తెల్లగా స్వచ్ఛంగా రాలుతున్న మబ్బుపింజలు
దివి నుండి భువి పైకి
గతించిన కాలం నుండి ప్రస్తుతంలోకి
అచ్చంగా నీ జ్ఞాపకాల్లానే
నా మనసుని తడిమేస్తూ తడిపేస్తూ
చిన్నప్పుడు ఆకాశంలో తెల్లమబ్బులు
అందుకోవాలనే కోరిక ఇలా తీరిన ఆనందం
ఎంతోసేపు నిలవలేదు
నువ్వు గుర్తొచ్చావు
నా గుండెను కమ్మేస్తూ కోసేస్తూ
ఆ మోడువారిన చెట్లని చూడు
జీవం ఉంది హరితం లేదు
మంచుతో కప్పుకోవాలనే కోరికతో
అచ్చం నాలానే
వడలిపొతూ వొంగిపోతూ
నీ స్పర్శాగ్ని లేక
సుదీర్ఘ శీతాకాలం
ఘనీభవించిన ఈ మనసులానే
నా శరీరం గడ్డకట్టిపోనీ
నిశ్శబ్దంగా నిస్తేజంగా
అలా అయినా అవనీడు
ఆ జాలి లేని సూరీడు
ఉదయాన్నే తన నులివెచ్చని
స్పర్శతో ఓదారుస్తున్నాననుకుంటాడు
నను కప్పిన మంచుపింజలను
కరిగిస్తూ కాల్చేస్తూ
(ఈ సంవత్సరం అయోవా చలికాలాన్ని, తమ అర్ఠభాగ వియోగాన్ని తట్టుకుంటున్న మిత్రులకు ఈ పింజలు అంకితం)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment