Friday, May 9, 2008

ఉద్వాసన

అది రణభూమి
ఇది శ్రమభూమి

అచట శత్రువు సైతం
ముందే చేస్తాడు ప్రకటన
ఇచట గులాబి పత్రం
పొడుస్తుంది వెనుకచాటున

అచట నాయకత్వం
ఉరుకుతుంది ఉత్సాహంగా
ఇచట నాయకులు సైతం
చూస్తారు నమ్మలేక

అచట వొరుగుతాయి
క్షతగాత్రుల తలలు
ఇచట పగులుతాయి
సహవాసుల కలలు

అచట కోస్తారు
కిరీటం కుచ్చుతోక
ఇచట లాక్కుంటారు
గుర్తింపు చిత్రపలక

అచట శవాల చుట్టూ
రాబందుల రగడం
ఇచట మిగులు కోసం
జనాల జగడం

అది స్మశానవైరాగ్యం
ఇది ఉద్వాసనపర్వం

(నాజట్టులోని ఐదుగురిలో ఉద్యోగం పోయిన నలుగురికి, వారిలానే ఉద్వాసనలో ఉద్యోగాలు పోయి పాట్లు పడేవారికి ఈ పర్వం అంకితం)

సాఫ్ట్-వేర్ కార్యాలయాల్లో, అందులోనూ, ప్రైవేటు కార్యాలయాల్లో ఈ ఉద్వాసనలు ఎక్కువగా ఉంటాయి... ఇప్పటివరకు నేను దీనిని అనుభవించకపోయినా, అంతకంటే ఎక్కువ బాధ నా తోటి వారికి జరిగినపుడు అనుభవించాను... ఒక్కోసారి ప్రమాదం ముంచుకొస్తుందని ముందే తెలుస్తుంది... కానీ, చాలాసార్లు ముందు తెలియదు... అతి సాధారణంగా మొదలైన ఓరోజు మనమీద వేటు పడుతుంది... వెన్నుపోటు అనుభవంలోకి వస్తుంది... నమ్మకానికి విఘాతం కలుగుతుంది... గుండెలో శరాఘాతం దిగబడుతుంది... అవమాన భారం తల దించుతుంది... అనుమాన వైఖరి అలవడుతుంది... కాస్సేపు ఏం జరుగుతుందో తెలియని అయోమయం.. అంతలోనే భవిష్యత్తు అగమ్యగోచరం... చిప్పిల్లే కన్నీళ్ళు... చివరి వీడుకోళ్ళు... భారమైన కరచాలనాలు... అసలేం జరిగిందో సాంతం అర్ధం అయేలోపే కనుమరుగయే సహచరులు...

నన్ను మానసికంగా కుంగదీసిన ఉద్వాసనల్లో మొదటిది జులై మాసం 2005 లొ జరిగింది... దాదాపు యాభై శాతం మందికి ఉద్వాసన పలకడం జరిగింది... తరువాత అంతే బాధపెట్టిందీ.. స్మశాన వైరాగ్యంలోకి నెట్టిందీ ఈ యేడాది మార్చి మాసంలో జరిగింది... అందులోనే నాకు ప్రియమైన మానేజర్ని కోల్పోవడం జరిగింది... ఆయనతో కారు వరకూ నడిచి కంటిలో నీటితో, భారమైన మనసుతో చివరి వీడుకోలు ఆలింగనం ఎప్పటికీ మరిచిపోను... అలానే, నేను నాయకత్వం వహిస్తున్న జట్టులోని అయిదుగురిలో నలుగురిపై ఈ ఉద్వాసన వేటు పడింది... వారి కళ్ళల్లో వేల ప్రశ్నలు నను గుచ్చుతూ ఉంటే, నా నిస్సహాయత్వం మరిచిపోలేను...

ఇలాంటివి జరిగినప్పుడే, ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుస్తుంది... ఎప్పుడైనా, దేనికైనా సిధ్ధపడి ఉండాలని అనిపిస్తుంది... మీకే ఇలా జరిగితే, చెరగని చిరునవ్వుతో దానికి ఎదుర్కోండి... అదేమీ జీవితానికి అంతం కాదు... కార్యాలయాల్లో ఉన్న ఇబ్బందుల వల్ల కేవలం అంకెలతో ఆడే ఆటలో బలి అయితే అది మీ తప్పేమీ కాదు.. మీ సామర్ధ్యానికి మచ్చ కానేకాదు... కొన్ని అంతమవడం మనకి మంచిది... మరి కొన్నిటికి శ్రీకారం చుట్టడానికి దారితీస్తుంది... ధైర్యం గా ముందుకు నడవండి... మరి కొంతమందిని ఓదార్చండి... ఆదర్శంగా నిలవండి...

మీ తోటి వారికి ఇలా జరిగితే, వారికి అండగా నిలబడండి... వారి భారాన్ని మోస్తూ తోడుగా నడవండి... శుష్కమైన ఓదార్పు మాటలాడడానికి తొందరపడకండి... మౌనంగా వారి ప్రక్కనే ఉండండి... ఏమైనా చెప్తే వినండి... కార్యాలయాన్ని కానీ, యాజమాన్యాన్ని కానీ దూషిస్తే వంత పాడకండి... వాదోపవదాలకు దిగకండి... మౌనంగా వినండి... సానుభూతితో అర్ధం చేసుకోండి... వారికీ మీకూ గతంలో ఏవైనా పరిష్కారం కాని కలహాలు ఉంటే, మీ తప్పు కాకపోయినా, వెళ్ళి క్షమాపణ అడగండి... వారి మనసు తేలిక పరచండి... వారి వస్తువులను మోస్తూ సింహద్వారం వరకూ నడవండి... భుజం తట్టి, వీడ్కోలు చెప్పండి... వారికి అవసరమైనపుడు సహాయం చేయండి... మీ సానుభూతి మాటలలో మాత్రమే కాక చేతలలో కూడా చూపండి... మీ మిత్రులతో వారికి సరిపోయే ఉద్యోగాల గురించి వాకబు చేయండి... ఇతర కార్యాలయాలు వారి గురించి వాకబు చేసినపుడు సాధ్యమైనంత వరకు మంచినే చెప్పండి... వారికి మరో ఉద్యోగం దొరికే వరకు కనీసం వారానికి ఒక సారి ఎలా ఉన్నారో, ఏది అవసరమో కనిపెడుతూ ఉండండి... ఈవేళ వారు, రేపు మనము, అందరూ ఈ సర్కస్ అగ్నివ్రుత్తం లోంచి దూకాల్సిందే... మనకు ఏదైనా ఇలాంటిది జరిగినపుడు ఇతరులు ఏం చేస్తే బాగుండని తలుస్తామో, అదే మంచి తోటివారికి చేయండి.