Wednesday, February 22, 2012

ఇప్పుడిప్పుడే



ఇప్పుడిప్పుడే మళ్ళీ పుడుతున్నా
ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నా

ప్రతీక్షణం పుడుతూ చచ్చే
వేల కణాల సమూహాన్ని నేను
ప్రతీనిమిషం పడుతూ లేచే
కోట్ల కలల సమాహారం నేను

కలలు...
చాలా చిత్రంగా ఉంటాయవి
ఎలా వస్తాయో కొన్ని! -
మన అంతరాంతరాలను ఊపేస్తాయి

అనంత విశ్వాలన్నీ కలిసి
చూపుడువేలితో తాకినట్టుంటాయి
నిద్రపోతున్న జాగ్రదావస్థను
సున్నితంగా లేపినట్టుంటాయి
మూసుకుపోయిన మూడోకన్ను
మెల్లగా తెరిచినట్టుంటాయి
అర్ధంకాని వేదనకు
తపనకు తపస్సుకు
సమాధానంలా ఉంటాయి

ఒకరికో ఇద్దరికో
పరిమితమై గిరిగీసిన ప్రేమను
ప్రపంచానికి పంచమంటాయి
పరిధిని పెంచమంటాయి
పసిపాప పెదవిమీద పాలనురగలా
స్వఛ్ఛంగా ఉండమంటాయి
హాయిగా నవ్వమంటాయి
అదుపాజ్ఞలు లేని గాలిలా
అంతమే ఎరుగని నింగిలా
పక్షపాతం తెలియని వానలా
ఉత్సాహమే తెలిసిన వాగులా
మారమంటాయి

ఆర్తికి అర్ధానికి మధ్య
వారధి కమ్మంటాయి

కృషి చేసే సంకల్పం
కష్టానికి ఫలితం
కడుపునిండా సంతోషం
కలసికట్టుగా కలలు కనే సమయం
ఇలను స్వర్గం చేసే సామర్ధ్యం
శాంతి సహనం సమత ధర్మం
సమతుల్యం హరిత వనం
సంతసించే పుడమి మనం...
కేరింతలు నవ్వులు నిండిన
మరోప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి

ఇప్పుడిప్పుడే కలలు కంటున్నా
ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నా

(పుట్టినరోజున నాకు నేనే ఇచ్చుకున్న కలల కానుక)

Thursday, February 2, 2012

ఆత్మావలోకనం


ఏ లక్ష్యం లేకపోవడం
ఎంతటి ఆప్తులై'నా' స్వేచ్చను హరించడం
అసలు అటువంటి వాతావరణంలో నేనుండడం
కఠిన నిర్ణయాలను నిరంతరం వాయిదా వేయడం
తోటివారితోనూ దైవంతోనూ సత్సంబంధాలు లేకపోవడం
ఆత్మీయుల సమూహానికి దూరంగా ఉండడం
ఏ ఆటలూ ఆడకపోవడం
నూతనంగా ఏమీ నేర్చుకోకపోవడం
తగినంత పనివొత్తిడి, జట్టు లేకపోవడం
స్వార్ధరహిత సేవాకార్యక్రమాలలో పాల్గొనకపోవడం
ఉన్న మంచిని దీవించడానికి బదులు
లోపాలను ఎత్తిచూపడం...

... ఇలా ఎక్కువకాలం ఉండడం
తద్వారా సంభవించేది లోపలి మరణం

శారీరకంగా
మానసికంగా
ఆధ్యాత్మికంగా
ఆర్ధికంగా
నను నేను సరిగా చూసుకోకపోతే
ఇంకెవరినీ సరిగా చూసుకునే స్థితిలో ఉండను
అనేది నిరూపించబడిన సత్యం

సమస్య ఏమిటో తెలిసిందిగా
సగం పరిష్కారం దొరికినట్టే!

(నను నేను సరిచేసుకునే క్రమంలో మౌనకుహరంలో కొన్నాళ్ళు తిష్టవేస్తే అది మీ తప్పు కాదని గ్రహించమని మనవి)