అమ్మా! చిన్నపిల్లలు దేవుళ్ళన్నావుగా...
మరి వీళ్ళెవరికీ వాళ్ళమ్మ చెప్పలేదేమో!
బూచాడిలా లేడు
మంచి మాటలు చెప్పాడు
నన్నెత్తుకుని ముద్దుపెట్టాడు
తమ్ముడికి బోలెడు చాక్లెట్లు ఇచ్చాడు
ఇద్దరినీ కారులో షికారు తిప్పాడు
ఇక్కడ వదిలేసి ఎటో పోయాడు
భయమేస్తుందమ్మా... నువ్వెప్పుడొస్తావ్?
ఈ అన్న మంచోడు కాదు
ఆ తాత కుడా మంచోడు కాదు
సూటు బూటు వేసుకుని వచ్చాడే...
ఆ అంకుల్ కూడ మంచోడు కాదు
వీళ్ళందరికి బొమ్మలు లేవేమో...
మాతో ఆడుకుంటున్నారు
మా వొళ్ళంతా నలిపేస్తున్నారు
ఇంజష్షన్ అంటే ఇంటిచుట్టూ
పరిగెత్తేవాళ్ళం... గుర్తుందా అమ్మా?
ఇప్పుడు రోజూ రక్తం చూట్టం అలవాటైపొయింది
నొప్పిగా ఉందన్నా వినిపించుకోట్లేదు
ఏడ్చి ఏడ్చి ఇంక ఏడుపు కూడా రావట్లేదు
చచ్చిపోతామేమో అమ్మా
నువ్వెప్పుడొస్తావమ్మా
నీ చేతుల్తో బువ్వెప్పుడు పెడతావ్
కథలు చెప్తూ ఎప్పుడు జోకొడతావ్
జోల పాడుతూ ఎప్పుడు బజ్జోపెడతావ్
ఆ అన్నకి, ఆ తాతకి,
ఆ సూటు బూటు అంకుల్ కి
మా కొసం రావొద్దని చెప్పమ్మా
దొంగతనం చేస్తే
పోలీసోడు పట్టికెల్తాడన్నావ్ గా...
మమ్మల్ని దొంగతనం చేసిన అంకుల్ ని
పోలీసోడు పట్టుకుపోతాడా?
ఇకనుండి నీ మాట వింటాంగా...
నువ్వొద్దన్న పనులు అస్సలు చేయంగా...
ఇక్కడ్నుంచి తీస్కెల్లిపోమ్మా
(విక్రుత వాంఛలతో విషపురుగులు ఒడిగట్టే అక్రుత్యాలకు బలి అయిపోతున్న చిన్నిదేవుళ్ళకు ఈ ఆవేదన అంకితం)
కటువైన వాస్తవాలు కఠినంగానే చెప్పాలి. చదవడమే ఇంత కష్టంగా ఉంటే ఇది నిజంగా జరుగుతుందనే నిజం ఎంత చేదుగా ఉంటుందో ఊహించండి. ఇదేదో ఇతర దేశాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే... మన దేశం అగ్రస్థానానికై పోటీ పడుతున్న అనేక అంశాలలో ఇది కూడా ఒకటని చెప్పడానికి సిగ్గు పడుతున్నాను. మన చినారులను మనమే తినేసే ఈ విషసంస్క్రుతి ఎప్పుడు మొదలయింది?
కళ్ళు తెరవండి... మన చుట్టూ ఉన్న చీకటి నీడలను చూడండి... చాపకింద నీరులా విస్తరిస్తున్న సమస్య తీవ్రతను అర్థం చేసుకోండి... మీరు చేయగలిగింది చెయ్యండి... మీ తోటివారికి చెప్పండి... రండి, అందరం కలిసి మన భవితకై యుధ్ధం చేద్దాం...
యుధ్ధ ప్రణాలిక -
దీర్ఘకాల వ్యూహం - మూల కారణాలు - పేదరికం, నిరక్షరాస్యత, తెలియనితనం, విపరీత పొకడలు
సత్వర వ్యూహం - తెలియపరచడం, నివారణ, కఠిన శిక్షలు, పునరావాసం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment