నీవు లేని శూన్యాన్ని
కవిత్వంతో నింపే
వ్రుధాప్రయత్నం చేస్తున్నా
ఎపుడైనా నువ్వు
చూడకపోతావా అని
యాద్రుచ్చికంగా...
మారేలా ఉంది
ఇదో వ్యసనంలా
ఈ రాతలు నీకు
పోటీనా?! కాదు కాదు
కేవలం నీ నిశ్శబ్దం
సైతం సుగంధ పరిమళం
వెదజల్లే అవకాశంగా...
నలిగినకొద్దీ సౌరభాన్ని
అందించే మరువంలా
నా పిచ్చిగీతలే
బావున్నాయి అంటున్నారంతా
అదేదో పేరు కూడ పెట్టారు
ఏంటబ్బా అది?! - ఆ! గుర్తొచ్చింది
ఫీల్ కవిత్వమట...
అదంటే ఏంటొ తెలియక
నవ్వుకున్నా లోలోపల
పొనీలే ఇప్పుడు తెలిసిందిగా...
నీ చుట్టూ తిప్పి వెనక్కి
గిరాటేశా దిష్టిలవణంలా
బహుశా ఈ అక్షరాలు
నా ఎదలో వెల్లువెత్తే
భావనల సమాహారమేమో...
అందరి హ్రుదయాలనూ
హత్తుకుంటున్నాయి
బహుశా ఈ భావనలు
నావి మాత్రమే కావేమో...
అందరి మనసులను
మమైకం చేసే భావసంద్రంలో
కొట్టుకుపొతున్నాగా...
ఎన్ని దోసిళ్ళతో తాగినా
తీరని దాహంలా
(నిశ్శబ్ద విప్లవమై నా కలాన్ని నింపుతున్న ఓ నేస్తం! ఈ శూన్యం నీకే అంకితం)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment