Thursday, September 4, 2008

నేస్తం

నీ మాటల్లో నిర్వేదం
నా గుండెని కోస్తుందంటే నమ్మగలవా?!
ఊ కొట్టడం తప్ప
మరేమీ చేయలేని విచిత్రస్థితి


అప్పటి నువ్వు నీ నవ్వు
ఆసక్తి అనురక్తి
ఏవీ? ఎక్కడా కనిపించవే?


సత్య హత్య (రాగింగ్) నుండి నను కాపాడిన మొదటి పరిచయం
భాగ్యనగరంలో మనకొచ్చిన స్వతంత్రం
పరీక్ష ముందు రాత్రి పడ్డ కునికిపాట్లు
మరునాడు ఎక్కిన ఆంజనేయస్వామి గుడి మెట్లు
వెజ్ హాస్టల్ లో చాటుగా తిన్న చికెన్ బిరియానీలు
సాంబ్రాణీధూపంలో జరిపిన ధూమపాన పరీక్షలు
దొంగ పడ్డ రాత్రి అసలు సిసలు హీరోల్లా మనం చేసిన గొడవలు
దూకిన గేట్లు గోడలు

వార్డెన్ ను పెట్టిన తిప్పలు
ముంచుకొచ్చిన ముప్పులు
లారీల్లో వెళ్ళి చూసిన సినిమాలు
కంఠస్థం చేసిన పాటలు ఆడిన అంత్యాక్షరీలు
సమిష్టి కృషితో గెలిచిన పేకాటలు
సాహసయాత్రల్లో మనం చేసిన గలాటాలు
అల్లరిలోనూ చదువులోనూ మనం నిలిచిన ప్రధమ స్థానాలు

ప్రపంచాన్ని ఎదురీదేంత ఆత్మవిశ్వాసాలు
దైవాన్ని సైతం ప్రశ్నించగలిగే అహంకారాలు
ఏవో గొప్ప పనులు చేయాలనే తపనలు
అప్పటికప్పుడు ప్రణాళికలు
భయమన్నది తెలియని హౄదయాలు
ప్రమాదాలతో ఆడుకున్న వయసులు
ప్రేమ తప్ప తెలియని మనసులు
రోజుల తరబడి చెప్పుకున్నా తరగని కబుర్లు
కళ్ళెదుట ఉన్నా రాసుకున్న ఉత్తరాల కట్టలు
ఒకరి కంట ఒలికిన మరొకరి కన్నీళ్ళు
ఒకే లయలో కొట్టుకున్న రెండు గుండెలు
పంచుకున్న విలువలు సాహిత్యాలు
నువ్వు పక్కనుంటే ఏదైనా సాధించగలననే ధీమాలు
స్నేహం తప్ప జీవితానికి మరేమీ అక్కరలేని భీమాలు
మైత్రీమాధుర్యాన్ని ఆసాంతం గ్రోలిన రోజులు

మరొక్కమారు గుర్తుచేసుకుందాం
ముసురుతున్ననీరసాన్ని ఎడంచేత్తో విదిలిద్దాం
దూరాలెరుగని తోడుగా కలిసి నడుద్దాం
కడవరకూ ఇదే నినదిద్దాం -
"అసలీప్రపంచమంతా వేస్టుగాళ్ళు - ఒక్క నువ్వూ నేనూ తప్ప"

(నా స్నేహకిరణానికి ఈ నేస్తం అంకితం.)

బంధం

కొన్ని బంధాలు
మెరిసి మాయమవుతుంటాయి
మరికొన్ని బంధాలు
మురిపించి సాగిపోతుంటాయి

బంధాల బందీకాని జీవితం
జాలిగా మౌనంగా
స్వేచ్చగా శాంతిగా
హాయిగా తీయగా

నా అన్నిటినీ ప్రేమిస్తున్నట్లే
ఒంటరితనాన్ని కూడా