని.

నా మొదటి బడి తెనాలిలో మా వీధిబడి. ఇద్దరు అన్నాతమ్ములు ఆ బడి నడిపేవారు. వారి అసలు పేర్ల కంటే కొసరు పేర్లే అందరికీ తెలుసు - పెద్దమాష్టారు, చిన్నమాష్టారు. పెద్దమాస్టారు కొంచెం కోపంగా ఉండేవారు. చిన్నమాస్టారు నన్నెప్పుడూ ఎత్తుకునే ఉండేవారు. అక్కడ నా మొదటి మూడు తరగతులు ఒక్కోటి ఆర్నెల్లలో పూర్తి చేశాను. మా అమ్మకు బెంగ పట్టుకుంది - ఇలా ఒక్కోతరగతి ఆర్నెల్లలో పూర్తి చేస్తే ఎలా అని. లాభం లేదు, ఈ చిన్నదాన్నిపెద్ద స్కూలులో వెయ్యాల్సిందే అని నిర్ణయించేసింది.

అలా చేరాను వివేకానంద విద్యామందిర్ లో - వయసు సరిపోదు ససేమిరా అంటే, మొట్టమొదటి ప్రవేశ పరీక్ష రాసి. అప్పటివరకూ బుధ్ధుడిలా, నోటమాటరాకుండా ఉన్న నాకు, అల్లరి మొదలైంది అక్కడే. స్నేహం అంటే తెలిసింది అక్కడే. నీరజ, రాధిక, నఫ్హత్, రాజ్యలక్ష్మి... ఇలా ఎందరో స్నేహకుసుమాలు.... కొందరి కుటుంబాల్లో నేనిప్పటికీ సభ్యురాలినే... నడత నేర్పిన గురువులు - కస్తూరి, విజయలక్ష్మి, నిర్మల, రాజేశ్వరి, రాధాక్రిష్ణ, రామక్రిష్ణ, ప్రసాద్, గోపాలాచారి, సంస్క్రుతం మాస్టారు, డ్రిల్లు మాస్టారు, భట్టాచార్య... ఎందరో మహానుభావులు... నేను బధ్ధకించినపుడు వీపు విమానం మోత మోగించినా, ఏ కొంచెం బాగా చేసినా నెత్తిమీద పెట్టుకున్న భరతనాట్య గురువు చదలవాడ నారాయణరావు గారు... నాకు నృత్యం పై ఆసక్తి కలిగేసరికి మరణించినా, నా జ్ఞాపకాల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారు...

అలా పదవ తరగతి వరకు ఆడుతూ పాడుతూ చదివేశాక, మొదటిసారి వేరే ఊరులో ఉంటూ పాలిటెక్నిక్ కాలేజి లో చదువు (ఆటలు) కొనసాగించాను. నా క్లాసు, నా కాలేజి, నా లెక్చరర్లు అందరూ నేస్తాలే... అయితే, ఓ జీవిత కాలానికి సరిపడా స్నేహం అందించింది నా సీనియర్, నా ఆంతరంగిక నేస్తం కిరణ్. అయిదారుగురం ఒక జట్టుగా ఉండేవాళ్ళం - కిరణ్, జ్యోతి, ప్రేం, శాంతి, శ్యామల.. ఇంకా నాకు ప్రియమైన లెక్చరర్లు - చంద్రకళ, హరిత, భాస్కర్ రెడ్డి. నాకు నా క్లాసులో నేస్తాలకంటే సీనియర్లలోనే ఎక్కువమంది ఉండేవారు. ఇక హాస్టల్ సంగతి చెప్పాలంటే ఈ పేజీలేవీ సరిపోవు... అదో చిన్న ప్రపంచం... బాహ్య ప్రపంచానికి చిన్న నకలు... ఇంటి నుండి బయటపడి తొలిసారి స్వతంత్రాన్ని చవిచూసింది ఇక్కడే... బయట ఎలా బ్రతకాలో నేర్చుకుంది ఇక్కడే... ఆ క్రమంలో తప్పటడుగులు వేసింది ఇక్కడే, పరీక్షలలో వైఫల్యం అంచులదాకా వెళ్ళింది ఇక్కడే... వీటన్నిటిని ఆస్వాదించేట్టు చేసి, నా తప్పులు కప్పి... నా నేస్తాలు వారి గుండెల్లో నన్ను దాచుకుంది ఇక్కడే...

కళాశాలలోంచి బయటికి వచ్చాక, చలో భాగ్యనగరం అంటూ హైదరాబాద్ చేరాను... నాకు చాలా నచ్చేసిందీ నగరం... కొన్నాళ్ళూ సాఫ్ట్-వేర్ ఉద్యోగాలకోసం వెతికిన తరవాత గుడ్డు-కోడి సమస్యతో విసుగొచ్చి మార్కెటింగ్ లో చేరాను... మార్కెటింగ్ అంటే అందరితో మాట్లాడాలి, అదేమీ సమస్య కాదు.. కానీ ఇంగ్లీషులో మాట్లాడాలి... మరి నేను పదవతరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను... కాలేజిలో ఇంగ్లీష్ మీడియం అయినా అది సబ్జెక్టుల వరకే... అలా ఆ ఉద్యోగం చేస్తూ అందరితో ఆంగ్లంలో మాట్లాడటం అలవాటు చేసుకున్నాను... నా అద్రుష్టం కొద్దీ నా మొదటి మేనేజర్ IIM అహ్మదాబాదులో మార్కెటింగ్లో MBA చేసి, అప్పటికే పది పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్న మంచి మనిషి - రఘు. ఆయన నుండి మార్కెటింగ్ లో ఓనమాలు నేర్చుకున్నది ఇక్కడే... మొదటి సంపాదన అందుకుని ప్రపంచాన్నే జయించింది ఇక్కడే... మా అమ్మ నుండి బహుమతిగా TVS Champ నా సొంతమైంది ఇక్కడే... నగరం నలుమూలలా ఝామ్మంటూ నా చిన్న బండిపైన ముగ్గురం తిరిగింది ఇక్కడే... ఎన్నో ప్రమాదాలతో సయ్యాటలాడింది ఇక్కడే... ఆ వరుసలో మంచితనానికి మారుపేరైన వాసన్ లాంటి మనుషులు తారసపడిందీ ఇక్కడే...

నేను అమెరికా రావడం కొంత నా ఇష్టానికి వ్యతిరేకమే... ఆ కధలన్నీ తరవాత ఎప్పుడైనా చెప్పుకుందాం... ఎలా అయితేనేం, ఇక్కడికి రావడం జరిగింది... కొత్త ఊరు, కొత్త ప్రాంతం, కొత్త మనుషులు, కొత్త దేశం, కొత్త యాస... కొత్త సంస్క్రుతి... అన్నీ కొత్తవే... అదేంటో! చిత్రంగా, ఒంటరితనం తప్ప నాకు ఇక్కడేవీ కొత్తగా అనిపించలేదు... కిటికీ లోంచి బొద్దుగా ఉన్న ఉడుతలను చూస్తూ గంటలు గంటలు గడిపింది ఇక్కడే... వాటి నేస్తంగా మారి, రోజు ఆపిల్స్ ను కలిసి ఆరగించిందీ అక్కడే... ఇక్కడ చాలా మొట్టమొదటి సార్లు జరిగాయి - మొట్టమొదటిసారి మంచు దూదిలా రాలడం చూసింది ఇక్కడే... అలవాటు లేని ఒంటరితనం అనుభవంలోకి వచ్చింది ఇక్కడే... నా నేస్తాలెవరూ లేని ఏకాంతం అనుభవించిందీ ఇక్కడే... శూన్యం... గది శూన్యం... మది శూన్యం... మొట్టమొదటిసారి నాలో నేను అంతమైంది ఇక్కడే... ఆ శూన్యంలోంచి నా మదిలో దైవాన్ని నేమనసారా విన్నదీ ఇక్కడే... ఆ బీజాక్షరాలు నా తిమిరాన్ని తరిమే తొలికిరణాలై క్రమంగా నను మొత్తం చైతన్యంతో నింపిందీ ఇక్కడే... నాలో భయాన్ని ధైర్యంతో ఎదుర్కొన్నది ఇక్కడే... ఇక్కడి యాసను అర్ధం చేసుకుంటూ, ఉద్యోగప్రయత్నాలు మొదలెట్టాక, నాక్కుడా తెలియని ఓబంధువు నన్నాదుకుందీ ఇక్కడే... తన స్నేహితురాళ్ళు వారి ఇరుకు ఇంటినీ, విశాల హ్రుదయాన్నీ నాకు పంచింది ఇక్కడే... ఈ పిల్లలంతా కలిసి నా సహజగుణానికి (అల్లరి) తిరిగి లాక్కొంచిందీ ఇక్కడే... దైవంతో సావాసం మొదలైందీ ఇక్కడే...

ఎన్నో ఎదురుచూపులు, మరెన్నో మంచు తుఫానులు, ఎన్నెన్నో చిరు ప్రార్ధనల తరువాత, మొన్నటిరోజున, ఏడు సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరాను... చేరిన తొలినాడే, నేనెవరో తెలియనవసరం లేకుండానే, నాకు తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చి, తన నీడలా తిగరనిచ్చి, దుర్గుణాలను ప్రేమతో భరించి, సోదరిలా భావించి, నా భుజం తట్టి, ధైర్యం చెప్పి, చిరునవ్వుతో చిన్నపనులను సైతం నేర్పిన ఉమ; తన స్నేహితులందరికీ నను పరిచయం చేసి, తమలో నను కలుపుకున్న లోకబాంధవి బీనా; నాన్నా అని పిలిచి, ఆప్యాయతను పంచి, అమ్మలా ఆకలెరిగి అక్కున చేర్చుకున్న నా అన్నపూర్ణ, ఎంతటి మాలిన్యాన్నయినా ప్రేమతో కడిగేసిన సాత్వికి - రాజశ్రీ; నిదురను త్యాగం చేసి, తన కారులో నాకు నడపడం నేర్పి, నాకో కారు కొనిపెట్టి, స్వాతంత్ర్యాన్నిచ్చి, తనే వండిపెట్టి, చీవాట్లు పెట్టి, రాజశ్రీ తాత్కాలికంగా లేని లోటు తీర్చి, తన కుటుంబంలో నేనొక భాగంగా భావిచే సాగర్ (రాజశ్రీ భర్త) ; తను పుట్టకమునుపే నా నేస్తమై, మూడు సంవత్సరాల ప్రగాఢస్నేహం తరవాత నను వదిలి పోయిన నా కుచ్చి; సహోద్యోగినిగా పరిచయమై, తన కుటుంబంలో ఒకటిగా కలిపేసుకున్న శారా, అంతే ఆప్యాయంగా నను ఆదరించే తన కుటుంబం - విజయ్, రేచి, షారన్... ఇలా చెప్తూపోతే మా ఊరి భారతీయులంతా ఈ పేజీలమీదే ఉంటారు...

అయితే, నేను ఇష్టపడిన భారతీయులందరిదీ ఒక ఎత్తు అయితే, నా జాత్యహంకారాన్నీ, దురభిమానాన్నీ, అపోహలను, అకారణ ద్వేషాన్నీ పోగొట్టిన ప్రపంచమిత్రులు మరో ఎత్తు -
నల్లవాళ్ళంటే ఉన్న ఒక విధమైన భయాన్ని, అనుమానాన్ని సమూలంగా తుడిచేసి, నాకు పిత్రుసమానుడైన రాడ్నీ; నాతో గంటలకొద్దీ సమయం గడిపి, వారి హ్రుదిలోకి నను ఆహ్వానించిన మాత్రుసమానురాలు, రాడ్నీ భార్య, శ్వేతజాతీయురాలు, మెలీసా; పాకిస్తానీయులంటే నాకున్న అకారణద్వేషాన్ని చివరంటా తుడిచేసి, నా సంకుచితత్వానికి సిగ్గుపడేలా చేసిన మిత్రుడు, సయ్యద్ జఫర్ అబ్బాస్ నక్వి; దక్షిణ అమెరికన్లంటే ఉన్న చులకన భావాన్ని పోగొట్టి, తను తండ్రి కాబోతూ, నేను అత్తనౌతున్నానని చెప్పిన మిత్రుడు, సోదర సమానుడు, మార్టిన్ (బొలీవియా); రష్యన్లంటే కరడుగట్టిన కమ్యూనిష్టులు అనే మొరటుభావాన్ని సున్నితం చేసిన మిత్రుడు ఈగోర్; సంకుచిత స్వభావులు చైనీయులు అనే అపోహను నాశనం చేసిన మిత్రుడు ఝాపాంగ్; మనదేశంతో ఉద్యోగాలలో పోటీకి వచ్చారన్న నెపంతో దూరంగా ఉంచిన నా అంటరానితనాన్ని స్వచ్చతనే అగ్గితో కడిగిన ఫిలిప్పినో మిత్రుడు కాన్స్టంటినో పుస్తా; నేపాలీయులంటే గూర్ఖాలే అన్న నా పరిమిత జ్ఞానాన్ని క్షమించి, తమ స్నేహాన్ని పంచి, పార్టీలంటే ఎలా చేసుకోవాలో నేర్పిన మిత్రులు - సంజీత, బిక్రం, దిగో; మాదకద్రవ్యాలకు అలవాటుపడినవారంతా ప్రమాదకరమైన వారు, ఒకసారి వెళ్ళాక మరి బయట పడలేరు అనే మరో అపోహను కూకటివేళ్ళతో కూల్చేసిన నా అంతరంగిక నేస్తం, శ్వేతజాతీయురాలు, రేచల్; క్రైస్తవులంటే బలహీనులు అనే చులకన భావానికి, మతమార్పిడికే మనతో మాట్లాడతారనే అపనమ్మకానికి శిలువ వేసి, చర్చలకు, అనేక ప్రశ్నలకు సాదరంగా స్వాగతం పలికి, నా ఆధ్యాత్మిక ప్రగతికి కారణమైన చర్చ్ పాస్టర్ మార్టీ; కెనెడా దేశస్థులను మన సర్దార్జీలతో అసంబధ్ధ పోలికను గేలిచేసి, తమ స్వహస్తాలతో కట్టుకున్న బొమ్మరింటిలో నాకూ చోటు కల్పించిన గ్వెన్, ఫిల్, వారి పిల్లలు - జర్డిన్, సెథ్, కేలబ్; శ్వేతజాతి మగవారిలో, అదీ ఆఫీసుల్లో, ముఖ్యంగా ఇతరజాతుల ఆడవారితో జాత్యహంకారం జాస్తి అనే, అన్నివేళల్లో రుజువు చేయలేని మరో లోకవిదితాన్ని నాస్తిగా నిరూపిస్తూ, ఎన్ని ఉద్వాసనలు ఎదురైనా నన్ను కాపాడుతూ, నా ప్రగతికి బాటలు వేసిన నా మానేజర్లు, ఆలెన్, షిమక్; చివరకు మొన్నటి ఉద్వాసనల్లో తనకే వేటు పడి కళ్ళనీళ్ళపర్యంతమైన షిమక్; పాశ్చాత్యులంటే, బాగా ధనవంతులు, కుటుంబ విలువలు తెలియనివారు, భౌతిక సుఖాలకే ఎక్కువ విలువనిస్తారు అనే అతిపెద్ద అపోహను పోగొట్టిన ఎన్నో కుటుంబాలు ... ఇలా ఎందరో ఎందరెందరో... నా మనసును కప్పిన అజ్ఞానపు పొరలను ఒక్కొక్కటిగా వారి స్నేహంతో, ప్రేమతో తొలిగించిన ఎందరో మహానుభావులు... అందరికీ శిరసు వంచి చేస్తున్నా వందనాలు...

సంస్క్రుతీసాంప్రదాయాలను, సైధ్ధాంతిక విభేదాలను, కరుకు బాహ్యస్వరూపస్వభావాలను, ముందస్తు అభిప్రాయాలను దాటుకుని ముందుకు వెళ్ళగలిగితే, అందరూ మనుషులేనని, ప్రతివారిలోనూ స్నేహానికి స్పందించే హ్రుదయం ఉందని అవగతమవాలి... మనం ఎక్కడ ఉన్నా, మన ఇంటికి, ఊరికి, ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి, మానవత్వానికి, మంచికి, దైవానికి ప్రాతినిధ్యం వహిస్తామని గుర్తుంచుకోవాలి... మనం ఈరోజు చేసే చిన్న పనులే రేపు మరొకరి వ్యక్తిత్వంపై, ముఖ్యంగా భావితరానిపై చెరిగిపోని ముద్రలు వేస్తాయని ఎరిగి ప్రవర్తించాలి... మనం చూపే ప్రేమ, సహనం, స్నేహం కొద్ది సంవత్సరాల తరువాత అయినా ఓవ్యక్తి పరిపక్వతకు తోడ్పాటు అందిస్తాయని తెలుసుకొని మసలుకోవాలి... ప్రాంతం ఏదయినా అక్కడివారితో ప్రేమతో, బాధ్యతలెరిగి నడుచుకోవాలి... ప్రతి సంస్క్రుతిలోనూ మంచిని గ్రహించి, చెడుని త్రుణీకరించి భిన్నసంస్క్రుతుల మేలు కలయికలా ముందుకు సాగిపోవాలి... ఈ విశ్వం అంతా నాదే, దీనిలో అందరూ నావారే అనే పూర్ణత్వం మనకు రావాలి... అదిరాని రోజున ప్రపంచీకరణ సంపూర్ణ ఫలితాలు మనకు అందలేదని బోధపడుతుంది...

Friday, April 4, 2008

ధ్రువప్రశ్న

గ్రాంధికం అమ్మ
విప్లవం నాన్న
వివేకం అమ్మ
వినోదం నాన్న
పొదుపు అమ్మ
దాత్రుత్వం నాన్న
బాధ్యత అమ్మ
బరువు నాన్న

సాంప్రదాయం అమ్మ
సామ్యవాదం నాన్న
రక్షణ అమ్మ
సాహసం నాన్న
గారాబం అమ్మ
క్రమశిక్షణ నాన్న
రంగుల హరివిల్లు అమ్మ
హుందాగా నాన్న

ఆదికవి అమ్మ
యోగివేమన నాన్న
ఆత్మాభిమానం అమ్మ
ఆత్మవిశ్వాసం నాన్న
ముక్కుసూటిగా అమ్మ
అక్కున చేర్చే నాన్న

ప్రేమకు రూపం అమ్మ
ప్రపంచ జ్ఞానం నాన్న
నేనున్నా అనే అమ్మ
నిటారుగా నిలబడమనే నాన్న
రామాయణం అమ్మ
బైబిలు కథలు నాన్న

ఈ ధ్రువాలను బ్రహ్మ
ఎలా కలిపాడన్నదే ప్రశ్న

--------------------------------------------
(ఉత్తర దక్షిణ ధ్రువాల్లా ఉంటూనే అన్నిటినుండి మంచిని గ్రహించడం నేర్పిన అమ్మా నాన్నలకు ఈ ప్రశ్నఅంకితం)

ఇందులో మా అమ్మానాన్నలకు సంబంధించి, ఒక్కోపదానికి ఒక్కో జ్ఞాపకం ఉంది.. ఆ కధలన్ని ఇక్కడ చెప్తే కనీసం 28 చెప్పాల్సి ఉంటుంది... నా కధలు చెప్పి మీ ఊహకు కళ్ళెం వేయడమెందుకని వదిలేస్తున్నా...ఈ కవితలో ప్రతిపదానికి మీరు కూడా ఒక కధ జ్ఞాపకం తెచ్చుకోండి...

అమ్మానాన్నలే మన తొలి గురువులు... వారి ప్రభావం మనమీద మరియే యితర ప్రభావాలకన్నా ఎక్కువగా ఉంటుంది... కాలం గడిచేకొద్దీ తోబుట్టువులు, గురువులు, పాఠాలు, స్నేహితులు, బంధువులు, కధలు, కవితలు, కవులు, సినిమాలు, తారలు, రాజకీయాలు, నాయకులు, జీవితంలో ఎదురయే సంఘటనలు... ఇలా ఇతర ప్రభావాలు మనమీద ఎక్కువ అవుతాయి... ఆ తరవాత అమ్మానాన్నలు ఎల్లప్పుడూ సరియైన మాటలే మాట్లాడరని, సరి అయిన పనులే చేయరని.. వారు కూడా ఈ జీవితాన్ని నేర్చుకుంటున్న మామూలు మానవులని అర్థం అవుతుంది... వారి ప్రతిమాట నుండి, ప్రతి చర్య నుండి, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్చుకునే అవకాశం వస్తుంది... ఇలా నేర్చుకుంటూ, ఇతరులకు కూడా ఇదే సూత్రం వర్తింపజేస్తే, మనకు జీవితంలో ఎదిగే ద్రుక్పధం అలవడుతుంది... ఎదుటివారు ఎవరైనా, వారు చేసిన ప్రతి పనీ మనకి నచ్చేంత గుడ్డివాళ్ళం ఎప్పుడూ అవకూడదు... మంచిచెడులను బేరీజు వెయ్యగలిగిన విజ్ఞత మనలో పెంపొందించుకోవాలి... చెడును ఖండిస్తూ మనిషిని ప్రేమించే స్థైర్యం మనలో రావాలి... ఇతరుల అనుభవాలను మన జీవిత సోపానాలు చేసుకోవాలి.

మీరు అమ్మనాన్నలయితే, మీరు మానవాతీతులు కారని మీరూ తప్పులు చేస్తారని మీ పిల్లల ముందు ఒప్పుకోండి... మీ జీవితంలో మంచిని గ్రహించి చెడుని క్షమించి వదిలేసేలా వారిని తీర్చిదిద్దండి... చిన్నవారినుండి నేర్చుకోడానికి సిగ్గుపడక, మంచి ఎవరినుండైనా నేర్చుకోవచ్చని మీ ప్రవర్తన ద్వారా తెలియచెయ్యండి.

Wednesday, April 2, 2008

పద్మభస్మం

ఓ పద్మం కాలిపొయింది
ఓ పేజీ జీవితపుస్తకం లోంచి
అర్థాంతరంగా చిరిగిపోయింది
ఓ హ్రుదయ ఘోష
గొంతులోనే మూగబోయింది

ఓ సుందర స్వప్నం చెదిరిపోయింది
ఓ అనుమాన పిశాచం
నా పద్మ ని మింగేసింది
ఓ పంకం తన బిడ్డని తానే
పొట్టనపెట్టుకుంది

మౌనంగా ఎలా ఊరుకోను?
"నేను ఆపేదాన్ని నేను ఆపేదాన్ని..."
అంటూ పలవరించిన రాత్రులు
ఎలా మర్చిపోను?
నా నేస్తం నను చేరలేని
కారణాలు ఎలా ఊహించను?
అసలిదంతా జరిగిందని ఎలా నమ్మను?
ఏం చెయ్యను?

దేవుడిని నిందిస్తూ కూర్చోను
ప్రేమను తప్ప ద్వేషాన్ని గెలవనివ్వను
నిండు పున్నమి లాంటి నీ వదనం
ఎప్పటికీ మర్చిపోను
నీలా నీ కధను కాలిపోనివ్వను
నా గొంతున్నంతవరకు నీ ఎద ఘోషను
ఎలుగెత్తి అరుస్తాను
నీ ఆక్రందన వినిపిస్తూనే ఉంటాను
నీ భస్మం నా నుదుటిపై ధరిస్తూనే ఉంటాను

(చిరు పరిచయం తోనే నా గుండెలో తిష్ట వేసి, చిరుతప్రాయం లోనే తన హ్రుదయం నలిగి పగిలి, భస్మమైన నా నేస్తం పద్మశ్రీ కి, తనలాగే వికసించక మునుపే తగు సమయంలో తగిన సహాయం అందక తమ జీవితాలను బలవంతంగా నులిమేసుకుంటున్న పద్మలకు నా ఈ అరుపు అంకితం)

అనగనగా ఓ పద్మశ్రీ. ఆ అమ్మాయికి నాకు విజయవాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పరిచయం అయ్యింది. అది స్నేహంగా మారింది. అందం, తెలివి, అమాయకత్వం ఇలా అన్ని మంచి లక్షణాలు పోతపోసి ఆ దేవుడు చేసిన బంగారుబొమ్మ. తనే కావాలని పట్టుపట్టి పెళ్ళి చేసుకున్నాడో ప్రబుధ్ధుడు... కొన్నాళ్ళు బానే ఉంది... తరవాత అంతా అస్తవ్యస్తం అయిపోయింది... అతను అమెరికా వెళ్ళిపోయాడు... పద్మ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది... అక్కడ కూడా మనశ్శాంతి లేక... విసిగిపోయి, ఏ మానసిక ఆధారం లేక, ఓ బలహీన క్షణంలో తనని తాను కాల్చేసుకుంది... ఆ జ్ఞాపకమే ఈ పద్మభస్మం.

ఈ సంఘటన నా మనసుని కలచివేసింది... సాధారణంగా ఇలాంటి దారుణాలు జరిగినపుడు కొంతమంది దేవుడిని తిడతారు... చాలా అనుమానంగా తయారవుతారు.. ఎవ్వరినైనా ఓపట్టాన నమ్మడం మానేస్తారు... అసలు ఆ సంఘటనని మర్చిపోడానికి ప్రయత్నిస్తారు... మరి కొందరు అసలు ఏమీ జరగనట్టే ఉంటారు.. అలా అయితే ఆ నిజాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదుగా.. . నాక్కూడా దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో చాలా రోజులు అర్థం కాలేదు... చాలా నిద్రలేని రాత్రులు గడిపాను... తను బతికే ఉన్నట్టు కలలు కన్నాను.. కొన్ని పిచ్చి కలలకు లేచి కూర్చున్నాను... చివరికి అది నా ఛాయిస్ అని తెలుసుకున్నాను... దానినే ఈ కవితలో తెలిపాను.

ఇలాంటి పద్మలు మన చుట్టూ చాలామంది ఉన్నారు... మీ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్క క్షణం ఆగండి... ఓ చిన్న నవ్వు, ఓ వినే చెవి, ఓ ఓదార్పు మాట, ఓ ఆసరా భుజం... కొన్ని జీవితాలు కాలిపోకుండా కాపాడతాయని గ్రహించండి...

Tuesday, April 1, 2008

మౌనస్రావం

అదే అమ్మలు పుట్టినరోజున తనకి శుభాకాంక్షలు ఎలా తెలపాలో అర్థంకాక ఆ మౌనస్రావాన్ని ఆపాలని ప్రొద్దున్నే అయిదు గంటలకు లేచి రాసిన మొట్టమొదటి కవితా కానుక ఇది...

అందరి కోసం నేను
మరి నా కోసమే నువ్వు
అన్న నమ్మకం
ఏదీ... మసకబారిందేం?

సత్యాన్వేషణాప్రవాహం లో
కొట్టుకుపోతున్న నాకు
వెనుదిరిగి చూస్తే
ఎక్కడా.. కనిపించవేం?

ఎవరైనా రండి ప్లీజ్
నే చేసిన
గాయాల నుండి (నా చెలి)
మౌనం స్రవిస్తుంది

సాయం పట్టండి
కట్టు కట్టండి
ఆస్పత్రి కి తీస్కెల్దాం
మౌన స్రావాన్ని ఆపాలి
ఎవరైనా రండి ప్లీజ్

(పలుకే బంగారమైన నా ప్రియ నేస్తం! ఇది నీకే.. పుట్టిన రొజు కానుక)

published in orkut community - my poetry in telugu

అమ్మలు

నాకు చాలా ఇష్టమైన పేరు.. ఎందుకంటే అది నాకు చాలా ఇష్టమైన వ్యక్తికి నేపెట్టుకున్న పేరు. కారణాలేవైతేనేం...ఈ నేస్తం నా పై అలిగి నాతో మాట్లాడటం మానివేయడం జరిగింది... ఆ సందర్భంలో రాసినదే ఈ రెండో చిరు కవిత...
నాపై అలిగిన నెచ్చెలీ
తలపులనెలా తెలిపేది!
నీ సవ్వడి లేని లోకాన్ని
ఎలా ఊహించేది!!

ఇది కూడా my poetry in telugu orkut community లో సుబ్రమణ్యం గారు మొదలుపెట్టిన కవులకు...ఆహ్వానం...! అనే శీర్షికలో ప్రచురించడం జరిగింది.

నానమ్మ

నాకు చాలా ఇష్టమైన, నన్ను పెంచిన తాతమ్మ (అమ్మ వాళ్ళ అమ్మమ్మ) తరవాత అంతే ఇష్టమైన నానమ్మ (నా చిన్ననాటి నేస్తం వాళ్ళ నానమ్మ) ఈ సంవత్సరం మొదట్లో పరమపదించారు... అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే నేను అమెరికా నుండి ఇండియా వెళ్ళలేకపోయాను... ఆ దుఃఖం నుండి కొంత బయటపడిన తరవాత సాహితి ప్రపంచంలో మిత్రుల కవిత్వం చూసి ప్రేరణ పొంది, నానమ్మ జీవితాన్ని గుర్తుచేసుకుంటూ నేను రాసిన మొట్టమొదటి చిరుకవిత ఇది -

భువిపై ప్రతి జీవితం
ఆద్యంతం అమూల్యం
అనుభూతుల్ని మిగిల్చే
అందమైన నందనం

my poetry in telugu orkut community లో సుబ్రమణ్యం గారు మొదలుపెట్టిన కవులకు...ఆహ్వానం...! అనే శీర్షికలో ప్రచురించడం జరిగింది. అలా ఓ రకంగా నాలోని కవితాసక్తిని ఆహ్వానించిన సుబ్రమణ్యం గారి క్రుతజ్ఞతలు.

కృతజ్ఞతలు

ఈ బ్లాగుకు శ్రీకారం చుట్టమని సలహా ఇచ్చిన మిత్రులు కవిత, చంద్ర మరియు డాక్టర్ రాజేష్ లకు కృతజ్ఞతలు.

నమస్కారం

నా బ్లాగు కి విచ్చేసిన మీకు నమస్కారం. సందేహాన్ని గుమ్మం బయటే వదిలి రండి. ఇక్కడ నేను నా అనుభూతుల్ని ముత్యాలసరాలుగా పేర్చుకుంటాను. నా అనుభవాల్ని నెమరేసుకుంటాను. నా ఆలోచనలను అక్షరీకరిస్తాను. నా అభిప్రాయాలను పొందుపరుస్తాను. ఒక్కోసారి సూక్తిసుధ కూడా చెబుతుంటాను. అవి మీకు నచ్చాల్సిన లేదా ఒప్పుకుని తీరవలసిన అవసరం లేదు. కానీ, అవి మిమ్మానదింపచేస్తే, ఆలోచింపచేస్తే, మార్పుకి నాంది పలికితే నా రాతలు ధన్యమయినట్టనుకుంటాను. ప్రశాంతచిత్తంతో చదవండి.