Sunday, June 8, 2008

ఆస్థి

రియలెస్టేట్ క్రిష్ణారావు
షేరుమార్కెట్ పీరుసాయబు
సాఫ్టువేరు శేషుకుమారు
అమెరికా ఆనందబ్రహాము
వీరేనా సంపద కొలబద్దలు?!

ఇళ్ళు పొలాలు బళ్ళు కార్లు
నగలు కాసులు విమానయాత్రలు
కంట్రీక్లబ్బుల సభ్యత్వాలు
నడిరేయి విందులు వినోదాలు
హాలీవుడ్ అనుకరణలు
ఖరీదైన బహుమానాలు
ఇవేనా ప్రగతికి గీటురాళ్ళు?!

సగటు సరోజకు కుట్టేకళ్ళు
సాంబయ్య పిల్లలకొచ్చే రెక్కలు
మన"చే"జారే మధురక్షణాలు
సహజమాయే వేరు కుంపట్లు
సంసారసాగరాన మునిగే నౌకలు
ఇవేగా మిగిలే చేదు అనుభవాలు!!

బల్లలకింద చాచే చేతులు
నిస్సిగ్గు పన్నుల ఎగవేతలు
స్విస్సుబాంకుల్లో నల్లధనాలు
పరులపైకెగబాకే వైకుంఠపాళీలు
విలువలకూడే వలువలు
ఇవేనా భావితరానికి మన వారసత్వాలు?!

నలుగురు మిత్రుల స్నేహాలు
నలుగురి హ్రుదిలో స్థానాలు
నాలుగిళ్ళకు తాళంచెవులు
నాలుగు మాటలువినే చెవులు
ఇవి కావా వెనకేసే నాలుగు రాళ్ళు?!

మనతో నవ్వే నాలుగు నోళ్ళు
మనంపోతే నాలుగు కన్నీళ్ళు
మోసుకుపోయే మరి నాలుగు భుజాలు
మన గురుతులు నాలుగు కాలాలు
ఇంతకుమించి ఏవీ? - ఆస్థికి కొలమానాలు?!

(ఆస్థిపాస్థుల ఆరాటంలో పడి, విలువలను, మరలిరాని మధురక్షణాలను, అసలైన ఆనందాన్ని కోల్పోతున్న మిత్రులను ఇకనైనా కళ్ళు తెరవమంటూ, విలువైన "ఆ" నాలుగు రాళ్ళు వెనకేసుకునే చిదానందమూర్తులకు నా ఆస్థి అంకితం)

No comments: