Sunday, June 8, 2008

ప్రవల్లిక

గాలిబుడగలంటే ఇష్టం
అవి పగిలే చప్పుడు కాదు

అందరితో కలవడం ఇష్టం
గజిబిజి గందరగోళం కాదు

నువ్వు నేను ఉన్న నిశ్శబ్దం ఇష్టం
పరుగులెత్తే హడావుడి కాదు

పుట్టినరోజున కేకులు ఇష్టం
వాటిపై ఉన్న తీపి కాదు

దాగుడుమూతల దండాకోర్ ఇష్టం
రుమాలు మాటున చీకటి కాదు

అందరూ అర్ధం చేసుకోడం ఇష్టం
నేనందరికీ అర్ధం కాను

సమయం ఉన్నవారు అర్ధం చేసుకోరు
అర్ధం చేస్కోవాలనుకునేవారికి సమయం ఉండదు

నాలోకంలో ఉండడం ఇష్టం
లోనికిరాకుండా బయటకు తేలేరు

బ్రహ్మరాత వైఫల్యమో
వైద్యశాస్త్ర చెడు ఫలితమో
తప్పులొప్పని చేతకానితనమో
దిద్దుకోని మూర్ఖత్వమో

నేనెవరో తెలుసా?!
నేలమీది తారకను
అందనంత మేధోసంపత్తిని
మాసిపోని పసిమనసును
సహనానికి సాధనాన్ని
పూరించలేని ప్రవల్లికను

(మా ఊరిలో 2008 ఆటిజం ప్రచారానికి ఏర్పాటు చేసిన నడకలో వెయ్యిమందికి పైగా పాల్గొనడం చూసి ప్రభావితమై, ఈ ఉదయం అంతా వారితో ఆడుకుని, అందరిని ఈ రుగ్మత గురించి తెలుసుకొమ్మని జాగ్రుతం చెస్తూ, తమని పూరించమని ఆహ్వానిస్తున్న ప్రవల్లికలను అర్ధం చేసుకొమ్మని అభ్యర్ధిస్తూ, పూరించే దమ్ముందా? - అని సవాలు చేస్తూ, దారి చూపమని ఆ దైవాన్ని ప్రార్ధిస్తూ, ఈ ప్రవల్లిక ఆ వసివాడని పసిమనసులకు అంకితం)

No comments: