ఎన్నాళ్ళిలా దిక్కులు చూస్తూ
చుక్కలు లెక్కెడుతూ కాలం గడపడం!...
రెండు అడుగులు ముందుకి
మూడు అడుగులు వెనక్కి
ఎన్నేళ్ళు వేయనీ తకధిమి తాళం!!...
నాలో నేను నాతో నేను
ఎంతసేపిలా మాట్లాడుకోడం!
నువ్వులేని నిశిరాత్రులు ఎన్నని గడపడం!...
ఎలా ముందుకు నడవడం!!
మదిలోని స్థైర్యం ముందడుగు వేస్తుంటే
ఎదలోని శూన్యం ఎక్కడికనే అపశకునం
రారమ్మనే భవితవ్యం వదిలెళ్ళకనే జ్ఞాపకవ్యాపకం
ఎన్నాళ్ళిలా చావడం!... చస్తూ బతకడం!!...
అయినా బతకాలి...
ఈ బతుకు నాది మాత్రమే కాదుగా!...
ఎదురుచూసే అందరి కోసం
ఎదను పంచే ఆత్మీయులకోసం
జీవమిచ్చిన దైవం కోసం
ఆశలు నిండిన రేపటి కోసం
శోకం లేని లోకం కోసం
ప్రేమమయ ప్రపంచస్థాపన కోసం
పసిపాపలు నడిచే మాపటి దారిని
అడుగులతో అరగదీసి చదరంగా చదును చేసి
చిన్నారిపాదాల సన్నాయి సవ్వడులకు
నేపరచిన చలువరాళ్ళ డోళ్ళు
పలికే నవయుగస్వాగతశుభనాదం కోసం
(తమ ఎదలో శోకం ఏరులై పారుతున్నా, చుట్టూ ఉన్న వారి నవ్యభవితవ్యం కోసం అర్ధవంతమైన జీవనసమరంలో గెలుస్తూ ఓడే, ఓడుతూ గెలిచే యోధులకు నా అనామిక అంకితం.)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment