Tuesday, October 9, 2012

బాణం


ఎప్పుడో ఎవరో వేసే ఉంటారు
నీపై నిప్పుల బాణాలు

ఎన్నాళ్ళని తిరుగుతూ ఉంటావ్? -
వీపుకు గుచ్చుకుని


పీకెయ్...
కొన్నాళ్ళు నొప్పి పెడుతుందేమో!
గాయం మానాక
మచ్చ కూడా పడుతుందేమో!

తీయకపోతే మాత్రం
ఒళ్ళు తగలబెట్టుకున్నట్టే...!


కొంతకాలం కసినే
ఇంధనంగా మార్చి
ముందుకు సాగుతావేమో!
ఒక్కోసారి మజిలీ కూడా చేరతావేమో!

చివరంటా ఉంచితే మాత్రం
నిజమైన నిన్ను మసి చేసుకున్నట్టే...!


ఆత్మావలోకనం చేసుకునే తరుణం
నిన్ను నువ్వే బేరీజు వేసుకునే సమయం
ఒక దారి మూసుకుపోతే
మరో ద్వారం వెతికే సందర్భం

పదే పదే తలుచుకుని ఏడిస్తే మాత్రం
ముందుకు వెళ్ళలేక చతికిలపడ్డట్టే!


లే...
కళ్ళు తుడుచుకో
స్పష్టంగా కనపడుతుంది
నిటారుగా నిలబడు
మార్గం అగుపిస్తుంది
లక్ష్యాన్ని ఛేదించు
గమ్యం చేరువవుతుంది
సాధించి చూపించు
లోకం తలవొంచుతుంది

నిత్య చైతన్యంతో విశ్వాన్ని నింపెయ్
అనంతమే నీ సొంతమవుతుంది

(ఒకసారి ఓడిన తమ్ముడికి, గెలుపు అందుకొమ్మని పిలుపునిస్తూ...)