Sunday, June 8, 2008

మెట్లు

లోనికిరా నేస్తం
ఎన్నాళ్ళిలా
పుట్ల మీదా
చెట్ల మీదా
సాహితీప్రాంగణ
మెట్ల మీదా

లోనికిరా నేస్తం
ఎన్నాళ్ళిలా
మాటల తూటాల మీదా
అవి పొడిచే తూట్లమీదా
సైధ్ధాంతికపు సిగపట్లమీదా

లోనికిరా నేస్తం
ఎన్నాళ్ళిలా
విజ్ఞత కాదు సుమా
కేవలం పట్లు
ఉండాలి మిత్రమా
వొడుపులు విడుపులు

లోనికిరా నేస్తం
ఎన్నాళ్ళిలా
పిన్నలకు ప్రేమతో చీవాట్లు
పెద్దలకు క్షమాపణల మాట్లు
తీర్చేనుగా ఎడబాట్లు

లోనికిరా నేస్తం
ఎన్నాళ్ళిలా
మనరాదు వాదన గెలిచేట్లు
మసలుకో మనసు గెలిచేట్లు

నీరాకకై వేచిఉంటాను
స్నేహపు చెలియలికట్లమీద

(అభిప్రాయభేదాలతో విడిపోయే మిత్రులకు చేయందిస్తూ, దూరం చేసుకున్న వారినీ దూరం అయినవారినీ దగ్గరకమ్మని ఆహ్వానిస్తూ, దిగిరమ్మని అంకితం చేస్తున్నా ఈ అహం మెట్లు)

No comments: