మా ఇంటికొస్తే ఏం తెస్తావ్?
మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్?
నాకేనా చిర్రెత్తుకొచ్చేది? మీక్కూడానా?!
మా అబ్బాయి పుట్టినరోజుకి
మీరు కొనిచ్చిన కారు బొమ్మలాంటిదే
మీ అమ్మాయి పుట్టినరోజుకి
కొనిపెడతాను...
ఎందుకు?! మా అబ్బాయికి మేము
మీ అమ్మాయికి మీరు
కొనుక్కోవచ్చుగా!
మొన్నామధ్య మా అమ్మాయి బారసాలకి
నువ్వు చేయించావే వదినా... బ్రేసలెట్టు
ఎంతయిందేవిటీ? మీ అబ్బాయి అన్నప్రాశనకి
అలాంటిదే చేయిస్తాను...
ఎందుకు?! ఎవరి పిల్లలకి వాళ్ళు
చేయించుకోవచ్చుగా!
ఏమండీ! వింటున్నారా?! మీ కామాక్షమ్మక్కయ్య
మొన్న గ్రుహప్రవేశం చేసినప్పుడు
నాకు కంచిపట్టు చీర పెట్టింది
మరి మన గ్రుహప్రవేశానికి అంత పెట్టలేకపోయినా
కనీసం జరీ చీర అయినా పెట్టాలి కదా...
ఎందుకు?! అందరికి కంచిపట్టు చీరలు
పెట్టగలిగిన ఆవిడకి నువ్విచ్చే జరీ చీరో లెఖ్ఖా!
మొన్న మా దూరబ్బంధువు గోపన్నయ్య వాళ్ళ చెల్లెలి
పెళ్ళిలో అందరు ఆడపడుచులకి స్టీలు బిందెలు
పంచాడు.. మనం కనీసం చెంబులైనా ఇవ్వొద్దూ...
ఎందుకు? ఈ చెంబులు వెండిభరిణలు చెప్పులు చాంతాడులు
ఈ చెత్తంతా ఎందుకు పేరబెట్టుకొడం?!
లేదా వేరేవాడికి మారుబహుమతి ఇవ్వడం?!
ఇలా చెప్తూపోతే ఎన్నో.. ఎన్నెన్నో...
వాళ్ళు ఇచ్చారని వీళ్ళు
వీళ్ళు ఏదైనా అనుకుంటారని వాళ్ళు
ఈ విషవలయం లోనుండి
ఎప్పుడు బయటపడేది?!
ఎవరికి వారు ఈ ప్రతిజ్ఞ ఎప్పుడు చేసేది?!
నన్ను పేరంటానికి పిలిస్తే ఆశీర్వదించి వస్తా
నన్ను భోజనానికి పిలిస్తే భోంచేసి ఆ ఇంటిని దీవిస్తా
నన్ను పార్టీకి పిలిస్తే స్నేహితులకి
నా ఉనికి సమయం స్నేహం బహుమతిగా ఇస్తా
ఎదుటివారి అవసరాన్ని బట్టి ఆదుకుంటా
నా సంపదని శక్తియుక్తులను
ఎక్కడ ఎక్కువ మానవతా విలువ ఉంటుందో
అక్కడే పెట్టుబడి పెడతా
(రాను రానూ పెరిగిపోతున్న ఈ బహుమతుల ఆర్భాట వలయం నుండి బయటపడే ఉద్దేశ్యంతో, ప్రతి ఒక్కరిలో మార్పును స్వాగతిస్తూ, ఇప్పటికే బయటపడిన అభిమన్యులకు ఈ బహుమతి అంకితం)
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ha ha ha ..bagundi...ee kavitha chadivi..mimmalni perantalaki..partys ku pilavaremo :-)
వేరేవాళ్ళిచ్చిన బహుమతిని రేటుతో సహా తెలుసుకుని తరువాత అవకాశం వచ్చినప్పుడు తిరిగి "చెల్లించడం" ఈ మధ్య వచ్చిన మానవసంబంధాల బిజినెస్ లో ఒక ముఖ్యమైన భాగం. చాలా బాగా వివరించారు.
మీ బ్లాలు ఇప్పటివరకూ www.koodali.org లో కనబడలేదు...కారణం?
Post a Comment