Sunday, June 8, 2008

ఎట్టుండాల

మాట్టాడితే
ఎన్నపూస రాసినట్టుండాల
నిలబడితే
ఎన్నుపూస నిటారుగుండాల

నడిసొత్తే
సింగమోలె ఉండాల
కూకుంటే
మంచుకొండగుండాల

నవ్వితే
నిసిరాతిరి ఎన్నెల నిండాల
ఏడిత్తే
సోకం ఉప్పెనై ముంచాల

సిందేత్తే
సివమెత్తినట్టుండాల
పాడితే
పడగలు నాట్టెమాడాల

గీరలో
నిరుపేదగుండాల
ఇనయంలో
లచ్చాదికారి కావాల

దానంలో
ఎముకలేకుండాల
దైన్నెంలో
దైర్నంగుండాల

కట్టంజేత్తే
పట్టింది బంగారంగావాల
నమ్మితే
నడిసంద్రం సీలాల

జట్టుకడితే
పేనమివ్వాల
అన్నాయంసూత్తే
అగ్గి కురవాల

మాటిత్తే
నిలబెట్టాల
మనసిత్తే
కడబట్టాల

పేమిత్తే
ఎదుటోడి సుకం కోరాల
పేనమిత్తే
రెండంచులకత్తి గుండెలు సీల్చాల

మడిసుంటే
దైవం కొలువుండాల
ఎదనిండా
పేమ పొంగిపొర్లాల

(మడిసంటే ఇట్టుండాలని వోల్ల జనమంతో సాటిసెప్పిన బెమ్మరుసులకు అంకితం)

1 comment:

Unknown said...

wowwww....i feel this is best of urs....