జీవమిచ్చే సంజీవనం
ప్రాణంతీసే చంద్రహాసం
స్పూర్తినిచ్చే ఔషధం
నిలువునా కూల్చే శాపం
పాలకడలిలో చిలికిన అమ్రుతం
క్షీరభాండం విరిచే కాలకూటం
మంచిని పెంచే ఆయుధం
వారధికూల్చే అంధత్వం
చల్లదనాల చందనం
రావణకాష్టానికి నిప్పుకణం
కాలిన మనసుపై నవనీతం
మండే వ్రణంపై మిరపకారం
గాయం మాన్పే లేపనం
మాయం చేసే సుడిగుండం
మంచుకొండంత నిబ్బరం
మసిచేసే దావానలం
ఉన్నతశిఖర తొలి మార్గం
జారిపడే లోతైన అగాధం
జీవనాధార సంద్రం
కబళించే సునామీ రౌద్రం
(మన మాటలకు ప్రాణం పోసే, తీసే శక్తులు రెండూ ఉన్నాయని గుర్తు చేస్తూ, పదాలు వాడే ముందు మనసుని, పర్యవసానాలను ఒకసారి పరీక్షించుకోవాలని సూచిస్తూ, మాటలే మంచి గంధాలైన వాక్శుధ్ధిగలవారికి నా మాట అంకితం.)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment