Sunday, June 8, 2008

మురిపెం

ఎవరన్నారు మగవారికి
ప్రసవవేదన తెలియదని?
బిడ్డలు లేని వారంతా
అనుభవ శూన్యులని?!

నేల పొరలు చీల్చుకుని
బయటకు వచ్చే గడ్డిపరకకూ
నా మనసు పొరలు చీల్చుకుని
బయటకు వచ్చే ఈ కవితకు
ఎవరో గొప్పకవి చెప్పినట్టు
చాలా దగ్గర సంబంధం

ఎన్ని నిద్రలేని రాత్రులు
ఎన్ని బరువెక్కే ఆలోచనలు
ఎన్ని అంతర్మధనాలు
మరెన్ని కూర్పులు చేర్పులు
ఎన్ని సార్లు అనలేదు...
ఇక నా వల్ల కాదని

అంత ఓర్చలేని కష్టంలోనూ
ఆ కవిత అక్షరాలు చుట్టుకుని
బయటపడిన క్షణం...
తనివిదీరా ప్రతి అక్షరాన్ని
నా చూపులతో
తడిమి తుడిచిన క్షణం...

నాకు టాటా చెప్తూ నను వీడి
సాహితీ బడికి ఆనందంగా వెళ్ళిన క్షణం...
మళ్ళీ నేను నా శూన్యం
మిగిలిన క్షణం...

అందరూ నా కవితను అక్కున
చేర్చుకున్న క్షణం...
మహామహుల చెంత
చెక్కబడిన శిల్పమై పుత్రోత్సాహం
అందించిన క్షణం...
మురిపెంగా నా కవితను
నేకౌగిలించుకున్న క్షణం...

ఎవరన్నారు కవులు అంతకన్నా
తక్కువ వేదన మురిపెం అనుభవిస్తారని?!


(గొప్పగొప్ప కవితలను మాకందించడానికి ప్రసవవేదన అనుభవించే కవులందరికీ నా మురిపెం అంకితం)

No comments: